///// ఆలోచనాలోచనాలు ///// ***** అవధాన మధురిమలు ***** శతావధాని శ్రీ పళ్ళె పూర్ణప్రజ్ఞాచార్యులు. సమస్యాపూరణములు ;--- 1* "" అత్తకోడండ్ర కేనాఁడు హత్తెఁజెలిమి."" పూరణము ;----"తే.గీ. చాల ధనమున్న వానికి చదువు నాస్తి / డంబుగల పండితునకొ! యన్నంబు సున్న / కారణంబేమియని యడుగంగ నేల / అత్త కోడండ్ర కేనాఁడు హత్తెఁ జెలిమి? 2* "" రామరాజ్యాన నెపుడుఁబోరాటె ప్రజకు."" పూరణము;--- "తే.గీ. నా వయిపుఁ జూచె రాముండు నన్నుఁ బిలిచె / నేనె రామున కిష్టుఁడ నేనె ప్రియుఁడ / నేనె నే నేనె నేనె నే నేనె యంచు / రామరాజ్యాన నెపుడుఁబోరాటె ప్రజకు." 3* ""కన్యనుగూడు భాగ్యమదిగల్గుట యెంతటి వారికో తుదిన్."" పూరణము;---- "ఉ. ధన్యులు గాంగతీరము సదా నిలయంబుగనుండువారు, సా / మాన్యులు గంగ గంగ యను మాత్రనఁ బాపవిముక్తులౌదురే / మాన్యఁ దలన్ ధరించె శశిమౌళి తథా విధ విష్ణుపాదజన్ / గన్యను గూడు భాగ్యమదిగల్గుట యెంతటి వారికో తుదిన్." 4*"" మేకను జూచి సింగమది మ్రింగునొ! యంచుఱికెన్ భయంబునన్."" పూరణము ;---- "ఉ. ఏక శతంబు వ్యాఘ్రముల నిర్వదియొక్క గజంబులన్ ద్రుటిన్ / వే కబళించితిన్ వ్రతము వీడను మ్రింగమి నొక్క సింగమున్ / బోకుమటంచుఁ బై దుముకుపోఁ యను గడ్డము మీసలున్న యా / మేకఁను జూచి సింగమది మ్రింగునొ! యంచుఱికెన్ భయంబునన్." 5* "" కూతురు కోడలయ్యెఁదన కూర్మి సుతుండటు పెండ్లియాడగా! "" పూరణము;---" ఉ. చేతము పల్లవింప బుధశేఖరులెల్ల నుతింప రామ భూ / నేత పురారిచాపమును నిర్దళనంబొనరింప సీత హ / ర్షాతతయై వరించె, నపుడా రఘురాముని తండ్రి కల్ల క్ష్మా / కూఁతురు కోడలయ్యెఁదన కూర్మి సుతుండటు పెండ్లియాడగా." దత్తపదులు;----1* "" యతి చెడె-- మతి చెడె -- గతి చెడె -- రతి చెడె "" పదములను ప్రాస స్థానములో వుంచి అందమైన పద్యం. " చం. యతి చెడె శిష్యురాలుగ ధనాంగన యోర్తుక చెంతఁజేరుటన్ / మతి చెడె నాలతాంగి యసమానసురూపనిరీక్షఁజేసి సత్ / గతి చెడె దాని దోస్తి పెరుగంగ గ్రమంబున బ్రహ్మ విద్యపై / రతి చెడె దుష్ట సంగతి విరాగిని రాగినిగా నొనర్చెడిన్." 2* "" క్షారము -- సారము -- వీరము -- క్షీరము "" అను పదములతో సాహితీపరమగు పదములు వచ్చునట్లు ఉత్పలమాలలో పద్యం. " ఉ. కారము క్షారశబ్దమునఁ గల్గె నలంకృతులందు నొక్కటై / సారము రాజిలున్ నవరసంబులలోఁ గడు సుప్రసిద్ధమై / వీరము పొల్చుఁ బాకముల విశ్రుతమై సులభానుభావ్యమై / క్షీరము పేరుగన్న కవిసింహుల కబ్బములందుఁగన్పడున్." 3* "" మూలము -- కూలము -- వాలము -- కాలము "" పదములతో పద్యము. " కం. మూలము ముఖ్యము వ్యాఖ్యకు / కూలము ముఖ్యంబు నదులకున్ దీర్ఘంబౌ / వాలము ముఖ్యము కపులకుఁ / గాలము ముఖ్యంబు సర్వ కర్మంబులకున్." 4*"" మంటిని -- కంటిని -- వింటిని -- అంటిని "" పదములతో "" భారతార్థములో"" పద్యం. " ఉ. మంటిని రాజు లెల్లరును మన్ననఁజేయగ రాజరాజుగా / కంటిని రాయబారమునకై యిటు వచ్చిన నిన్ను నీనుడుల్ / వింటిని, వాడి సూదిమొన వెట్టిన యంతటి నేలనేని నీ / నంటిని నాలమె శరణమంటిని జెప్పుము వారి కచ్యుతా!" 5* ""భీమ -- అర్జున -- నకుల -- సహదేవ "" పదములతో "" రామాయణార్థముతో"" పద్యం. " తే. గీ. అహితగణభీమ బలుఁడు యశోర్జునుండు / వికరుణా మరలిపునాగ నకులనిభులు / కపులు సహదేవతాంశులు కదలిరాఁగ / యనియె రామచంద్రుఁడు రణోర్వి." (డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యా సర్వస్వం సౌజన్యంతో) తేది 25--10--2023, బుధవారం, శుభోదయం.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి