25, అక్టోబర్ 2023, బుధవారం

భక్తి - దాని ఆవశ్యకత

 భక్తి - దాని ఆవశ్యకత


మనమతంలో అద్వైతమనీ, ద్వైతమనీ, విశిష్టాద్వైతమనీ మూడు తెరగులు ఉన్నప్పటికీ, ఈ మూడుమార్గాలనూ అనుసరిస్తున్నా; భక్తియెడల, దానికిగల ప్రాముఖ్యమునెడల ఎవరికీ భేదాభిప్రాయం లేదు. వీరందరూ భక్తియొక్క ఆవశ్యకతను గుర్తించియే ఉన్నారు. ప్రపంచంలో ఎంతో వైవిధ్యంతో కూడిన ప్రాణికోటిలో ఒక్క మానవుడుమాత్రం నిలువుగా పెరుగుతున్నాడు. తక్కినవన్నీ అడ్డంగా పెరుగుతున్నవి. అందుచే మానవునికి భౌతికంగానేకాక, పారమార్ధికంగా కూడా ఎత్తుగా పెరుగవలసిన ఆవశ్యకత ఎంతైనాఉన్నది. అట్టిఔన్నత్యం వానికి ఒక్కజ్ఞానమూలంగానే కల్గుతున్నది. ఆ జ్ఞానమే వానికి శాంతినిస్తున్నది. మృగములకంటె మనిషి ఎన్నోవిధాల బాధపడుతున్నా, కష్టాలలో ఈదుతున్నా వానికి జ్ఞానమనే ఒక్క పవిత్రవస్తువు వుండటంవల్ల, తక్కిన జీవకోటికంటే వానికొక ఔన్నత్యం సహజంగా కల్గుతున్నది. మనము సత్యస్వరూపం తెలుసుకోవాలంటే దానికి సాధనం జ్ఞానమే. అందుచేత అందానికీ, శాంతికీ మూలకందం జ్ఞానమే. ఆనందకారకం జ్ఞానం. జ్ఞానమే ఆనందం. ఆనందమే పరమమంగళం. ఈ జ్ఞానానంద స్వరూపమే ఈశ్వరస్వరూపము, ఐశ్వర్యమూ, ఆయన పరమాత్ముడు. ఆయనలో విశిష్టమైన గుణాలు అన్నీ అణగిఉన్నవి. జలములకంతా జటధి ఎట్లు పరమావధియో, అట్లే పరిపూర్ణతకు ఈశ్వరుడొక్కడే నిధి. ఆయనకు ఇతరములేదు. ''ఏకమేవాద్వితీయం బ్రహ్మ'' అనుటయే అద్వైతం. ''ఇదమ్ సర్వమ్ పురుష ఏవ'' అని శ్రుతి చెప్పుచున్నది. శ్రీశంకరభగవత్పాదులవారు దీనినే యుక్తిచేతా, అనుభవంచేతా నిరూపించారు. 

ఐతే ఈఅద్వైత సత్యాన్ని మనం బుద్ధితో గ్రహిస్తేచాలదు. అనుభవంలోకి తెచ్చుకోవాలి. అది అనుభవానికి రావాలంటే ఈశ్వరానుగ్రహం అవసరం. 'ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మద్వైతవాసనా' మొదట ఈశ్వరుడు వేరు, మనంవేరు అన్న ద్వైతభావనతో భజన ప్రారంభమవుతుంది. ఐనప్పటికీ సాధకుని మనోభావం - పరమాత్మ తనకు వెలిగా ఉన్నాడనికానీ, మరోప్రపంచంలో ఉన్నాడనికానీ ఉండదు. పరమాత్మ తనలో అంతర్యామిగా ఉన్నాడనీ, ప్రపంచంలో ప్రతిఅణువులోనూ ఆ పరమాత్మచైతన్యం ఉద్దీపితమై ఉంటున్నదనీ, ఆయన అణువులో అణువై, మేరువులో మేరువై ఉన్నాడనీ సాధకుని మనోభావానికి తట్టుతుంటుంది. గీతలో కృష్ణ పరమాత్మ ''భక్త్యా మా మభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్త్వతః'' అని సెలవిచ్చినారు. 


ఇందు 'భక్త్యా' అన్న పదప్రమోగంవల్ల జ్ఞానలక్షణమైన భక్తిచేతనే పరమాత్మ నిజతత్త్వం తెలుసుకోగలమని గ్రహించాలి. అందుచేత అన్ని మతాలవారూ, భక్తి ఆవశ్యకతను గుర్తించి ఈశ్వరానుగ్రహంకోసం పాటుపడితేకాని, పరమాత్మతత్త్వం అవగతంకాదు. అందుచేతనే ఆచార్యులందరూ 'భక్తి, భక్తి' అని బోధిస్తారు. భక్తియెడల భేదాభిప్రాయం ఎవరికీ లేదు. 

భక్తి మనకు శైశవంనుంచే అభ్యాసం కావాలి. విద్యాభ్యాసకాలంలో సారస్వత సముద్ర తరణానికి భక్తినావను వదలరాదు. బడికిపోయే పిల్లలు విద్యాభివృద్ధికోసం అనుదినమూ సరస్వతిని ఉపాసించడం మంచిది. ఒక పదినిమిషాలైనా సరస్వతిముందు మౌనంగా ధ్యానం చేయడం అత్యవసరం. ప్రతిదినమూ పాఠాలు చదువుకోడానికి ముందు ఈ ధ్యానం చేయడం మంచిది. ఏదో పదిశ్లోకాలు వల్లించినాము కదా. ఇక పూజ ఐనట్లే అన్న మనోభావం ఉండరాదు. ధ్యానంలో భావశుద్ధి ప్రధానం. భావము గాఢతయేప్రార్థన కీలకం. నిశ్చలమైన భక్తితో సరస్వతిముందు మౌనంగా కూర్చుండి పది నిమిషాలపాటు గురుధ్యానమూ, దైవతధ్యానమూ, ప్రగాఢమైనభావంతో చేయడమే ప్రార్థనారహస్యం. ఇట్టి అలవాటు ముదిరేకొద్దీ మనలో దైవికమైన భావాలుత్పన్నమై, దుష్టాలోచనలు మనోరంగంనుంచి క్రమక్రమంగా తొలగిపోతవి. అందుచే చిన్నపిల్లలు తమ పెద్దలనుండి ప్రార్థనారీతులను తెలిసికొని వైదిక సత్యాలను జీవితంలో నెలకొల్పుకోడానికి చిన్నతనంనుంచే ప్రయత్నించాలి. 


ఐతే మనకు భక్తి ఉన్నదా లేదా అనడానికి సాక్ష్యం దైవాజ్ఞలను మీరి నడవకుండా ఉండటం. 'వేదో నిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం' 'నాకు భక్తిఉన్నది. కాని నేను భగవదాజ్ఞాప్రకారం మాత్రం నడుచుకోవటంలేదు' అని అంటే అర్థంలేని మాట. నిజమైన భక్తికి చిహ్నం విహితకర్మానుష్ఠానం. వారి వారి కర్మలను వారు చక్కగా ఆచరించి పరమాత్మకు అర్పించడం అలవరచుకోవాలి. ప్రతియొక్కరూ నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడం విధి. వైష్ణవులు వీనిని ఎంతో అర్థవంతంగా ఆజ్ఞాకైంకర్యములని వ్యవహరిస్తూ ఉంటారు. వైదిక కర్మాచరణకంటే వేరు ఈశ్వరారాధనలేదు. అది వ్యక్తిపరంగా మోక్షాన్ని ఇచ్చి లోకానికంతా సౌఖ్యాన్ని కలుగజేస్తుంది. ఇట్లు మోక్షమార్గంలో కర్మ, భక్తి, జ్ఞానముల ఆవశ్యకతను మనం గుర్తించి, ''మోక్షకారణ సామగ్ర్యాం భక్తి రేవ గరీయసీ'' అన్న ఆచార్యుల వాక్యం స్మరిస్తూ, భక్తి ప్రాధాన్యం మనం మరువకుండా ఉందాము.                        


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।




#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: