🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 74*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
శ్రీరామకృష్ణుల అంతిమ రోజులను సమీపిస్తున్నారని అందరికీ అర్థమయింది. అందరూ శ్రీరామకృష్ణుల సేవలో మనఃస్ఫూర్తిగా పాల్గొన్నారు. నరేంద్రుడు వారినందరినీ సమైక్య పరచి, అందరూ కలసి అధ్యయనం, చర్చలు, పాటలు, ధ్యానం ఇత్యాది ఆధ్యాత్మిక సాధనలు అనుష్టించసాగారు. ఒక వైపు శ్రీరామకృష్ణుల నిస్వార్థ ప్రేమ, మరొక వైపు నరేంద్రుని సోదరప్రేమ అందరినీ అక్కడ కట్టిపడేసింది.
కొందరి మనస్సుల్లో ఒక సంకోచం ఊగిసలాడింది శ్రీరామకృష్ణుల వ్యాధి ఒక అంటువ్యాధా? బహుశా అలా అయివుంటే తమకూ సంక్రమించవచ్చు కదా అని కొందరు భయపడ్డారు. ఇది గ్రహించిన నరేంద్రుడు ఒక రోజు అందరి సమక్షంలో, శ్రీరామకృష్ణులు త్రాగి మిగిల్చిన రవ్వపాయసం తీసుకొని త్రాగేశాడు. అందులో శ్రీరామకృష్ణుల లాలాజలం కలిసింది. ఇది చూసిన తరువాత యువకుల సందేహం తీరింది.
నరేంద్రుడూ, తక్కిన యువకులూ శ్రీరామకృష్ణుల వ్యాధిని వ్యాధిగానే పరిగణించారు. కాని గృహస్థ శిష్యులయిన గిరీశ్, రామచంద్రదత్తా ప్రభృతులు ఈ వ్యాధికి ఒక అమానుష రంగు పులిమారు. శ్రీరామకృష్ణులు ఒక అవతార పురుషుడు; ఆయన సంకల్ప మాత్రానే ఈ వ్యాధిని సంక్రమింపజేసుకొన్నారు. ఏదో ఒక రోజు హఠాత్తుగా తమ దివ్యశక్తిని ప్రదర్శించి వ్యాధిని నయం చేసుకొంటారని వారు విశ్వసించారు.
కాని ఈ వ్యాధిని నిమిత్తమాత్రంగా కనబరిచారు శ్రీరామకృష్ణులు. "నా వ్యాధి నిమిత్తమాత్రమే. ఈ వ్యాధి మీ అందరినీ ఐక్యం చేసింది" అన్నారాయన. ఆ వ్యాధి కారణంగానే భక్తులందరూ ఐక్యం కాగలిగారు; వారి మధ్య ఒక అనురాగబంధం పెంపొందింది; అది భవిష్యత్ సంఘానికి ఆధారభూతమయింది.
ఈ రోజుల్లోనే నరేంద్రుని కార్యం ప్రారంభమయిందని చెప్పవచ్చు. ఒక కొత్త యుగాన్ని సృష్టించడానికి శ్రీరామకృష్ణులు ఏతెంచారు. ఇందులో నూతన చింతనలు, కొత్త మార్గాలు రూపొందుతాయని నరేంద్రుడు గ్రహించాడు. కాని తక్కినవారు దానిని గ్రహించడం కాదు కదా, అలా యోచించడం కూడా చేయలేదు. అందువలన భక్తులలో పలువురు పాత మార్గాలలోనే వెళ్లడానికి ఉపక్రమించారు. వారిని దారిలోకి తీసుకు రావడం నరేంద్రుని ప్రధానమైన పని.
శ్రీరామకృష్ణులు ఒక రోజు హఠాత్తుగా అతీంద్రియ శక్తితో తన వ్యాధిని నయం చేసుకొంటారని నమ్మిన వారికి నరేంద్రుడు నిజాన్ని స్పష్టంచేసి, "శ్రీరామకృష్ణుల శరీరమూ పంచభూతాత్మకమయి నది, ప్రకృతి నియమాలకు లోబడింది. ఒక రోజు అది నశించే తీరాలి. కనుక హఠాత్తుగా అతీంద్రియశక్తితో ఆయన వ్యాధి నయమవుతుందని ఆశించరాదు". అని స్పష్టంగా తెలియచేశాడు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి