25, అక్టోబర్ 2023, బుధవారం

మోక్ష సాధన లో

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...  


*మోక్ష సాధన లో మొదటి మెట్టు..*


*(ఏడవ రోజు)*


శ్రీ స్వామి వారికి పదమూడు యేండ్లు వచ్చేసరికి కుటుంబసభ్యులకు ఆయన తత్వం అర్ధం కాసాగింది..ఈ బాలుడికి భక్తి మీద అనురక్తి వుందికానీ చదువు మీద ధ్యాస లేదని..ఆ వయసులోనే మాంసాహారం విడిచిపెట్టేసారు..కేవలం సాత్వికాహారం భుజించడం అలవాటు చేసుకున్నారు..కానీ..కాషాయం కట్టిన ప్రతి వారి దగ్గరా ఆధ్యాత్మిక బోధ చేయమని  అడగటం ప్రారంభించారు..అప్పుడు శ్రీ స్వామివారి పెద్దన్నయ్య గారు, దగ్గరకు పిలచి..కనపడ్డ ప్రతి వాడూ గురువు కాదనీ..ముందుగా దైవాన్ని ప్రార్ధించడం అలవాటు చేసుకోమని..మృదువుగా చెప్పారు..ఈ మాటలు శ్రీ స్వామివారి కి సూటిగా తగిలాయి..


ఎర్రబల్లె గ్రామం లోనే బాల్య వితంతువైన "యల్లకర లక్షమ్మ" అనే వృద్ధురాలు నిరంతర దైవ నామ స్మరణలో కాలం గడుపుతూ ఉండేది..ప్రతి నిత్యం నిష్ఠతో పూజ చేసేది..ఆధ్యాత్మిక గ్రంథాలలోని సారాన్ని గ్రహించిన లక్షమ్మ అహంకార రహితంగా  నిరాడంబరంగా జీవనం సాగించేది..ఆమె దృష్టిలో శ్రీ స్వామివారు పడ్డారు..మొదట కొంతకాలం పాటు శ్రద్ధగా ఈ బాలుడి గురించి పరిశీలించింది..ఆవిడకు ఈ బాలుడు సామాన్యుడు కాదనీ..సాక్షాత్తూ ఆ దత్తాత్రేయుడి అంశ ఇమిడినట్లుగా వున్న ఒకానొక దైవకళ ఇతనిలో ఉట్టిపడుతోందనీ గమనించింది..శ్రీ స్వామివారిని చేరదేసింది..శ్రీ స్వామివారికీ..తాను తల్లి ఒడిలోకి చేరినట్లు భావించారు..


మోక్ష సాధనకు ఆచరించవలసిన మార్గాలను లక్షమ్మ గారు శ్రద్ధతో శ్రీ స్వామివారికి బోధించింది..శ్రీ స్వామివారు తాను చెప్పిన విషయాలను ఆకళింపుచేసుకోవడమూ..ఒక్కమారు వినగానే హృదయస్తం చేసుకోవడమూ..తనకున్న అనుమానాలను వినయపూర్వకంగా అడిగి జవాబు తెలుసుకోవడమూ..చూసిన లక్షమ్మ గారికి..తన ఊహ సరైనదేనని..ఇక ఎక్కువ కాలం ఉపేక్షించుకుండా ఈ బాలుడిని సరైన ఆశ్రమం లో చేర్పించి..మరింతగా సాధన చేయిస్తే..అతను గురు స్థానం పొందుతాడనీ...అని నిర్ణయానికి వచ్చి..శ్రీ స్వామివారి కుటుంబ సభ్యులతో ఆమాటే చెప్పింది..


ఈ లోపల శ్రీ స్వామివారు రోజూ ధ్యానం చేయడం ప్రారంభించారు..తనకనువైన ప్రదేశం కనబడగానే..ధ్యానం లోకి వెళ్లిపోవడం మొదలెట్టారు..అది నిముషాలు కావొచ్చు..గంటలు కావొచ్చు..అలా నిశ్చలంగా కూర్చుండిపోయేవారు..ఎర్రబల్లె గ్రామస్థులలో కొందరు హేళన కూడా చేయసాగారు..శ్రీ స్వామివారు అవేమీ తనకు పట్టనట్టు వున్నా..కుటుంబసభ్యులకు మనస్తాపం కలుగుతుంది కదా..అప్పుడే లక్షమ్మ గారు, తన సలహాను శ్రీ స్వామివారి అన్నయ్యకు చెప్పారు..


చక్కటి రూపం తో ఉన్న తమ పిల్లవాడిని..సన్యాసిగా మార్చడం ఎవరికి ఇష్టం ఉంటుంది?..కానీ..ఈ బాలుడేమో అటు వ్యవసాయానికి..ఇటు చదువుకూ..రెండింటికీ పనికిరాకుండా పోతున్నాడు..సరే ఆఖరి ప్రయత్నంగా మెట్రీక్ పరీక్షకు కూర్చోబెడదామని..అది పాస్ అయితే..పై చదువులు చదివించి..తమ దారిలోకి తెచ్చుకుందామని అనుకుని..శ్రీ స్వామివారితో ఆమాటే చెప్పారు..తనకు ఈ లౌకిక చదువులమీద ఆసక్తి లేదనీ..తన మార్గం వేరనీ..తెగేసి చెప్పేసారు..లక్షమ్మ గారి సలహా ప్రకారం తానొక ఆశ్రమం లో చేరి..తన ఆధ్యాత్మిక సాధన ను మెరుగుపరచుకొని..మోక్ష మార్గాన్ని చూసుకుంటానని ఖరాఖండిగా తేల్చేసారు!..


ఇప్పటికిప్పుడు ఈ బాలుడిని అక్కున చేర్చుకునే ఆశ్రమం ఎక్కడ ఉంది?..ఈ ప్రశ్నకు కూడా లక్షమ్మ గారే జవాబు చూపించారు..శ్రీ కాళహస్తి సమీపంలోని "ఏర్పేడు" లోగల "వ్యాసాశ్రమం" లో చేర్చమని చెప్పారు..సరే నన్నారు..


వ్యాసాశ్రమంలో అడుగు పెట్టారు శ్రీ స్వామివారు..ఇంతకాలం ధ్యానం కోసం అటూ ఇటూ తిరిగిన శ్రీ స్వామివారికి..ఆ వ్యాసాశ్రమం తనకోసమే నిరీక్షిస్తున్నట్లు తోచింది..మనసులో తాను చేరవలసిన చోటుకే చేరాననే సంతోషం కలిగింది..ఇది తన ఆధ్యాత్మిక జీవన యానం లో మొదటి మజిలీ అని నిశ్చయనికొచ్చారు..తనకు ఈ మార్గం చూపిన లక్షమ్మ గారికి మనసారా నమస్కారం చేసుకున్నారు...


ఆశ్రమవాసం..ఆధ్యాత్మిక శిక్షణ!...రేపు...


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380. & 99089 73699).

కామెంట్‌లు లేవు: