25, అక్టోబర్ 2023, బుధవారం

అనుకూల నివేదిక.

 *అనుకూల నివేదిక..*


ఒక శనివారం నాటి సాయంత్రం వేళ..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి పల్లకీసేవ మరో పది నిమిషాలకు ప్రారంభం అవుతుందనగా..హడావిడిగా ఒక దంపతులు స్వామివారి మందిరం లోపలికి వచ్చారు.."స్వామివారి పల్లకీసేవ లో పాల్గొంటామండీ..మాకూ టికెట్ ఇవ్వండి.." అన్నారు..మా సిబ్బంది వారి పేర్లు నమోదు చేసుకొని టికెట్ ఇచ్చారు..ఆ దంపతులు గబ గబా కాళ్ళూ చేతులు కడుక్కొని..మంటపం లోపలికి వచ్చి స్వామివారి పల్లకీ వద్ద కూర్చున్నారు..స్వామివారి పల్లకీసేవ సుమారు రెండు గంటలపాటు జరుగుతుంది..పల్లకీసేవ పూర్తి అయిన తరువాత..భక్తులందరూ అన్నప్రసాదం కొరకు అన్నదాన సత్రం వద్దకు వెళ్లారు..ఈ దంపతులు మాత్రం స్వామివారి మంటపం లొనే కూర్చున్నారు.."మీరు భోజనం చేశారా?" అని మా సిబ్బంది వారిని అడిగారు.."లేదండీ..ఈరోజు శనివారం..మేము శనివారం రాత్రికి ఆహారం తీసుకోము.." అన్నారు..


ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం స్వామివారి సమాధికి అర్చకస్వాములు ఇచ్చే ప్రత్యేక హారతులు కళ్లకద్దుకొని..స్వామివారి సమాధి దర్శించుకున్నారు..మధ్యాహ్నం హారతులు అయిన తరువాత..అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భోజనం చేసి..వెళ్లిపోయారు..సరిగ్గా మరో నాలుగు రోజుల తరువాత..గురువారం నాటి ఉదయం ఆ దంపతులు మళ్లీ స్వామివారి మందిరానికి వచ్చారు..స్వామివారి సమాధిని దర్శించి..తమ గోత్రనామాలతో అర్చన చేయించుకొన్నారు..ఆ తరువాత నా దగ్గరకు వచ్చారు.."ప్రసాద్ గారంటే మీరే కదా..?" అన్నారు.."అవును.." అన్నాను..నా ప్రక్కనే కూర్చున్నారు.."మేము పోయిన శనివారం నాడు ఇక్కడికి వచ్చామండీ..పల్లకీసేవ లో పూజ చేయించాము..ఆదివారం నాడు స్వామివారి సమాధి దర్శించుకున్నాము..ఒక సమస్య లో ఉన్నామండీ..బాగా మానసిక ఆందోళనగా ఉన్నది..ఏమి చేయాలో తోచటం లేదు..అందుకని మళ్లీ ఈరోజు ఈ స్వామివారి మందిరానికి వచ్చాము..నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను..ఇరవై ఎనిమిదేళ్ల సర్వీసు..ఒక్కసారి కూడా ఎవరితోనూ మాట పడలేదు..అటువంటిది గత ఆరునెలల క్రితం నా పై అధికారి తో విబేధాలు వచ్చాయి..నా మీద ఆరోపణలు చేసి..ఎంక్వయిరీ వేయించారు..ఇప్పుడు నన్ను వేధిస్తున్నారు..నేను ఏ తప్పూ చేయలేదు..కానీ వాళ్ళు నన్ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి..ఉద్యోగం లోంచి తీసివేయాలని అనుకుంటున్నారు..పెద్దగా రాజకీయ పలుకుబడి లేనివాడిని..డబ్భులు లంచంగా ఇచ్చుకోలేను..అందుకని ఈ స్వామివారి పాదాలు పట్టుకుందామని వచ్చాను..స్వామివారిదే భారం అని అనుకున్నాము..నేను ఆందోళన చెందుతూ ఉంటే..తాను కూడా నాతో పాటు బాధపడుతూ ఉన్నది..వచ్చే వారంలో చివరి రిపోర్ట్ ఇస్తారు..అందుకని మళ్లీ వచ్చాము.." అన్నారు..


"శరణాగతి చెందితే స్వామివారు తప్పక కరుణిస్తారు.." అని చెప్పాను.."అదే నమ్మకం తో ఉన్నామండీ..." అన్నారు..ప్రక్కరోజు శుక్రవారంనాడు మళ్లీ ఒకసారి స్వామివారి సమాధి దర్శించుకున్నారు..ఆరోజు మధ్యాహ్నం వెళ్లిపోయారు..మరో వారం గడిచింది..ఆ తరువాత శనివారం మధ్యాహ్నం ఆ దంపతులు స్వామివారి మందిరానికి వచ్చారు.."ప్రసాద్ గారూ..పోయిన వారం నా మీద చివరి రిపోర్ట్ రాస్తామని చెప్పిన అధికారి బదిలీ అయ్యారండీ..కొత్తగా ఇంకా ఎవరూ రాలేదు..హఠాత్తుగా ఇలా ఎలా జరిగింది అని మా ఆఫీస్ వాళ్ళు అనుకుంటున్నారు..ప్రస్తుతానికి సమస్య వాయిదా పడింది..అది తీరిపోతే నాకు శాంతి గా వుంటుంది.." అన్నారు..ఆరెండురోజులు స్వామివారి మందిరం వద్దే వుండి..వెళ్లారు..ఆ తరువాత మూడు శని ఆది వారాలు ఆ దంపతులు స్వామివారి మందిరానికి వచ్చి..స్వామివారి సమాధి వద్ద వేడుకొని వెళ్లారు..మరో పదిరోజుల తరువాత..ఆ దంపతులు స్వామివారి మందిరానికి వచ్చారు..పల్లకీసేవ తరువాత..నా వద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ..అన్నివిధాలా నాకు అనుకూలంగా రిపోర్ట్ రాసారండీ..బదిలీ అయిన ఆఫీసర్ స్తానం లో వచ్చిన ఆయన..అన్నివిధాలా విచారించి..నామీద ఆరోపణలు ఏవీ ఋజువు కాలేదని తన రిపోర్ట్ లో రాసి పంపారండీ..పైగా..మీకు అనుకూలంగా నివేదిక ఇచ్చాము అని నాతో చెప్పారు..ఎంతో ఆనందం వేసింది..ఎంతో మానసిక క్షోభ అనుభవించాము..స్వామివారి దయవల్ల అది తీరిపోయింది..మీరన్నది నిజమే.."శరణాగతి చెందితే..స్వామివారు కరుణిస్తారు.. అది సత్యం"..అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు..


"ఈ వయసులో ఆ దంపతుల మనోవేదన రూపుమాపారు..స్వామివారి కరుణ కు శరణాగతి చెందిన ప్రతి ఒక్కరూ పాత్రులే..!!"


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: