30, డిసెంబర్ 2023, శనివారం

గుఱ్ఱం గుడెక్కింది*

 *సామెత కథ*


*గుఱ్ఱం గుడెక్కింది* 


దొరలు మనదేశం వచ్చిన కొత్తలో, వాళ్ళు ఊళ్ళో అడుగు పెట్టటానికి పల్లెటూరి ప్రజలు వప్పుకొనేవారు కాదు. ముఖ్యంగా అగ్రహారాల్లో బ్రాహ్మలు సుతరామూ వాళ్ళను రానిచ్చేవాళ్ళు కాదు. ఎందు కంటే, దొరలు అనగా సీమదేశంనించి దిగిన మ్లేచ్ఛులనీ, వాళ్ళ సంపర్కం తగిలితే తమ ప్రదేశం మైలపడిపోతుందనీ వాళ్ళ వుద్దేశం.


అటువంటి కాలంలో— దొరలు కలెక్టర్లుగా, జడ్జీలుగా పెద్ద పెద్ద ఉద్యోగస్థులుగా బస్తీలకు వచ్చి చేరుకొనే వారు, ఉద్యోగరీత్యా చిన్నచిన్న గ్రామాలలో కూడా వారు మకాం చేయవలసి వచ్చేది. ఆవిధంగా మకాంచేసిన దొరలకు ఎదురు చెప్పడమంటే పల్లెటూరి వాళ్లకు భయంగా వుండేది. 


అలా భయపడకుండా ఉండే వాళ్లు గోదావరిజిల్లా కోనసీమలోని *పేరూరు* ద్రావిడులు. వారు దొరలను కాదుకదా, దొరలను పుట్టించిన బ్రహ్మను కూడా లక్ష్యం చేయరన్నమాట. అంతటి ప్రతిభ, పలుకుబడి గల ఆ పేరూరు ద్రావిడులు ఏ పేచీలు వచ్చినా వాళ్ళలో వాళ్ళే తగవులు పరిష్కారం చేసుకొనేవారు. అంతేగాని, కోర్టులకూ గిర్టులకూ తిరిగి పిరికిపంద అనిపించుకునేవారు కాదు.


ఒకసారి పేరూరులో ఒక నేరం జరిగింది. అప్పటికే దొరలు కలక్టర్లుగా వచ్చి, పల్లెలలో మకాం చేసి, కేసులు విచారణ చేయటం విరివిగా సాగుతూ వుంది. అన్ని పల్లెలకు వచ్చినట్టుగానే, కేసు విచారణ కోసం పేరూరులో మకాం పెడదామని ఒక కలెక్టరు గుఱ్ఱం ఎక్కి నవుకర్లతో సహా బయల్దేరాడు.


కలెక్టరుగారు తమ ఊరి పొలిమేరకు వచ్చారనే వార్త పేరూరు ద్రావిళ్ళకు

తెలిసింది. వెంటనే, వారిలో హేమాహేమీలు కొంతమంది ఊరివెలుపల కలెక్టరుగారి వద్దకు వెళ్ళి, "అయ్యా, దొరగారూ! పరాయిదేశస్థులు అగ్రహారంలో ప్రవేశించటానికి వీలులేదని మా పెద్దలు ఏర్పాటు చేశారు. కనుక, మా గ్రామమర్యాద తమరు పాటించాలని కోరుతున్నాము ' అంటూ వినయపూర్వకంగా చెప్పారు.


గర్వంతో, వినీ విననట్లు నటించి నవ్వేసి ఊరుకొన్నారు. ఎన్ని విధాల చెప్పినా వాళ్ల మొర దొరగారి చెవికి ఎక్కేటట్టు కనిపించలేదు. మరి కొంచెం సేపటికల్లా కలక్టరుగారు ఊళ్లో దిగారు. దేవాలయం పక్కనే వేయబడిన డేరాలో ప్రవేశించి, కేసు విచారణ ప్రారంభించారు.


రెండు మూడు రోజులు విచారణ జరిగింది. కలెక్టరుగారి గుఱ్ఱాన్ని

బంట్రోతులు డేరా వెనుక పక్కన కట్టిపెడుతూ ఉండే వారు. మూడోరోజున, కలెక్టరుకు తగిన ప్రాయశ్చిత్తం చేయాలనుకొని, ద్రావిడులు నిశ్చయించారు. ఆరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా, వారు నడుములు బిగించి, ఒకొక్కరు ఒకొక్క గడ్డిమోపు చొప్పున అంచీలమీద తెచ్చి, గుడికి దాపుగా ఏటవాలుగా, చక్కగా మెట్లు కట్టినట్టుగా గుడి మండపం మీది వరకూ పేర్చి, అమర్చారు. తరువాత, గుఱ్ఱాన్ని కట్టిన చోటునుండి, గుడి పైదాకా వారు పేర్చిన మోపుల మీద నవనవలాడే పచ్చగడ్డి ఒత్తుగా చల్లి, ఆ తర్వాత గుఱ్ఱానికి కట్టిన తాడు కాస్తా తొలగించివేశారు.


గుఱ్ఱం ఆ పరకలను అందుకొంటూ, ఒకొక్క అడుగే వేసుకొంటూ, ఆ మోపుల మీదినించి సులువుగా గుడిమీదికి ఎక్కిపోయింది.


తక్షణమే ఎవరు తెచ్చిన మోపు వారు తీసివేసి ఇళ్ళకు పట్టుకుపోయారు.


తెల్లవారింది. దొరగారి గుఱ్ఱం పోయిందంటే పోయిందని ఊరంతా గల్లంతుగా వుంది. "ఏమిరా ఇంత అజాగర్త!” అంటూ దొర నవుకర్లను చెడామడా తిట్టాడు.


నవుకర్లు కంగారుతో గ్రామమంతా చుట్టివచ్చారు. కాని,  గుఱ్ఱం ఎక్కడా అగపడలేదు. ఇంతలో, పచారు చేస్తున్న దొరగారికి ఏమీ తోచక స్వయంగానే వెతకటానికి బయల్దేరారు. కొంచెందూరం పోయేసరికి, యజమాని కంటబడగానే గుడిమీద ఉన్న గుఱ్ఱం సకిలించింది. దొరగారు దాన్ని చూచి ఆశ్చర్యపోయారు. గ్రామస్థులంతా క్షణంలో మూగేశారు. వాళ్ళంతా విస్తుపోయి చూస్తూ గోల చేస్తున్నారేగాని గుఱ్ఱం గుడి ఎందుకు యెక్కింది? ఎలా ఎక్కింది? అనే ప్రశ్న ఒక్కళ్ళకూ తట్టనేలేదు. అప్పుడు ఆ గుంపులోనుంచి ఒక ముసలి బ్రాహ్మడు ఒత్తిగించుకొంటూ దొరగారి వద్దకు వచ్చి, "బాబూ ! ' వద్దండీ ! ' అని మొదట్లోనే మేం మొరపెట్టుకొంటే విన్నారు కాదు. పైగా, దేవాలయం దగ్గరే బస చేశారు. ఇటువంటి అప్రాచ్యపు పనులు మా దేముడు సహిస్తాడనుకొన్నారా? మా దేముడికి ఇప్పుడు కోపం వచ్చింది. అందుకనే మీ గుర్రాన్ని గుడి ఎక్కించేశాడు. ఇప్పుడైతే పోయిందేమిటి? 'శరణు' అన్న వాళ్ళను క్షమిస్తాడు మా దేముడు. ఆయన కరుణిస్తే మీ గుఱ్ఱం మళ్ళీ మీకు దక్కుతుంది. కనుక, దేమునికి సాష్టాంగపడి మొక్కుకొండి !” అన్నాడు.


దొరగారికి ఈ మాట నచ్చింది. ఆ వృద్ధ బ్రాహ్మడు చెప్పినట్టుగా దేముణ్ణి ప్రార్ధించారు. ఈవిధంగా దొరగారు చతుస్సాగర పర్యంతం చెప్పుకొన్నతరువాత, ఆయనతో ద్రావిడ బ్రాహ్మలు "మీరు నిశ్చింతగా ఉండండి. మీ గుర్రానికి వచ్చిన పరవా లేదు ” అని అభయమిచ్చారు.


ఆ రాత్రికి రాత్రి, గడ్డిమోపులు మెట్లుగా పేర్చి, మునుపు ఏవిధంగా గుఱ్ఱాన్ని గుడి ఎక్కించారో అలానే చీమ చిటుక్కుమన కుండా మళ్ళీ దాన్ని భద్రంగా కిందికి దింపి, యధాస్థానంలో డేరా వెనుక గుంజుకు కట్టివేశారు.


మర్నాడు తెల్లవారేసరికల్లా తన గుఱ్ఱం సురక్షితంగా మకాంలో ఉండటం చూచి, కలెక్టరుగారు ఉప్పొంగిపోయారు. ఆనాటి నించీ *పేరూరు* ద్రావిడులంటే దొరగారికి గౌరవమూ, ఆ వూరి దేముడంటే భక్తి విశ్వాసాలూ ఏర్పడినై. స్వామి ధూప దీప నైవేద్యాలకుగాను పది ఎకరాల భూమి పట్టా కూడా వ్రాసి ఇచ్చాడని ప్రజలు చెప్పుకొంటారు.


ఆనాటినించి ఆ వూళ్ళో ఎవరైనా ఒక *కూడనిపని తలపెట్టి ఎదటివాళ్లు ఆ పని చేయవద్దు'* అన్నప్పటికీ మొరాయించి చేయబోతే, *"గుఱ్ఱం గుడెక్కేను, జాగర్త"* అంటూ ఉండేవారు.


ఈ విధంగా ఆ సామెత అలా ఆనాడు పేరూరులో పుట్టి, క్రమక్రమంగా దేశ మంతటా వాడుకలోకి వచ్చిందట.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆

సెకరణ:కె.ఆర్.శాస్త్రి.

(చందమామ, 1950,జూన్)

కామెంట్‌లు లేవు: