🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *భాగం 131*
*పరివర్తన చెందిన చోరుడు*
హృషీకేశ్ లోఒక గొప్ప సన్న్యాసిని స్వామీజీ కలుసుకొన్నారు. ఆయన ఉన్నత ఆధ్యాత్మిక స్థితులను పొందిన వ్యక్తిలా కనిపించగా, స్వామీజీ ఆయన వద్దకెళ్లి మాట్లాడనారంభించారు. తమ ప్రయాణ విశేషాలు గురించి చెబుతూ తాము కలుసుకొన్న మహాత్ములను గురించి ప్రస్తావించారు. మాటల మధ్యలో పవహారీ బాబా పేరు చెప్పగానే ఆ సన్న్యాసి కళ్లవెంట నీరు ధారకట్టింది.
గద్గదస్వరంలో ఆయన, "స్వామీజీ! మీకు బాబా తెలుసా?" అని అడిగారు. "తెలుసు" అని స్వామీజీ జవాబిచ్చారు. "ఆయన ఆశ్రమంలో జరిగిన దొంగతనం గురించి తెలుసా?” అన్న ప్రశ్నకు, "తెలుసు" అన్నారు స్వామీజీ.
“ఒక రోజు ఆయన ఆశ్రమంలో ఒక దొంగ ప్రవేశించాడు. ఆయనను చూడగానే భయపడిపోయి, తాను దొంగిలించిన వస్తువుల మూటను అక్కడే పడేసి పరుగు లంకించుకొన్నాడు. వెంటనే ఆయన ఆ మూటను పుచ్చుకొని,దొంగను వెంబడించి కొన్ని మైళ్లు పరుగెత్తి ఎట్టకేలకు అతణ్ణి పట్టుకొన్నారు.
ఆ మూటను అతడి పాదాల వద్ద ఉంచి, చేతులు జోడించి, చెమ్మగిల్లిన కళ్లతో, నాయనా! నిజానికి ఇవన్నీ నీవే. నీ వస్తువులను నువ్వు తీసుకొన్నప్పుడు అడ్డుపడినందుకు నన్ను క్షమించు. వీటిని పుచ్చుకో' అని ప్రాధేయపడ్డాడు" అని స్వామీజీ ఆ కథనం చెప్పి, “నిజంగానే బాబా ఒక అద్భుతమైన వ్యక్తి" అన్నారు.
మౌనంగా వింటూవున్న ఆ సన్న్యాసి కథనం పూర్తికాగానే స్వామీజీని చూస్తూ, ప్రశాంతంగా “స్వామీజీ, ఈ కథలో వచ్చిన దొంగను నేనే" అన్నాడు. స్వామీజీ ఆశ్చర్యచకితులయ్యారు. సన్న్యాసి కొనసాగించాడు:
"ఆ రోజు బాబాను కలుసుకోవడం నా జీవితంలో అనుకోని గొప్ప మలుపుగా పరిణమించింది. నా మార్గం తప్పని నేను గ్రహించాను. ఐశ్వర్యాలలో కెల్లా అత్యున్నతమైన ఐశ్వర్యమయిన భగవంతుణ్ణి పొందడానికి ఈ మార్గాన్ని ఎంపిక చేసుకొన్నాను.”🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి