భాషాద్వయ సమ్మేళనమ్
( చిత్ర కవిత)
కం: మాయంమాన సు నీవే
రాయలవై కావ దేవరా! జే జే జే !
మాయాతుమ లానిన యది
పాయక సంతోసమున్న పల మిలసామీ !
కళాపూర్ణోదయము--6 ఆ : 161 పద్యం- పింగళి సూరన !
ఈపద్యము కళాపూర్ణోదయమున ప్రథమాగమాదులు పామరవేషధారులైవచ్చి కళాపూర్ణుని స్తుతించు సందర్భము లోనిది. ఇందు ఒకరీతి గా పదములను చదివిన తెనుగును, మరియొక రీతిగా చదువగా సంస్కృత మును మనకు అవగత మగుచుండును. ఇదియే భాషాద్వయ సమ్మేళనము.
తెలుగు: పదవిభాగము+ అన్వయము.
ఇలసామీ! --మాయమ్మ- ఆన- సు- నీవే - రాయలవై -కావన్- దేవరా - జేజేజే- మా ఆతుమలానినయవి- పాయక- సంతోషమున్న- పలము.
అర్ధము: దేవరా! ఓరాజా! ! జేజేజే- జయము జయము జయము;ఇలసామీ-ఓభూపతీ! నీవే- నీవే ;రాయలవై- రాజువై;
కావన్- రక్షింపగా ; సంతోసము- ఆనందము; పాయక- విడువక; మాయాతుమలను- మామనస్సులందు; ఆనినయది-పొందినది; ఉన్నపలము- ఇదిమాకు కల్గిన ఫలము; మాయమ్మఆన- మాతల్లిపై ఒట్టు;
భావము: ఓరాజా! నీకు జయమగుగాక! మాయమ్మపై నొట్టుపెట్టుకొని చెప్పు చున్నాము. నీవు రాజువై రక్షించుటచే మామనస్సులానందముతో నిండిపోయినవి;
సంస్కృతము:పదవిభాగము+ అన్వయము: మా-- ఆయమ్--మాన- సునీవే-- రాః - అలవా - ఏకా - అవత్- ఏవ -రాజే - అజేజే - మా - ఆయాతు- మలాని-- న- యది- పాయక- సంతః- అసముత్ - న- వల- మిల- సా- అమీ;
అర్ధము: హే సునీవే- చక్కని మూలధనముగల ఓరాజా! ; ఆయమ్- రాబడిని ; మామాన- లెక్కచేయకుము; అలవా--తరుగని;
రాః - ధనము; ఏవ- ఒక్కటియే; అవత్- రాజును కాపాడును ; అజేజే-- భగవంతుని పూజించు-- రాజే--రాజుకొరకు ; మా- లక్ష్మి; ఆయాతు- వచ్చునుగాక - మలాని- పాపములు-- న-- చేరవు; పాయక- ఓరక్షకుడా! ; సంతత్సు- పడితులైనచో (చూడవచ్చినవారు)
అసముత్--సంతోషరహితుడవై ; నవల- దూరముగా పోకుము; మిల-- వారిని కలువుము; అమీ-- ఆపండితులే- సా లక్ష్మీ -- ఆ లక్ష్మియని యెఱుంగుము;
భావము: ఓరాజా! రాబడిని నమ్మి మూలధనమును వమ్ముచేయకుము. తరుగని సంపదయే రాజునకు సంతసమును గూర్చును. భగవదారాధనచే సకల సంపదలు కలుగును. పాతకములు దరిజేరవు. ప్రభూ! పండితులను గాంచినంతనే పరాఙ్ముఖుడవుగాక ,వారిని సంభావింపుము. వారే లక్ష్మికి ప్రతిరూపములని భావింపుము.
ఇది పాఠకులకు కొంత కష్ట సాధ్యమేయైనను రహస్య సమాచారాదులకొరకు వేగులు ,మంత్రులు ,ప్రభువులు, తమతమ
కార్యకలాపములకు ఇట్టివి వాడుచుండెడివారు.
స్వస్తి!!🙏🙏👌👌💐🌷🌷🌷🌷💐💐🌷🌷💐💐💐💐💐💐💐🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి