30, డిసెంబర్ 2023, శనివారం

పెరియ పురాణం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 43*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*కలియ నాయనారు*


తొండ మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో తిరువొట్రియూరు ఒకటి.

ఆ గ్రామంలో గాండ్ల కులానికి చెందిన గొప్ప శివభక్తుడైన కలియనాయనారు

అవతరించాడు. శ్రీమంతుడైన అతడు తిరువొట్రియూరు శివాలయానికి

వెళ్లి రాత్రింబగళ్లు దీపాలు వెలిగించడం ఒక వ్రతంగా నిర్వహిస్తూ వచ్చాడు.


 కలియ నాయనారు శివభక్తిని పరమేశ్వరుడు లోకానికి తెలియజేయాలని

అనుకున్నాడు. అది మొదలుకొని నాయనారు సంపద రోజు రోజుకూ

క్షీణించడం ప్రారంభించింది. అయినప్పటికీ కలియ నాయనారు గుడిలో

దీపాలు వెలిగించే వ్రతాన్ని మాత్రం మానలేదు. కూలిపనికి వెళ్లి వచ్చిన

డబ్బులతో గుడిలో దీపాలు వెలిగించాడు. కొద్ది రోజులైన తరువాత అతనికి

కూలి పని కూడ దొరకలేదు. 


ఇంటిని, ఇంటిలోని వస్తువులను అమ్మి

దేవాలయంలో దీపారాధన నిర్వహించాడు. ఆ డబ్బులు కూడ పూర్తిగా

ఖర్చయిన తరువాత తన భార్యను అమ్మి తన వ్రతాన్ని నిరాటంకంగా

జరపాలనుకున్నాడు. భార్యను పిలుచుకొని నగరమంతటా తిరిగినప్పటికీ

ఆమెను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు.

దీపాలు వెలిగించడానికి అతనికి ఏ మార్గమూ తోచలేదు.


దేవాలయానికి వెళ్లి ప్రమిదలను వరుసగా అమర్చి వాటిలో వత్తులను వేశాడు. “దీపాలు వెలిగించకుండా జీవించడం కన్నా మరణించడమే మేలు.

నా శరీరంలోని రక్తంతో దీపాలను వెలిగిస్తాను" అని నిశ్చయించుకున్నాడు.

కత్తితో తన శరీరాన్ని పొడుచుకొన్నారు. కరుణామూర్తి అయిన పరమేశ్వరుడు

ప్రత్యక్షమై కలియ నాయనారుకు శివలోక పదవిని అనుగ్రహించాడు.


*నలభైమూడవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: