30, డిసెంబర్ 2023, శనివారం

ఐదు విధాలైన దోషాలు

 🍃🪷🍃🪷🍃🪷🍃

⚡ *మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి...*


1.  *అర్ధ దోషం*

2.  *నిమిత్త దోషం*         

3.  *స్ధాన దోషం*

4.  *గుణ దోషం*   

5.  *సంస్కార దోషం*.


 *అర్ధ దోషం*


ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒక వ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు.భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ గదిలోనే  శిష్యుడు ఉంచిన డబ్బు మూట వుంది

హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది, ఆ మూటలో నుండి కొంత డబ్బును తీసుకుని తన సంచీలో దాచేశాడు. తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు


తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే  మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు.వెంటనే  తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును  తిరిగి ఇచ్చేశాడు. తర్వాత శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు

శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు

ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం


 *నిమిత్త దోషం*

 

మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి


వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు  వంటివి పడ కూడదు


అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి అబ్బుతాయి


భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో  కొట్టబడి, యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య పై ప్రాణాలతోనే  వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు


అప్పుడు ద్రౌపది కి ఒక అనుమానం కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తు మాట్లాడే భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు ఊడ్చమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది


ఆమె మనసులో ఆలోచనలు గ్రహించిన భీష్ముడు

'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను .నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడినైనాను

నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు

చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చిన ఆహారం తినినందువలన మనిషిలోని మంచి గుణములు నశించి నిమిత్త దోషం' ఏర్పడుతోంది


 *స్ధాన దోషం*


ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటకూడా పాడైపోతుంది

యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు


దుర్యోధనుడు  ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.  తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి,  ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి, అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే  తీసుకొని  ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో  కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చిన ఫలమో, పుష్పమో, తోయమో, జలమో, ఏదైనా సంతోషంగా తీసుకుంటాను అని అన్నాడు

మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి


 *గుణ దోషం*


మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని  లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది


*సంస్కారదోషం*


ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని పోని రోగాల్ని తెచ్చి పెడుతుంది.

A Best Collection from Brahmana Samaakya.


🍃🪷🍃🪷🍃🪷🍃

కామెంట్‌లు లేవు: