🙏మేఘసందేశం కాళిదాసు 🙏
కాళిదాసు రచించిన కావ్యాలకి ఒక ప్రత్యేకత ఉంది. కాళిదాసు పుట్టుకతోనే పండితుడు కాదనీ, పెళ్ళయ్యాకే అమ్మవారి (కాళికా దేవి) అనుగ్రహం వలన పండితుడయ్యాడనీ అందరికీ తెలిసినదే. అయితే పెళ్ళయిన వెంటనే కాళిదాసు భార్య "వాగస్తి కశ్చిత్?" (వాక్కు ఏదన్నా నీకుందా?) అని అడుగుతుంది. ఈయన పండితుడయిన తరువాత, ఈ వాగస్తి కశ్చిత్ లో ఉన్న మూడు పదాలనీ (వాక్, అస్తి, కశ్చిత్) తీసుకునీ ఒక్కో పదంతో మొదలయ్యేట్టుగా ఒక్కో కావ్యాన్ని (వాక్కుతో మొదలుపెట్టిన మహా కావ్యం రఘువంశం, అస్తి తో మొదలుపెట్టిన మహా కావ్యం కుమార సంభవం మరియు కశ్చిత్ తో మొదలుపెట్టిన ఖండ కావ్యం మేఘ సందేశం) వ్రాశాడు. ఆ ప్రకారంగా ఇందులోని మొట్టమొదటి శ్లోకం:
కశ్చిత్కాంతావిరహగురుణా స్వాధికారాత్ప్రమత్తః
శాపేనాస్తంగమిత మహిమా వర్షభోగ్యేణ భర్తుః ।
యక్షశ్చక్రే జనక తనయా స్నాన పుణ్యోదకేషు
స్నిగ్ధచ్ఛాయాతరుషు వసతిం రామగిర్యాశ్రమేషు ॥
అంటే తన విధులలో అశ్రద్ధ వహించటం వలన యజమాని ఆగ్రహానికి గురయ్యి, తన విధుల నుండి తొలగించబడి, తన శక్తులన్నీ కోల్పోయి, యేడాది కాలం కాంతా (భార్య) వియోగంతో గడపవలననే శాపాన్ని పొందిన యక్షుడు, జనకుని కూతురు అయినటువంటి సీతా దేవి స్నానం చేయటం వలన పవిత్రంగా మారిన నీరు కలిగినటువంటి, దట్టమయిన నీడనిచ్చే చెట్లు కలిగినటువంటి రామగిరి ఆశ్రమంలో ఉన్నాడు.
ఈ శ్లోకంతో నాయకుడయిన యక్షుని పరిచయం జరిగింది. దానికి రెండు విశేషణాలు వాడాడు. అవే స్వాధికారాత్ ప్రమత్తః, అస్తంగమిత మహిమ. దీని ఆధారంగా కాళిదాసు విధి నిర్వహణే ప్రధాన కర్తవ్యం అని చెప్తున్నాడు అనిపిస్తుంది. చేయవలసిన పని సరిగ్గా చేయకపోవటం వలన యక్షునికి కలిగిన అనర్థాలు ఉద్యోగం మరియు మహిమలు కోల్పోవటం, తద్వారా కాంతా వియోగం పొందటం. మనకి ధర్మార్థకామాలలో కూడా మొదటిది ధర్మ నిర్వహణే కదా! అది సరిగ్గా చేయకపోతే అన్నిటికీ దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అలాగే రామగిరి ఆశ్రమంలో ఉన్నాడు అని చెప్పాడు కానీ అదెక్కడుందో రెండు విశేషణాలతో చెప్పకనే చెప్పాడు. అవే జనక తనయా స్నాన పుణ్యోదకేషు అనగా సీతాదేవి స్నానం చేయటం వలన పవిత్రమయిన నీరు, స్నిగ్ధచ్ఛాయాతరుషు అనగా ఎక్కువగా నీడనిచ్చే చెట్లు. వీటి ఆధారంగా తెలిసేది ఏమిటంటే సీతాదేవి వనవాసం చేసిన చోటు అని. అదే చిత్రకూట పర్వతం. ఇటువంటి ఎన్నో రసవత్తరమయిన శ్లోకాలతో ఆద్యంతం ఆకట్టుకున్న అద్భుత కావ్యం మేఘ సందేశం.
అరణ్యంలో విరహంతో ఉన్న యక్షునికి (యక్షులు సాధారణంగా కాముకులు కనుక వారికి కాంతా వియోగం భరించలేనటువంటిది) మేఘుడు కనిపిస్తాడు. కనిపించిన వెంటనే ఏమీ ఆలోచించకుండా మేఘునితో అలకాపురి(యక్షుల నివాసం)లో ఉన్న తన భార్యకి సందేశాన్ని పంపాలి అనుకుంటాడు. శ్రీరాముడు సీతకి ఆంజనేయస్వామి ద్వారా, పాండవులు కౌరవులకి శ్రీ కృష్ణుని ద్వారా, నలోపాఖ్యానంలో దమయంతికి హంస ద్వారా, సందేశాలు పంపటం జరిగాయి. కానీ ఇక్కడ యక్షుడు - పొగ, వెలుతురు, నీరు, గాలి కలిసినటువంటి మేఘంతో (ప్రాణం లేని దానితో) సందేశం పంపబోతున్నాడు. ఆ మాత్రం కూడా కాళిదాసుకి తెలియదు అని జనం భావించకుండానే, కామార్తులకు (కామముతో ఉన్న వాడికి) అంత ఆలోచన ఎక్కడిది? అని తన కావ్యౌచిత్యాన్ని సమర్ధించుకున్నాడు (పూర్వ మేఘం, నాల్గవ శ్లోకంలో).
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి