15, జులై 2024, సోమవారం

పంచె(కు) తంత్రం

 ---------- పంచె(కు) తంత్రం ------------


"పంచెకట్టుటలో ప్రపంచాన మొనగాడు మన తెలుగువాడు" అని సి.నా.రె గారు చెప్పినా

పంచె కట్టడం అంత తేలికైన పనేమీ కాదు. అమ్మ బాబోయ్! పంచె భద్రత అంటే

ప్రపంచ భద్రత. అభినవ తెనాలి రామకృష్ణ గా బిరుదు సంపాదించుకున్న ఓ హాస్యవేత్త

కొన్నేళ్ల క్రిందట గజ్వెల్ 'భువనవిజయం' లో తెనాలి రామకృష్ణుడి పాత్ర ధరించాడు.


నాటకం జోరుగా సాగుతోంది.రామకృష్ణుడు ప్రగడరాజు నరస కవి తో వాగ్వివాదం

చేయాల్సిన ఘట్టం వచ్చేసింది.రామకృష్ణుడు తన స్థానం లోనుంచి లేవ పోయాడు.


పంచె(కు) తంత్రం మొదలైంది. పంచె వాకౌట్ చేసే లక్షణం కనిపించింది. పంచె ఊడిపోతే

ఎలా అనే భయం రామకృష్ణ పాత్రధారికి పట్టుకుంది. లేస్తే అదీ పరిస్థితి.


అటువంటి పరిస్థితి పగవాడికి కూడా వద్దు. తన స్థానం లోనే కూర్చుని ఓయీ! నరసకవీ!

నీ ముందు నేను నిలబడుటయా? వచ్చి నీవే నా పాదాలచెంతకు నిలబడి

మాట్లాడుము. అని గద్దించాడు. 


పరిస్థితిని అర్థం చేసుకున్న నరస రాజు పాత్రధారి

వణుక్కుంటూ దగ్గరగా వచ్చి మాట్లాడాడు. అలా సమయస్పూర్తితో కార్యక్రమం

యిబ్బంది లేకుండానే పూర్తయింది. అప్పటినుంచీ ఆ తెనాలి రామకృష్ణుడు ప్యాంటు

వేసుకోవడం ప్రారంభించాడు.


ఈ హాస్యవేత్తను ఒకసారి అమెరికాలోని సిలికా నాంధ్ర వాళ్ళు పిలిచి కార్యక్రమము

ఏర్పాటు చేశారు.పంచె కట్టకుండా తప్పించుకోలేని పరిస్థితి వచ్చింది. 


అందుకోసం

ప్యాంటులాగా తొడుక్కునే పంచెను ధరించాడు.(రెడీమేడ్ పంచె). అయినా భయం

పోలేదు.


అయ్యా! తప్పనిసరి పరిస్థితిలో పంచె కట్టుకొని వచ్చాను నేను నా పెళ్ళిలో

కూడా పంచె కట్టుకోలేదు. ఇప్పుడు నాకేమవుతుందేమోనన్న భయం లేదు, పంచెకేమైనా

అవుతుందేమో నని భయం పట్టుకుంది.


నా పంచెకు జరగరానిదేమైనా జరిగితే నేనసలే

వామనావతారాన్ని, ఒకవేళ వేమనావతారాన్ని అయితే మీరే సర్దుకుపోవాలి.మీరే

క్షమించాలి అన్నాడు.నవ్వుతూ.


 పరిస్థితి అర్థం చేసుకున్న పంచె మాత్రం ఏమీ

యిబ్బంది పెట్టకుండా కరుణించింది. పాపం ఎంత దయో ఆ 'వేషుడిపై (తెలుగువెలుగు మాసపత్రిక సౌజన్యముతో)

కామెంట్‌లు లేవు: