5, అక్టోబర్ 2024, శనివారం

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము33

 *శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము33 వ భాగము* 

🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃


*గాణాపత్యులు:*

సుబ్రహ్మణ్యక్షేత్రమున అద్వైతమత ప్రచారముచేసి బహుమతములలో నుండిన లోపములను తెలియ జేసి వారల నందరిని సంతుష్టులను జేసి అద్వైత మతమును అవలంబింప జేసిన తరువాత ప్రసిద్ధి కెక్కిన గణవరపురము ప్రవేశించారు శంకరా చార్యస్వామి. 

ఆ పురమందున్న గణపతి ఆశ్రమంలో బసచేశారు.


అచ్చట కౌముదియను పేరు గల నది పారుచు న్నది. అందు వారందరు స్నానాదు లాచరించి విఘ్నేశ్వరాల యమునకు జని గణపతిని దర్శించి షోడశోప చారములతో అర్చించారు. అచట వారందరూ ఒక నెల దినము లుండి ఆ ప్రాంతంలో ఆచరణలో నుండిన మతవిధాన ములను తెలిసికొని అందుగల లోపముల ప్రేమతో తెలియజేసి సవరించుచు నిజ తత్త్వమును బోధించు చు అద్వైతమతస్థాపన చేసారు. 

పద్మపాదాదులందరు పంచా యతన పూజా పరాయణులైరి. శిష్య బృందమంతటికిని ఆహారపదార్థములు తయారు చేయుటకు శంకర శిష్యులలో నొకడైన హరలబలు డను వాడు ఏర్పాటు గావింపబడ్డాడు. పద్మ పాదుడు గురువులను యథా విధిగా పూజించు చు భిక్ష నొసగువాడు. ఏ లోపము లేకుండ శిష్యులందరు మృష్టాన్న భోజనముతో తృప్తి చెందెడివారు. 


సాయంకాలమందు ప్రతి శిష్యుడు ద్వాదశ సాష్టాంగవందనములను అర్పించేవారు. శిష్యులు జగద్గురు వులను వేయి విధాల స్తుతించుచు ఢక్కా మొదలయిన మంగళ వాద్యములు మ్రోగించు చు, కరతాళధ్వనులు సల్పుచు లయానుకూలముగా నృత్యములు చేయుచుండెడి వారు. ఆవిధముగ శ్రీశంకరా వతారమూర్తిని శ్రద్ధతో, భక్తితో, ఆనందపరవశులై కొలుచుచుండే వారు. 


'సకలలోకములకు కారణ భూతుడు, త్రిగుణాతీతుడు, చిదానందుడు, అగమ్యుడు, సత్యస్వరూపుడు, (ప్రపూర్ణాహం, బ్రహ్మాహం) పరిపూర్ణ బ్రహ్మను నేనే, అట్టివాడు సంసార లంపటములో పడిపోక శాశ్వతానందమును పొందుచున్నాడు'ఇట్టి వాక్యములు ఉచ్చరిస్తూ మహానందమును పొందేవారు శిష్యులు. ఆ విధానము నంతను గణవరపుర వాసులు చూచి వింత పడేవారు, కొందరి కది శంకరుల మీద అనుమానము కలిగించినది.


గణవరంలోనున్న గణపతి మతస్థులు శంకరులశిష్యులు చేయుచున్న నృత్య ములు మొదలైనవి చూడగా ఆచార్య పాదులు ప్రబోధచేయు చున్న అద్వైతమతం వారికి నచ్చలేదు. వారందరు శంకరులతోసంభాషించ దలచి యొకనాడు శంకరు లను కలిసికొన్నారు. అందొకడు,


'శంకరాచార్యస్వామీవందనములు! మీరందరు అద్వైత మతము నవలంబించి ఈలాటి కోలాహలం లో మునిగి యుండ చూడగా తెలివైన వాళ్ళు మీ మతమును గౌరవించెదరా? 


వాక్కునకు, మనస్సునకు అందరాని పరమాత్మను ద్వైతం కాదని, అద్వైతమని మీరింక లోకానికెట్లు నచ్చచెప్ప గలరు? కనుక వెంటనే మీ మతమును విడనాడి మా మతమును అవ లంబించుడు. మాది గాణాపత్య మతం. ఇది వేదములకు గౌరవకర మైనది. ఇందు పరమ శాంతి లభించును. స్థిరమైన మోక్షము నిచ్చునది. దీనిని ఆచరించుటకు అవరోధము లెందునా కానరావు. గణపతి మహాదేవుని అనన్య చింతన జేయుచు, గణపతి మహామంత్ర మును జపించుకొను చుండిన, తప్పక మోక్షము లభించును, ఆయన గొప్పతనం

అనంతమైనది'. 


గాణాపత్య మతపద్ధతి శ్రీశంకరపాదులు విని అందుగల లోపాలను ఈవిధంగా చూపించారు:‘గాణాపత్యులారా! మీ మతమందుగల లోప మును గ్రహించ లేకుండుట విచార కరము. విఘ్నేశ్వరుడు ఈశ్వరునికి కుమారుడు అని లోకానికి సువిది తమే గదా! అప్పట్టున కుమారుడు కారకు డెట్లగును? మీ విధానం నిరాధారము. ఎన్ని వాక్యములు పలికినా ఎన్నినామము లున్నా అవన్నియు పరబ్రహ్మకే చెందు చున్నవి’ అని వివరించారు.


పిమ్మట హరిద్రా గణపతి మతస్థులు క్రోధంతో తమ మత ధర్మాలను ఏకరువు పెట్టసాగారు.


గాణాపత్యులలో హరిద్రాగణపతి మతస్థులు ఒక అంతశ్శాఖ. శ్రీ శంకరులు గాణాపత్యులను కాదనడం, వాళ్ళందరు శంకరుల మతంలో లీనమై పోవడం కండ్లార గాంచి సహించ లేకపోయారు హరిద్రా గణపతి మతస్థులు. తమ శాఖకు అది యొక గొడ్డలిపెట్టుగా భావించి బాధపడి, గణకుమారు డను నాతడు ఆవేశంతో లేచి చరచర నడచి శ్రీ శంకర పాదులను చేరి, "యతివరా! ఏ కార్యమును తలపెట్టినా ముందుగా గణపతినే పూజించాలి గదా! దేవతలకు గురువైన బృహస్పతి మొదలైన వాళ్ళను ఆదేశిస్తూం టాడు. బ్రహ్మ మొదలైన దేవతలకు ప్రభువై బ్రహ్మను రక్షించు చుండును. కనుక అతడే జ్యేష్ఠుడు. అట్టి వానిని ఉపాసించ వలెనని వేదములు పలుకుచున్నవి. ఆతడే పూజింప దగినవాడు. అందువలన సమస్త మైన దేవతలు, త్రిమూర్తులు, గణపతి దేవుని పూజిస్తూన్నారు.


యతీశ్వరా! గణపతి దేవుని ఏవిధంగా థ్యానించవలెనో స్కాంద పురాణమందు వివరించబడి యున్నది' 


కరుణా మయుడగు శ్రీజగద్గురువులు గణ కుమారునితో అన్నారు. ‘గణకుమారుడా! నీవాడిన మాటలను అట్లుంచు. పరమేశ్వరు డు అనంతకోటి పేర్లతోపిలువబడు చున్నాడు. గణాధిపతి యనునది సమస్త లోకాలను సృష్టించు పరమాత్మకే చెందవచ్చును. పరమాత్మ కంటె బ్రహ్మాది దేవతలు వేరు గాదు. వారందరు పరమాత్మ యొక్క అంశ గలవారలే! రుద్రుని కంటె గణపతియు వేరుగాదు. సర్వవిఘ్నము లను నిర్విఘ్నంచేసే సర్వాంతర్యామి గణపతి రూపంలో నున్న పరమాత్మను ఉపాసించ వలసినదే!


బాహ్మణులందరు గణపతి మొదలయిన పంచదేవతలను యథావిధిగా నుపాసించ వలసినదే! ఇంక గణపతి చిహ్నము లైన తుండం, దంతం మొదలైన చిహ్నము లను శరీరములను కాల్చి అంకితములు చేసికోవడం పాషండ లక్షణ మగును. కనుక అద్దానిని విడనాడి పంచాయతన పూజలు సల్పు కొనుచు అద్వైత తత్త్వజ్ఞానమును ఆర్జించుకొందురేని ముక్తి తప్పక లభించును.' అని వివరముగ బోధించారు.


అంతట గణకుమారుడు మొదలైన వారందరు శ్రీశంకర పాదుల కరుణా రసపూరిత రహస్య బోధలను విని, తమ మతములోని లోపాలను గ్రహించి, శ్రీశంకరులకు జోహారు లర్పించి సాష్టాంగ వందనము చేసి శిష్యులై ధన్యులయ్యారు. 


పిమ్మట ఉచ్ఛిష్టగణపతి మతస్థుల వంతు అయ్యింది. గణపతి మతములో ఇంకా నాలుగు అంతశ్శాఖలు గలవు. అందు ఉచ్ఛిష్టగణపతి మతము ఒకటి. వారిలో నొకడు లేచి శంకరుల నుద్దేశించి, ‘ఆచార్యస్వామీ! వందనములు! శైవాగమరహస్య మందు ఆరు విధములైన మతములున్నాయి. మహాగణపతి మతము హరిద్రా గణపతి మతము ఉచ్ఛిష్టగణపతి మతము నవనీత గణపతి మతము స్వర్ణగణపతిమతము, సంతాన గణపతి మతము అను నారింట మాది ఉచ్ఛిష్టగణపతి శాఖ పేరెన్నిక గన్నది. మాలో తిరిగి వామ, వామేతర మతము లున్నవి. వామమార్గ మునే ఉచ్ఛిష్టమార్గ మంటారు',


శ్రీశంకరాచార్యస్వామి ఆ కుమారుడు వ్యక్తం చేసిన భావాలను విని, వారికి కూడ హితబోధ చేసారు. పిమ్మట మిగిలిన గణపతి మత శాఖలవారు (నవీన, స్వర్ణ, సంతాన శాఖలు) శ్రీశంకర పాదులతో ముచ్చటించి దోషము లను తెలిసికొని తరించారు.


కాంచీపురము: గణవరపురము నుండి శ్రీ శంకరపాదుల తరువాతి మజిలీ కాంచీపురము చేరు కొన్నారు. “అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారావతీచైవ సప్తైతే మోక్షదాయికాః”


భూమి ఏనాడు పుట్టినదో ఆనాట నుండీ కంచి పేరొందిన పురం. కంచిమోక్షపురం. భారతభూమి యందు సప్తమోక్ష పట్టణాలు ఉన్నాయి. ఇవి కీలకస్థానాలుగా వన్నెకె క్కాయి. పురంపేరు స్మరించి నంత మాత్రాన క్షేత్ర మహిమతో సర్వపాపములు హరించి పోవును. ఏనాడు పరాత్పరుడు ఏ విశ్వాసం తో, ఎవరి ప్రేరణతో సప్తపురము లకు పునాదులు వేసి యుండెనో ఎవరి కెఱుక? మోక్షపురమును దర్శించ నెంచి ప్రవేశించారు. తీరా కంచిలో కాలుపెట్టుసరికి ఆనందం మఱుగై ఆవేదన చోటు చేసికొన్నది. కాంచీ పురము ఆ నాడు వామాచారులతోను తంత్రవిద్యలతోను మునిగి అడుగిడిన ఏమి కీడు మూడునో యను భయము యాత్రికులకు కలుగు చుండెడిది. కొంతకాలం కంచిలో కానవచ్చే భయానక దృశ్యాలకు వెఱగొంది దర్శించడం మానుకొన్నారు. అట్టి మోక్షపురి శంకరపాదు లకు యమపురిగా గోచరించుటచే ఆయనలో జనించిన ఆవేదన పోవు మార్గము ఆలోచించిరి. కరుణామయుడు తలంచిన ఏకార్యము కాకుండును! కంచిలో నున్న వామమార్గాన్ని అనుసరించిన తంత్ర జ్ఞులకు శక్తి లేకుండ జేయడమే వారు ఎంచిన ఉపాయము. అందులకై శ్రీదేవీ దేవాలయమును కట్టించిరి. బహు రమణీయమగు ఆ ఆలయములో శ్రీదేవిని ప్రతిష్ఠించి కామాక్షి యను నామ మిడి అర్చనాది పూజలు, సమస్త ఉపచారములు ఏర్పాటుచేసి నిత్య ధూపదీప నైవేద్యములు కలుగ జేసిరి. శక్తివంత మైన ప్రతిష్ఠయగుటచే తంత్రాది విద్యలకు ఆ ప్రాంతమున ప్రభావం లేకుండపోయెను.


ఆ మహాపవిత్ర మైన కంచిపుర మందే ఒక శివాలయమును నిర్మించి, అచ్చట ఒక పట్టణమును కట్టించి దానికి శివకంచి యను పేరుపెట్టినారు. అచ్చోటనే యున్న శ్రీవరదరాజ స్వామి వారిని ఆశ్రయించి మరి యొక పట్టణము నిర్మించి దానికి విష్ణుకంచి యను నామకరణము జేసిరి. నూతన శివాలయ మందున్న శివునకు, విష్ణ్వాలయమందున్న విష్ణువునకు సర్వోప చారములు గావించు టకు బ్రాహ్మణులను, భక్తులను నియమించి నారు. శంకరపాదులు కాంచీపురమందొక నెల దినము లుండి వేదాంత విజ్ఞాన ప్రబోధము చేయుచుండెడి వారు. వేలాది జనులు వచ్చి వారి బోధలను విని వారలలో కరుడుగట్టు కొని యున్న లోపాలను సవరించు కొనుచు పుణ్యమూర్తులై సుఖముగా నుండెడి వారు. అసహ్యకరమైన కాంచీపురం కన్నుల పండువుగా తయారై మరల స్వస్థానమైన మోక్షపుర అర్హతను సంపాదించు కొన్నది. 


అచ్చోటు వీడి శ్రీశంకరాచార స్వామి శిష్య సమేతముగ తామ్రపర్ణీ నదీ తీరమునకు ప్రయాణమైనారు.


*తామ్రపర్ణీ తీరస్థులు:*


శ్రీ శంకరాచార్యస్వామి కాంచీపురము నుండి తామ్రపర్జీ నదీ తీరమును జేరుకొనిరి. తత్తీరవాసులందరు శ్రీశంకర పాదులు వచ్చారనిన వార్త విని తమకున్న సంశయము లను నివారణ చేసికొన వచ్చునని తలంచి శ్రీశంకరచార్యస్వామిని దర్శించి వందనము లర్పించి, 'యతీశ్వరా! ప్రతి వాని యందును భేద మనునది విధిగా అంటి యున్నది. మన శరీరమందేభేద మున్నది. ఈ భేదము ఈ లోక మందే కాదు, ఇతర లోకములలో కూడ స్పష్టముగ కావచ్చు చున్నది. మానవులు చేసికొనిన కర్మల ననుసరించి పుణ్యలోక ములు, పాపలోక ములుపొందుచున్నారు. ఈ విధముగ ఇహలోక పరలోక ముల యందు భేద మను నది సత్యముగ నున్నది. ఇంత స్పష్టముగ నున్నది వేరొకటి కానరాదు.' అని శ్రీశంకర పాదులకు తామ్రపర్ణి తీరస్థులు తమ సంశయములను నివేదించుకొనిరి.


శ్రీశంకరాచార్యస్వామి 'బ్రాహ్మణోత్త ములారా! నిజమైన విషయములు తెలియక తికమకలు పడు చున్నారు. అజ్ఞాని కి సదా భేదమే యుండును. ఇదంతా బ్రహ్మ మయమని కంటికి కనుపించున వన్నియు నశించునని యు, చూచేవాడు, చూడ బడునది కూడ నాశనమగునని జ్ఞాని దృఢంగా నమ్ముచు న్నాడు. అట్టి జ్ఞానికి భేద మనునది లేదు. భేద భావననశించడమే జ్ఞానోదయం. శ్రీ పరాత్పరుడు లోకము లను సృష్టించి అందే ప్రవేశించును. అనగా జీవాత్మరూపంలో ప్రాణులయందున్నాడు. కనుక ప్రాణులన్నీ పరమాత్మే యగు చున్నవి గదా! దేవత లెందరని ప్రశ్నించి, అనేకమంది దేవతలలో పరమాత్మ ఇమిడి ఉన్నాడని తేల్చింది వేదమే. కడకు భగవంతు డొక్కడే యని నిర్ణయం చేసింది. ప్రాణ మనినా పరబ్రహ్మ మనినా ఆ దేవాదిదేవు నకే చెందు చున్నది. ఆయనే అనేకముగ ఉంటున్నాడు. ఇంక ఆయన కంటె మరి యొకడు లేనే లేడు. పరమాత్మ తత్త్వం తెలిసికొనిన వానికి భేద మనునది యుండదు. అట్టి జ్ఞానమును సముపార్జించవలెనన్న పరబ్రహ్మను ఉపాసించ వలెను.’ అని వివరించి వారల ఆనుమానము ను నిర్మూలించారు.

తామ్రపర్ణి తీరస్థులు శంకరుల ఉపదేశా మృతపానం చేసి సంతుష్టులైనారు. వారందరు శ్రీ ఆచార్యస్వామికి శిష్యులై అద్వైత తత్త్వజ్ఞానమును ఆర్జించు కొనుచు బ్రహ్మానందమును పొందుచుండిరి. 


శ్రీ ఆచార్యస్వామి తామ్రపర్ణి నదీతీరము నుండి ఆంధ్రదేశ సంచారమునకై పయన మయ్యారు.  


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 33 వ భాగము సమాప్తము*

🌺🌺🌺🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺

కామెంట్‌లు లేవు: