5, అక్టోబర్ 2024, శనివారం

Kalla Jodu కళ్ల జోడు


 కళ్ళజోడు 


కళ్ళజోడు అంటే తెలియనివారు వుండరు. దృష్టి దోషం ఉన్నవారు కళ్ళజోడు పెట్టుకోక తప్పదు. కానీ ఈ ఆధునిక కాలంలో చాలామంది రంగు రంగుల కళ్లజోళ్లు, సన్ గ్లాస్, అని ఫోటో గ్రే అని ఇలా అనేక రకాల కళ్ళ జోళ్ళు వాడటం కూడా పరిపాటి. స్థూలంగా చెప్పాలంటే సాదారణంగా కళ్ళు సరిగా కనపడని వారు అంటే చేత్వారం వచ్చిన వాళ్ళు లేక దూర దృష్టి సరిగా లేనివారు ముఖ్యంగా (చిన్న పిల్లలు ఈ కోవకు చెబుతారు.) కళ్ళ జోడులు వాడతారు. నిజానికి కళ్ళ జోడు లేకపోయినా మనిషికి కనపడుతుంది కానీ స్పష్టంగా కనపడదు. సాధారణ మనుషులకు 6/6 దృష్టి (sight ) వుండాలని వైద్యులు అంటారు. 5/5 దృష్టి (sight ) ఉంటే వారి చూపు పరిపూర్ణంగా ఉన్నట్లు లెక్క. దృష్టిలో వున్న దోషాలకు తగిన కళ్ళ జోడు ఇచ్చి వైద్యులు దృష్టిని 6/6 వచ్చేటట్లు సవరిస్తారు. అట్లా చేయటం వలన సాధారణంగా చూడగలరు. నిజానికి కళ్ళజోడు ద్రుష్టి దోషాన్ని సవరిస్తుంది కానీ అంధులకు దృష్టిని ఇవ్వదు. ఒక్క మాటలో చెప్పాలంటే కళ్లజోడుతో ఒక మనిషి తన దృష్టిని పెంచుకుంటాడు కానీ చూడలేనివాడు వైద్యుడు ఇచ్చే కళ్ళజోడు పెట్టుకున్నంత మాత్రాన చూడలేడు. ఇది బౌతికంగా ప్రతి మనిషికి తెలిసిన విషయం. ఇక అసలు విషయానికి వస్తే ఒక సాధకుడు మోక్షాన్ని పొందటానికి ఒక గురువు వస్తాడు అని అతని వలన తనకు మోక్షం సిద్ధిస్తుందని మనలో చాలామంది సాధకులు ఒక అభిప్రాయాన్ని కలిగి వుంటారు. కానీ అది ఎంతమాత్రమూ నిజాము కాదు. ఒక సాధకునిని ఒక గురువు ఎట్టి పరిస్థితిలోను మోక్షాన్ని ప్రసాదించలేడు. గురువు సాధకునికి కొంతవరకు మాత్రమే మోక్షమార్గానికి దోశదపడతాడు. అందునికి కళ్ళజోడు పెట్టుకున్నా ఏరకంగా కనపడదో అదే విధంగా ఆధ్యాత్మిక మార్గంలో లేనివారికి గురువు చేసే ఉపదేశాలు చెవిటి ముందు ఊదిన శంఖం లాగ ఏరకంగాను దోహదపడవు. కాబట్టి ముందుగా ప్రతి సాధకుడు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ముందుగా తనకు తానుగా తానూ ఎంతవరకు ఆధ్యాత్మిక సాధనలో ముందుకు సాగాను అని పరిశీలనచేసుకోవాలి, తరువాత తనకు తన మార్గంలో అవరోధంగా వున్నవి ఏమిటి అన్నవి గుర్తించాలి. కొందరికి అరిషడ్వార్గం మొత్తంగా లేక ఏదోఒకటి లేక ఒకటికన్నా ఎక్కువ అవరోధంగా ఉండవచ్చు. ఉదాహరణకు ఒక సాధకుడు కామ క్రోధాదులను జయించిన కూడా జిహ్వ చాపల్యానిని త్యజించక పోవచ్చు. నాకు ఫలానా వంటలే కావలి ఫలానా తినుబండారాలే కావలి అని అనుకున్నాడనుకోండి. తానూ కోరిన తినుబండారం దొరికితే సరే లేకపోతె మనస్సు తాను కోరుకున్న వస్తువు (వంటకం) మీదకు పరిపరి విధాలుగా వెళ్లి దానిని సాదించటానికి ప్రయత్నం చేస్తుంది. మనకు తెలుసు సాధకుని మనస్సు స్వాధీనంలో లేకపోతె సాధన కుదరదు. మనందరకు తెలిసిన సాధారణ ఆధ్యాత్మిక నియమం " మనః ఏవ కారణః మనుష్యాణాం బంధః ఏవ మోక్షహ" కాబట్టి తాను కోరుకున్న వంటకం మీదకు మనస్సు మళ్లినప్పుడు సాధకుడు సాధనలో ముందుకు సాగలేడు . నేను చాలా చిన్న ఉదాహారణ ఇచ్చాను. సాధకుడిని కామ క్రోధ, మొహా, మద మాత్సర్యాలు పరిగెట్టే గుర్రాలుగా వచ్చి దాడి చేస్తాయి. సాధకుడు కొంత మేరకు సాధనలో ముందుకు సాగితే తనకు తెలియకుండానే కొన్ని అద్భుత శక్తులు వస్తాయి. ఉదాహరణకు సంకల్ప సిద్ది. అంటే సాధకుడు తాను తన మనస్సులో ఏది అనుకుంటే అది సిద్దించటం అనుమాట. అలాగే సాధకునికి వాక్సుద్ధి కలుగుతుంది. ప్రారంభంలో ఇలాటివి సంక్రమిస్తాయి. వాటికి తాను ఉప్పొంగిపోయి తాను ఏదో సాదించాననే భావన మదిలో కలిగిందా ఇక ఇంతే కొండమీద నుండి జారీ క్రిందపడ్డ వాడి గతే మరల తాను సాధనలో ముందుకు వెళ్ళటానికి చాలా సమయం పట్టవచ్చు లేక చాలా జన్మలు పట్టవచ్చు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి 84 లక్షల జీవరాసులలో మనుష్య జన్మ ఒకటి. తాను ఈ దేహం వదలిన తరువాత తిరిగి మనుష్య జన్మ సిద్దిస్తుందనటానికి నమ్మకం లేదు. ఈ జీవన మరణ భ్రమణలో ఎప్పటికో తిరిగి తన పుణ్య ఫలం కొద్దీ తిరిగి మనుష్య జనమ లభించ వచ్చు. అది ఏంటో దుర్లభామ్. కాబట్టి ఈ జన్మను సార్ధకత చేసుకోవటానికే సదా సాధకుడు కృషి చేస్తే మంచిది. . సాధకుడు సదా తన మనస్సును నిర్మలంగా నిర్వికల్పంగా ఉంచుకోవాలి. నిరంతరం ద్రుష్టి భగవంతుని మీదనే లగ్నాత చేయాలి. తన చుట్టూ ప్రక్కల అనేక విషయాలు తనని మాయలో పడేసేవి ఉంటాయి. అవి సుందరమైన స్త్రీలే కావచ్చు, ధన కనక వస్తు వాహనాదివి అయినా కావచ్చు. వేటికికూడా సాధకుని మనస్సు చెలించనీయకుండా చూసుకోవాలి. అప్పుడే సాధకుని సాధన ముందుకు వెళుతుంది. 

సాధకుడు ఎంతో శ్రమదమాలకు ఓర్చి నిరంతర కృషిచేస్తేనో సాధన చతుష్టయాన్ని సాధించగలరు. నిరంతర సాధనతో ముముక్షత్వన్ని సాధిస్తే అప్పుడు గురువు తనకు మార్గదర్శనం చేస్తాడు. ఇక్కడ అసలు ప్రశ్న ఉదయిస్తుంది. ముముక్షత్వస్థితిని చేరిన సాధకునికి ఇంకా గురువు ఆవశ్యకత ఏముంది అని అనుకుంటాము. ఎప్పుడైతే సాధకుడు నిరంతరం సాధన చేస్తూ భగవంతునివైపు పయనం అవుతుంటాడో అప్పుడు అనుకోకుండా ఎన్నో అడ్డంకులు వస్తూవుంటాయి. కొన్ని అవరోధాలు ఎలా ఉంటాయి అంటే తాను సరైన మార్గంలో లేడు అని అనిపించేవిధంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో తాను సాధనలో విఫలమైనాను అని తలచేవిధంగా కూడా భావనలు మదిలో మెలగవచ్చు. అట్టి తరి ఒక సద్గురువు తారసపడి తనను సరైన మార్గంలో పెట్టి తన జన్మకు సార్ధకతను కలుగ చేస్తాడు. ఏరకంగా అయితే వివేకానందస్వామికి రామకృష్ణ పరమహంస దొరికారో అలాగ.  

ఇక్కడ ప్రతి సాధకుడు తెలుసుకోవలసింది ఏమిటంటే ముందుగా సాధకుని ద్రుష్టి సంపూర్ణంగా భగవంతుని మీద మాత్రమే కేంద్రీకరించబడి ఉండాలి తరువాత తాను సరిగా చూడ లేకపోతే కళ్ళ డాక్టారు ద్రుష్టి దోషాన్ని సవరించి కళ్ళజోడు ఇచ్చి దృష్టిని మెరుగు పరుస్తాడో అదే విధంగా సద్గురువు సాధకుని దృష్టిని పూర్తిగా భగవంతుని వైపే మళ్ళేటట్లు తన బోధనల వలన చేస్తాడు. భగవంతుని దర్శించుకునే పని మాత్రం సాధకునిదే. సాధకుడు నిరంతర సాధన చేస్తే మాత్రమే భగవత్సాక్షాత్కారం కాదు. అది మరవ వలదు. కాబట్టి సాధక మిత్రమా నిన్ను ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని కాలయాపన చేయక ఈ క్షణమే మోక్షార్థివి కమ్ము సాధన మొదలుపెట్టు. ఆత్మసాక్షాత్కారాన్ని పొందటానికి కృషి చేయి. నిరంతర సాధన తప్పకుండ మోక్షాన్ని సిద్ధిస్తుంది. అందులో అనుమానమే లేదు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ భార్గవ శర్మ 

కామెంట్‌లు లేవు: