5, అక్టోబర్ 2024, శనివారం

*శ్రీ ఆది శంకరాచార్య చరితము32

 _*శ్రీ ఆది శంకరాచార్య చరితము32 వ భాగము*_

🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄


*హిరణ్యగర్భమతము*:


అనంతశయన క్షేత్రము నుండి శ్రీ ఆచార్య స్వామి శిష్య పరివార సహితంగా బయలుదేరి అయిదు దినములకు సుబ్రహ్మణ్యక్షేత్రం చేరు కొన్నారు. 


ఆ క్షేత్రమందు గల కుమార ధారా నది మిగుల పవిత్రమై ప్రసిద్ధి కెక్కి యున్నది. అచట షణ్ముఖస్వామివారి ఆలయ మున్నది. అది గొప్ప యాత్రా స్థలము.


శ్రీశంకరావతారమూర్తి, కుమారధారానదిలో స్నానమాచరించి విభూతి నలంకరించు కొని కాషాయాంబర ములు ధరించి దండకమండల ధారియై దివ్యమైన తేజస్సుతో బయలుదేరి షణ్ముఖ స్వామివారిని దర్శించు టకు వెడలుచున్నారు. ఆ మహాతేజస్సం పన్నుని జూచి కైలాస వాసుని వలె భావించి అబ్బురపడి వారితో ముచ్చటించు భాగ్యము పొందుటకై పరితపిం చారు. తమ మత ప్రభావమును వారికి నివేదించుటకు ఆయత్త పడ్డారు. యాత్రీకులలో నొకడు పట్టజాలక శంకరపాదుల కడకు వచ్చి,


'యతివర్యా! మేమందరం బ్రాహ్మణ కులంబున జన్మించి ద్విజులమై మనుధర్మ శాస్త్రానుసారం కర్మల ను చేయుచున్నాము. ఆది పురుషుడైన హిరణ్యగర్భుని మనసార సేవిస్తూ నిర్మల హృదయం గల వారలమై ఆ దేవదేవుని అనుగ్రహం వలన ఏచింతా చీకూ లేకుండ సుఖముగ నుంటున్నా రము. స్వామీ! సమస్త ప్రాణి కోటి పుట్టుటకు ముందుగ హిరణ్యగర్భు డు ఉద్భవించాడు. అర్హుడగుటచే ఆయనకే హవిస్సునిస్తున్నారు. వేదవాక్యము లందుకు పరమ ప్రమాణములుగ నున్నవి. సృష్టికర్తయై పాలకుడై లయకారకుడై ఉత్తమోత్తముడై పరమానందధాముడై యున్నాడని తెలుప బడుచున్నది. ‘తదైక్షత' ఇత్యాది వాక్యములు ఆయనను స్తుతించు చున్నవిగదా! ఆ ప్రభువు తన భుజము లచే శివకేశవులను సృష్టిస్తున్నాడు. అట్టి సర్వాంతర్యామి అయిన హిరణ్యగర్భుని భక్తులమై యున్నాము. సర్వదా యోగనిష్ఠలో నుండి కూర్చ కమండ లులను ధరించు వారలము. 

మహా యశస్సంపన్ను లైన మిమ్ములను దర్శించుటతో నిశ్చయంగా కృతార్థుల మైతిమి. ఒకించుక మా మాట నాలకించుడు.


'యోగీశ్వరేశ్వరా! జీవేశ్వరాభేద తత్త్వము తో నేమి ప్రయోజ నము గలదు? సర్వ లోకాధిపతియైన హిరణ్యగర్భుని ఉపాసించుడు. ఆ పరాత్పరుని వలన సర్వప్రాణులు పుట్టు చున్నవి. కర్మఫలం వలన దుఃఖ భూయిష్ట మైన సంసార సాగరంలో బడుచున్నారు. హిరణ్యగర్భుడే సర్వ మూలకారణుడై యున్నాడు. ప్రళయ కాల మందు జీవకోటి యావత్తు బ్రహ్మలో లయమగుచున్నది. దీనినే మోక్ష మనుచు న్నారు. వారల వాసనా బలంతో సృష్టి జరుగు నప్పుడు మరల జీవులుపుట్టుచున్నారు. ఇది నిజమైన మోక్షం కాదు. ఒక్క బ్రహ్మజ్ఞాన సంపన్నుడే పరమ పదమగు బ్రహ్మలోక నివాసము నొందు చున్నాడు. వానికి పునర్జన్మ లేదు. కావున హిరణ్యగర్భుడు సేవింపదగినవాడై యున్నందున తాము దండ, కమండలములను ధరించి యతీశ్వరులై జగద్గురువులై బ్రహ్మ జ్ఞానులై యుండుటచే బ్రహ్మలోకమును పొంద తగి యున్నారు. కనుక తామట్లు హిరణ్యగర్భుని ఉపాసించుడు' అని వివరించాడు. 


హిరణ్యగర్భ మతస్థు డు చెప్పుకొన్న దంతా చక్కగా విని,

'భక్తులారా! బ్రహ్మాదు లందరు ఎవరి వలన ఉద్భవించారో తెలిసి కొనవలెను.పరాత్పరుని గురించి క్షుణ్ణంగా తెలిసి కొన్నచో ముక్తి తప్పక లభ్యంకాగలదు. ముక్తి హేతువైన తత్త్వజ్ఞానం కావలెనన్న వేదాంత శ్రవణాదులు చేయాలి. మీరనినట్లు లయకాల ముక్తి శాశ్వతంకాదు. అది ఒక దీర్ఘ నిద్ర వంటిది. బ్రహ్మను ఆశ్రయిస్తే జ్ఞానం రాదు, తత్త్వ జ్ఞానార్జనతోనే బ్రహ్మత్వాన్ని పొందేది. ఈ విధాన మంతయు వివరంగా శ్రుతులు తెల్పుచున్నవి.' అని శ్రీఆచార్యస్వామి తెలియచెప్పారు.


శ్రీశంకరపాదులు తెల్పిన తత్వరహస్య మును గ్రహించి హిరణ్యగర్భమతస్థులు బ్రహ్మానంద భరితులై శ్రీ ఆచార్య స్వామికి శిష్యులయ్యారు. 


పిమ్మట అగ్నిదేవో పాసకులు శంకరులతో ముచ్చటించ నెంచిరి.


*అగ్ని దేవోపాసకులు:*


అగ్నిని ఆరాధించే మతములోని వారొకరు లేచి శంకరులను

సమీపించి, "స్వామీ! నమస్కారములు! మేము అగ్నిహోత్రుని యథావిధిగా పూజించు వారలము. ఆయన మాకు పరమదైవం. సృష్టికి పూర్వం ఒక్క అగ్నిదేవుడే ఉన్నాడు. దేవతలందరు అగ్ని నుండి జనించారు. ఆ దేవగణమందు గల అగ్నిదేవుడే విష్ణుమూర్తి అయ్యాడు. అగ్నియే మొదట హవిస్సును గైకొనుచున్నాడు. పిమ్మట దేవతలకిచ్చు చున్నాడు. వేదము అగ్నికి ప్రముఖస్థానం కల్పించి బ్రాహ్మణులను పూజించ మనుచున్నది. వారు దానిని అత్యంత భక్తితో భద్రపరచు కొనినిత్యము ఉపాసిస్తూ ముక్తులగు చున్నారు. కావున మోక్ష హేతువునకు అగ్నిని పూజించుట మూలకారణము అగుచున్నది.


సర్వపాప హరుడని,ఉపాస్యుడని, అగ్నిదేవుడని వేదము లు తెలియజేయు చున్నవి. తామును మా వలెనే అగ్ని దేవుని ఆరాధించి ముక్తి నొందుడు. మీ మతం వలన ప్రయోజనం శూన్యం.' అని వెల్లడించారు. 


శ్రీ శంకరపాదులు వహ్ని మత పద్ధతిని విని,


‘అగ్ని దేవోపాసకులారా! అగ్ని దేవతలందరి కంటే తక్కువ వాడు. దేవతలు మధ్యమము గను, విష్ణువు అందరి కంటే గొప్పవాడుగను చెప్పబడినది. పైగా అగ్ని దేవతలందరకు హవిస్సు తెచ్చి ఎవరి భాగం వాళ్ళకు అందిం చే వాడుగను కర్మ దేవతగను ఉన్నాడు. అగ్నిదేవుని గురించి చెప్పబడే వాక్యము లన్నియు ఆత్మకు సంబంధించిన వని తెలిసికొనుడు. కావున ఇంతటి నుంచి తత్త్వమును గ్రహించి అగ్నిహోత్రాది సత్కర్మ లుచేస్తూ విష్ణుదేవుని ఉపాసించుడు. అప్పుడు జ్ఞానార్జనకు అవకాశం లభించి తద్వారా ముక్తిని బడయగలరు.’ అని నిజస్థితిని తెలిపిరి.


అంతట అగ్నిమత స్థులు శ్రీశంకరుల సుభాషితముల ఆంత ర్యం గృహించి అద్వైత మతము నవలంబించి శ్రీ ఆచార్య స్వామివారికి శిష్యులయ్యారు. 


పిమ్మట సౌరమతస్థులు శంకరులకు తమ మతప్రభావమును వ్యక్తం చేయ నుద్యుక్తు లయ్యారు.


సౌరమతస్థులు:


సూర్యుని ఉపాసించు వారిని సౌరమతస్థు లందురు. సూర్యునకు ప్రీతికరమైన రక్త పుష్ప మాలికలను ధరించు కొని భాస్కరచక్రాంకిత ములను వేసికొన్నవారు వచ్చియున్నారు. అందు భాస్కరుడను పేరు గలవాడు లేచి, “ఆచార్యస్వామీ! నమస్కారములు! అన్ని మతముల కంటె బహు శ్రేష్ఠమైన మా మత మెట్టిదో వినండి. ఎవరి మట్టుకు వారు, వారి మతమే గొప్పదని చెప్పుకొన్నను,అందున్న రహస్యమును తెలిసి కొనినగాని నిజం తేలదు. శ్రుతిలో సర్వలోకములకు సూర్యుడు నేత్రమై ప్రకాశించుచున్నాడని తెలుపబడి యున్నది కదా. ఆతడే తిమూర్త్యా త్మకమై సృష్టి స్థితి లయములకు కారకుడై యున్నాడు. ఆదిత్యుడే పరబ్రహ్మమని వేదము లు పల్కుచున్నాయి.


సూర్యోపాసకు లందరు వేదమందున్న సూర్య మహా మంత్రాన్ని (శ్రీఘృణి సూర్య ఆదిత్య) జపిస్తూ ఉంటారు. రక్తచందనం తిలకముగ ధరించి, ఎఱ్ఱటి పుష్పమాలిక లను అలంకరించు కొనెదము. మా సూర్య ఉపాసకులు ఆరు రకములుగా నున్నారు. (1) ఉదయభాస్కరుని బ్రహ్మగా భావించి ఉపాసించువారు, 


(2) మిట్టమధ్యాహ్నపు సూర్యుని ఈశ్వరుని గను లయకారునిగను, భావించి పూజించువారు


(3) సూర్యాస్తమయ భాస్కరుని సర్వరక్షకు డైన విష్ణుమూర్తిగ ఉపాసించువారు, 


(4) త్రిసంధ్యల యందున్న భానుని త్రిమూర్తిగా భావించి అర్చించువారు,


(5) సూర్యుని గగన మండలంలో ఎచ్చోట నైనను చూచుటే ప్రధానంగా గలవారు, వీరలు సూర్యదర్శనం చేయకుండ భోజనం చేయరు. ఎప్పుడు కన్పించిన అప్పుడే భుజించువారు. కన్పించు వరకు ఉపవసించెదరు, 


(6) నుదుటను భుజములయందు వక్షస్థలమందు, సూర్య మండల చిహ్నములను అంకితంచేసికొన్నవారు, అను ఆరు శాఖలవారు అనుక్షణము సూర్య మంత్రమును జపించు కొందురు. ఇది మావిధి విధానము, ఇందులకు శ్రుతి ప్రమాణము లనేకము లున్నవి. పురుష సూక్తమందు భానుని గురించియే స్తుతించబడి యున్నది. 'పురుషంకృష్ణపింగళమ్' అని రుద్రమంత్ర మందు ఆదిత్యుని తెలియజేయుచున్నది. 


ఇట్లనేక ప్రకారముల శ్రీసూర్యదేవుని తెలియ జేయుచున్నందున మా కారాధ్యదైవమయ్యాడు. 


అరుణ, సూర్య, భాను, చంద్ర, తపన, మిత్ర, హిరణ్యరేత, రవి, అర్యమ, గభస్తి, విష్ణు, దివాకర అను పండ్రెండు పదములతో విరాజిల్లుచుండుటచే ద్వాదశాదిత్యుడను బిరుదు పొంది యున్నాడు. ఆ నామ ములలో విష్ణునామ ముండుటచే సూర్యుడే విష్ణువై యున్నాడనుట నిర్వివాదము. శ్రీకృష్ణపరమాత్మ పండ్రెండుగురు ఆదిత్యులలో విష్ణువును నేనే యని యనుటకు కారణ మైనది. జ్యోతులలోకెల్ల కిరణా (దాతా, అర్యమా, మిత్ర: వరుణః ఇన్ద్ర: వివస్వాన్, పూషా, పర్జన్యః అంశుః భగః త్వష్టా, విష్ణుః అనునది మరియొక పాఠము) లతో కూడిన రవిని నేనే (ఆదిత్యానామ హం విష్ణుర్జ్యోతిషాం రవి రంశుమాన్) అని యుండుటచే రవిని శ్రీకృష్ణపరమాత్మగా తెలిపియున్నారు. కనుక బ్రహ్మాది దేవత లందరు రవినుండి ఉద్భవించారు. సమస్త విషయములకు కారణ భూతుడగుట వలన మోక్షకాము లందరు సూర్య భగవానుని ఆరాధించి తీరవలెను' అని వ్యక్తం అవు తున్నది. శ్రీశంకరాచార్యస్వామి సౌరమత భావములను పూర్తిగా విన్నారు. సౌరమతమందు గల లోపాలను సవరించ నెంచి,


దివాకరా! మీ రందరు ఒక చిన్న విషయము తెలిసికొనలేక చిక్కు లలో పడియున్నారు. 'చంద్రమా మనసో జాతః చక్షో స్సూర్యః' అని యున్నది గదా! అనగా పరాత్పరుని మనస్సునుండి చందురుడును నేత్రమునుండి సూర్యుడును పుట్టి యున్నారు అని వేదమే ప్రమాణమై యున్నది. 


‘యజ్జ న్యం తన్నశ్యమ్' పుట్టినది నశించునదే గదా! సూర్యుడు పుట్టిన వాడాయెను. కనుక ఆతడును నశించువాడే. నశించు వాని యందు బ్రహ్మత్వ మెట్లుండును?


మరియొక విషయము నాలకించుడు. గాలి వీచుచున్నది.సూర్యుడు నిత్యము ఉదయించు చున్నాడు. అగ్ని వెలుగుచున్నది. దేవేంద్రుడు స్వర్గమును పరిపాలిస్తున్నాడు. మృత్యువు పరుగులు వారుచున్నది. వీళ్ళం దరు పరాత్పరుని ఆజ్ఞకు బద్ధులై వాళ్ళ వాళ్ళకు నియమింప బడిన పనులు నెరవేర్చుచున్నారు. అట్టి పరిస్థితులలో సూర్యుణ్ని భగవంతు డని అనడం మూఢత్వం కాక మరేమున్నది! పరమాత్మకు అపార మైన ప్రకాశమున్నది.


ఆ ప్రకాశములో ఇతరు లెట్లు ప్రకాశింప గలరు. పరమాత్మను అనుస రించి మిగిలినవన్నియు ప్రకాశించుచున్నవి. అప్పుడు సూర్యుడు పరబ్రహ్మ ఎట్లగును? జ్యోతిష శాస్త్రమందు సూర్యుడు మొదలైన వారికి నిత్యత్వము లేదని చెప్పబడినది. బ్రహ్మ ఉదయకాల మందు దేవతలందరు పుట్టుచున్నారు. బ్రహ్మ దినాంతమందు వారందరు లయమగు చున్నారు. ఈ రెండు కల్పముల కాలము బ్రహ్మకు ఒక దిన మగుచున్నది. అట్టితరి అందరికీ మూలకారణ త్వం సూర్యునకు అంట కట్టడం న్యాయం కానరాదు. కావున పరమాత్మనే ఉపాసిం చుడు. మీ పాషండ చిహ్నాలను విడనాడి సదాచారములను,

అలవరచుకొనండి. పరమ పవిత్రమైన ఆత్మ తత్త్వ మును తెలిసికొనండి. జ్ఞానము నార్జించుకొని ముక్తిని పొందుడు.' అని ఉపదేశించారు. ఆచార్యపాదులు.


శ్రీ శంకరాచార్యస్వామి సౌరమత లోపాలను ఏరివేయుటతో దివాకరాదులందరు సంతోషించిరి. నాటితో సౌరమతమునకు నీళ్ళువదిలి అద్వైత మతము నవలంబించి శ్రీ శంకర పాదులకు శిష్యులై బహుభంగుల కీర్తించారు.


శ్రీ శంకరపాదులకు అప్పటికి మూడు వేలమంది శిష్యులు ఉన్నారు. జగద్గురువులయెడ గాఢమైన భక్తి కలుగ కొందరు శంఖములు పూరించిరి. మరికొందరు దివ్యమంగళ ధ్వనులు గావించారు. కొందరు ఏకకంఠంతో స్వస్తి వాచకములు పలికారు. మరికొందరు కరతాళ ధ్వనులు చేసారు. శంకరులకు ఇరు పార్శ్వములందుండి వింజామరలతో వీచుచున్నారు. మిగిలినవారు నెమలి పింఛములు ధరించారు ఆనందం పెల్లుబుకు నట్లు సకలోపచారము లర్పించేవారు. అట్లు శిష్యకోటి అర్చించు చున్నను కించిత్తెనను భోగములను అనుభ వించక తామరాకు మీది నీటిబిందువు పగిది యుండెడివారు

 శ్రీ ఆచార్యస్వామి. నెలరోజులయినతోడనే సుబ్రహ్మణ్యక్షేత్రం వీడి శిష్యకోటితో గణవర పురమునకు ప్రయాణ మైనారు.


*కాలడి శంకర కైలాస శంకర* 


*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 32 వ భాగము సమాప్తము*

🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴

కామెంట్‌లు లేవు: