5, అక్టోబర్ 2024, శనివారం

అన్నపూర్ణా దేవి*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

           *అన్నపూర్ణా దేవి*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ప్రతీ ఆస్తీకునికి ఈ చిత్తరువు సుపరిచితమే. “భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి” అని ఆది శంకరాచార్యులు కీర్తించిన అన్నపూర్ణాష్టకం అందరూ నోరారా పాడుకుని అమ్మవారి కరుణగా అన్నం తింటున్నాము. మనలాంటి అల్పులకు అన్నం పెట్టింది అమ్మవారు సరే మరి సంపూర్ణ పరబ్రహ్మ అయిన ఈశ్వరునికి అమ్మవారు భిక్ష ఇవ్వడం ఏమిటి?*


*అసలేది అవసరం లేని భవుడు దేహి అని అమ్మవారిని అడగడం ఏమిటి? ఆదిభిక్షువు గా అలా ఎందుకు అవతారం ఎత్తవలసి వచ్చింది? అంటే అంతా ఆయన లీల. శివ, శక్తి  అవిభాజ్యం, కానీ లీలావినోదంగా ఇద్దరూ కలిసి ఆడిన నాటకం ఏమిటో ఒకసారి చూద్దాం.*


*ఒకానొక శుభోదయం నాడు అమ్మవారు అయ్యవారు కైలాశ శిఖరం మీద సుఖాశీనులై ఉండగా ఎప్పటిలాగానె పార్వతీదేవి శివుని ప్రకృతి పురుషులలో ఎవరు అధికులు అని ప్రశ్న సంధించింది.*


*శుద్ధసత్త్వమైన పురుషుని వలననే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు చెప్పగా ఇరువురి మధ్య చిన్న వాదోపవాదాలు జరిగి ఆఖరకు అమ్మవారు ప్రకృతి ప్రాభవం తెలియజేయసంకల్పించి అమ్మవారు శక్తిని ఉపసంహారం చేసి అంతర్ధానం అవుతుంది.*


*దానితో పోషణ లేక లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి. కానీ తన సృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తుంటే తట్టుకోలేక అమ్మవారు కాశీ పట్టణంలో తానే గరిట పట్టుకుని వండి కోటానుకోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది.*


*శివగణమంతా ఆకలికి తట్టుకోలేక హాహాకారాలు చేస్తుంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని నిరతిఆనందస్వరూపుడు శివుడు భిక్షాటనకై భిక్షపాత్ర తీసుకుని కాశీకి వెళ్లి అన్నపూర్ణ చేతిలో అన్నం స్వీకరిస్తాడు.*


*అప్పుడు ఇద్దరిలో ఎవరూ అధికులు కారని, ప్రకృతి పురుషులిద్దరూ అన్నింటా సమానమని చాటి చెప్పి మరల కైలాశానికి వెళ్ళిపోతారు. కాశీ లో అన్నపూర్ణగా అమ్మ శక్తి నిలుస్తుంది.*


*లౌకికంగా చూస్తె ఏమిటి వీరు పోట్లాడుకోవడం ఏమిటి ఆధిక్యం కోసం పోటీ పడ్డట్టు అనిపిస్తుంది కానీ వారు ఆడిన నాటకం ద్వారా చెప్పబోయిన పరమసత్యం మనం అర్ధం చేసుకోవాలి. పురుషాధిక్య ప్రపంచంలో ఎవరైనా పురుషుడే అధికుడని అనుకుని పొరబడే అవకాశం ఉండడం వలన అందరికీ తగు పాఠం చెప్పడానికి దివ్యదంపతులిద్దరూ కలిసి ఆడిన నాటకం ఇది. శక్తి లేకపోతే స్థూల శరీరం ఉండి లాభం లేదు. ఎవరైనా శక్తి హీనుడు అంటారు కానీ విష్ణుహీనుడు, శివహీనుడు అని అనరు. శరీరం లేని శక్తి నిరర్ధకం. శక్తి ఉన్న శరీరం శివం లేకపోతే శవం. కాబట్టి రెండూ సమపాళ్లలో ఉంటేనే మనుగడ అని చాటి చెప్పడానికి ఇద్దరిగా ఉన్న ఒక్కరు ఆడిన నాటకం.*


*అన్నపూర్ణ అమ్మ మహిమ గురించి మరొక రెండు సంఘటనలు చెప్పుకుని ముగిద్దాం.*


*ఒకసారి ఆది శంకరాచార్యులవారు శిష్యులతో కూడి భిక్షాటనకు వెళ్ళినా వారికి ఆహారం దొరకలేదు. శిష్యుల క్షుద్బాధ చూడలేక ఆచార్యులు అమ్మవారిని శరణు వేడారు. అప్పుడు ఆయన గానం చేసినదే అన్నపూర్ణాష్టకం.*


*అమ్మవారు ఎంతో ప్రేమగా అందరికీ వండి వడ్డించింది. అమ్మవారి అనుగ్రహంతో ఆవిడ చెప్పిన బోధవలన ఆయన ప్రస్థానత్రయానికి భాష్యం రాయడం మొదలుపెట్టారు. ఆవిడ పెట్టిన జ్ఞానభిక్ష స్వీకరించిన ఆదిశంకరులు అత్యద్భుతమైన రచనలు చేసారు. ఇక్కడ అమ్మవారు అన్నం అంటే కేవలం భౌతికమైన ఆకలిని మాత్రం తీర్చేది కాదు జ్ఞాన పిపాసను తీర్చే అమృతతుల్యమైన జ్ఞానాన్ని భిక్షగా వేస్తుంది. ఎలాగైతే ఆకలి తీరి శరీరానికి పటుత్వం వస్తుందో, అమ్మవారు పెట్టిన జ్ఞానభిక్ష ద్వారా ఆధ్యాత్మిక అభ్యుదయం కలుగుతుంది. జీవనం పరిపుష్టమవుతుంది.*


*ఒకసారి వ్యాస మహర్షి తన శిష్యకోటితో కాశీ సంచారం చేస్తూ అమ్మవారి లీల వలన వరుసగా రెండు మూడు రోజులు భిక్ష దొరకక చాలా క్లేశాలకు గురవుతారు. తనకు భోజనం పెట్టలేని కాశీని శపించబోతే అమ్మవారు ఒక ముసలి ముత్తైదువులా అక్కడకు వచ్చి గంగా తీరాన వేదవ్యాసునికి, అతని శిష్యబృందానికి షడ్రసోపేతమైన విందు వడ్డిస్తుంది. అటువంటి భిక్ష కేవలం అన్నపూర్ణ అమ్మ మాత్రమె ఇవ్వగలదని గుర్తించి తన అజ్ఞానానికి చింతించి అమ్మవారి పాదాలపై పడతాడు. అప్పుడు తనకెంతో ఆప్తమైన కాశీని శపించబోయిన వ్యాసుని శివుడు కోపగించి ఇక కాశీలో అతనికి ప్రవేశం లేదని శాపవాక్కు ఇస్తారు. అందుకే నేటికీ కూడా గంగకు ఆవలి ఒడ్డున వ్యాసకాశీ వుంటుంది. కాశీలో అమ్మవారు నిలిచి అందరికీ భోజనం పెడుతూ వుంటుంది. అక్కడ అమ్మవారి విగ్రహాన్ని చూస్తె ఒళ్ళు గుగుర్పాటుకు గురవుతుంది. సాక్షాత్తు అమ్మవారు నిలిచి ప్రాణులందరికీ ఆహారం అందిస్తున్న క్షేత్రం అది.*


*ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యే నమః।*

*ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యే నమః।*

*ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యే నమః।*

కామెంట్‌లు లేవు: