8, డిసెంబర్ 2024, ఆదివారం

విభూతియోగము

 10-35-గీతా మకరందము

          

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


బృహత్సామ తథా సామ్నాం 

గాయత్రీ ఛందసామహమ్ | 

మాసానాం మార్గశీర్షోఽహం ఋతూనాం కుసుమాకరః || 

 

తా:- సామవేదగానములలో బృహత్సామమును,  ఛందస్సులలో గాయత్రియు, మాసములలో మార్గశిరమాసమును, ఋతువులలో వసంతఋతువును నేనైయున్నాను. 

 

వ్యాఖ్య:- ‘మాసానాం మార్గశీర్షోఽస్మి’ - ఈ క్రింది కారణములచే మార్గశీర్షమాసముయొక్క శ్రేష్ఠత్వము సూచితమగుచున్నది - 

(1)పూర్వము మహాభారతకాలమున సంవత్సరము మార్గశీర్షమాసముతో ప్రారంభమగుచుండెడిది. (మహాభారతము - అను - 106,109 అధ్యా). కావున అది అన్నిమాసములకును మొదటిది అయియుండెను. 

(2)ధనుర్మాసకాలమగు ఆ సమయము మహాపవిత్రమైయున్నది. శాస్త్రములందును ఆ సమయమున వ్రతోపవాసాదులు సలుపువారికి గొప్ప ఫలితములు చేకూరునని వచింపబడినది. 

(3)జనులకు క్రొత్తపంట చేతికివచ్చును. అందఱియొద్ద ధాన్యము పుష్కలముగ నుండును. 

(4) వాల్మీకి రామాయణమునందు మార్గశీర్షమాసము సంవత్సరమునకు భూషణముగ వర్ణింపబడినది. 

(5) భగవద్గీత ఈ మార్గశిరమాసమందే ఆవిర్భవించినది. (మార్గశిర శుద్ధ ఏకాదశి). 

(6) అవతారపురుషులగు దత్తాత్రేయులు ఈ నెలయందే జన్మించిరి. (మార్గశిర శుద్ధ పౌర్ణమి). 

(7) వాతావరణము చల్లగనుండుటచే జనుల హృదయమున్ను ఉల్లాసముగ నుండును. ధ్యానాదులకది అనుకూలసమయము. 

    “ఋతూనాం కుసుమాకరః” - వసంతఋతువునందు చెట్లన్నియు చిగిర్చి శోభాయమానముగనుండును. అత్తఱి వాతావరణమున్ను సమశీతోష్ణముగ నుండును. కావున ఋతువులలో అది శ్రేష్ఠముగ వర్ణింపబడెను. శ్రీరామచంద్రుడున్ను ఆ పవిత్రఋతువునందే జన్మించిరి.

కామెంట్‌లు లేవు: