ఈశ్వరార్పణ
ఒక హరిదాసుగారు నాయనలారా మీరు ఏదో ఒకటి రోజు ఈశ్వరార్పణ చేయండి అందువలన మీకు పుణ్యం వస్తుంది అని చెప్పారట. ఇది బాగానే వుంది ఏది ఈశ్వరార్పణ చేయాలి ఏది చేయాలన్నా మనసు రావటం లేదే అని రమణయ్య అనే ఒక పౌరుడు ఆలోచించాడు. అప్పుడు అతనికి ఒక అపూర్వమైన ఆలోచనవచ్చింది అదేమిటంటే నేను ఉపయోగించుకునేది ఏది కూడా ఈశ్వరార్పణ చేయటానికి మనసు రాదు కాబట్టి ఏదైనా నాకు పనికి రానిది నేను ఉపయోగించుకోలేనిది ఈశ్వరార్పణ చేస్తే అటు ఈశ్వరార్పణ చేసిన ఫలితం వస్తుంది ఇటు నాకు ఎలాంటి నష్టము రాదు అని అనుకున్నాడట.
ఒకరోజు పేలాలను వేయించి (పేలాలు అంటే వడ్లు జొన్నలు, మొక్కజొన్నలను వేయించటం వలన వచ్చేవి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మనం పాప్కార్న్ అనేవి మొక్కజొన్న పేలాలు) పిండి పడుతున్నాడట ఇంతలో పెద్దగా గాలి వీచింది. ఆ గాలికి కొంత పేలపిండి కొట్టుకొని వెళ్ళింది. అప్పుడు మన రమణయ్యకు హరిదాసుగారు చెప్పిన ఈశ్వరార్పణ గురుంచి జ్ఞ్యాపకం వచ్చింది. వెంటనే గాలికి పోయింన పేలపిండి మొత్తము ఈశ్వరార్పణమస్తు అని సంకల్పం చేసాడట. తనకు చెందలేనిది కూడా వృధాకాలేదు తనకు ఈశ్వరార్పణ ఫలితం లభించిందని సంతోషపడ్డాడట.
ప్రతి మనిషికూడా నేను నాది, నావాళ్లు అనే భావాన్ని ఒక గిరిగీసుకొని వుంటారు. ఆ చక్రపరిధిలోనుంచే ప్రతిదీ ఆలోచిస్తారు. తను చూసే తాను అనుభవించే ప్రతిదీ ఈ చక్రానికి ముడిపెట్టుకొని మసలుతారు. నిజానికి నేను అనేది ఏమిటి అని ఆలోచిస్తే అప్పుడు కానీ తత్త్వం బోధపడదు.
సగటు మానవుని అభిప్రాయం ఏమిటంటే నేను అంటే తన శరీరం అలానే నాది అంటే తన శరీరముతో ముడివేసుకున్న సంబంధాలు అవి మరల రెండు రకాలు ఒకటి శరీరంతో ఏర్పాటు చేసుకున్న మనుష్యసంబందాలు అంటే, తల్లిదండ్రులు, అన్నాతమ్ములు, అక్కాచెల్లెళ్లు ఇంకా భార్యా పిల్లలు ఇక రెండవది నిర్జీవయిన వస్తువులు అంటే నా ఇల్లు నా ఇంటి వస్తువులు, నా పొలము ఇలా చెప్పుకుంటూ పొతే అనేకమైనవి నాతొ ముడి పడి వున్నవి. వీటిచుట్టూనే ప్రతి మనిషి సంబంధం కలిగి ఉండి అదే సర్వస్వముగా భావిస్తారు. ప్రతి క్షణం తన ఆలోచనలు వీటి చుట్టూ పరిబ్రమిస్తూవుంటాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ బంధాల కోసమే భగవంతుని ప్రార్ధిస్తూ వుంటారు. భగవంతుడా నా భార్యా పిల్లలను చల్లగా చూడు, నా కొడుకుకు పరీక్షలో మంచి మార్కులు వచ్చేటట్లు చేయి, నా కూతురుకు మంచి సంబంధం దొరికేటట్లు చేయి నాకు మంచి ఇల్లు కొనుకున్నేటట్లు దీవించు, మంచి కారు ఇప్పించు ఇలా ఇలా అనేక కోరికలు నిత్యము మదినిండా నిండిపోయి ఎప్పుడు మనస్సును తొలుస్తూ వుంటాయి. ఈ ఉచ్చులోంచి తప్పించుకోవటం అంటే అది అంత సులభసాధ్యం కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అసాధ్యం అని కూడా అనవచ్చు. సాధకుడు అయిన వాడు ఈ సుడిగుండం నుండి ఎలా బయటపడాలి అని సదా ఆలోచిస్తాడు.
సాధకుడు తనకు వున్న బంధాలు కూడా కేవలం తన శరీరానికి చెందినవి మాత్రమే కానీ తనకు చెందినవి కావనే సత్యాన్ని తెలుసుకునే అన్ని బంధాలతో వున్న సంబంధాలను కేవలం కర్తవ్యభావనతో మాత్రమే నెరవేరుస్తాడు. నిజానికి ఆలా నడవటం చాలా అంటే చాలా కష్టమైన పని ఎంతో సాధనచేస్తేనే కానీ ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. నిజానికి ఈ ప్రపంచంలో ఈశ్వరార్పణ అనేదే ఏది లేదు ఎందుకంటె ఈ జగత్తు సంపూర్ణంగా ఈశ్వరుడిదే అయి వున్నది. కానీ నేను ఈశ్వరార్పణ ఎందుకు చేయటంలేదు అని చాలామంది అంటూవుంటారు. నేను నిత్యం చేసే జపతపాలను ఈశ్వరార్పణగా చేస్తున్నాను. నేను చేసే ప్రతి పూజను ఈశ్వరార్పణగా చేస్తున్నాను అని కొంతమంది భక్తులు అనవచ్చు. అది కొంతవరకు నిజమే ఎందుకంటె భక్తులు త్రికరణ శుద్ధిగా ఈశ్వరార్పణగా చేసే ప్రతి కర్మ తప్పకుండా ఈశ్వరునికి చెందవచ్చు. అందరు తప్పకుండ ఈశ్వరార్పణగా కర్మలు చేయాలి. అప్పుడు కర్మఫలం కేవలం ఈశ్వరునికి చెందుతుంది.
భక్తుడు కొంత పరిపక్వత చెందిన తరువాత జ్ఞ్యాన మార్గాన్ని చేరుకుంటాడు. ఎప్పుడైతే జ్ఞ్యాన మార్గాన్ని చేరుకుంటాడో అప్పుడు సాధకుని మానసిక స్థితి మారుతుంది. ఇప్పడిదాకా నేను వేరు భగవంతుడు వేరు అనే భావనతో పూజా, అర్చన చేసాడు. తన స్థితి పరి పక్వతకు చెందిన తరువాత నేను వేరు కాదు ఈశ్వరుడు వేరుకాదు అనే భావనలోకి వస్తాడు. ఆ స్థితే "త్వమేవ అహం" అనే స్థితి ఈ స్థితిలో సాధకుడు వేరుగా ఈశ్వరుడు వేరుగా గోచరించడు అప్పుడు ప్రత్యేకించి ఈశ్వరార్పణగా చేసే కర్మలు ఉండనే వుండవు. సాధకుడు చేసే ప్రతి కర్మకూడా ఈశ్వరార్పణగానే భాసిల్లుతోంది.
ఈశావాసోపనిషత్ లోని ఈ మంత్రాన్ని గమనించండి.
"ఓం ఈశా వాస్య మిదగ్గ్ సర్వం"
జగత్తులో ఏవేవైతే ఉన్నవో అన్నీఈశ్వరుడే అయి వున్నది. అంటే ఈ జగత్తులో ఈశ్వరుడు కానిది ఏది లేదు. ఆ విషయం ప్రతి సాధకుడు తన సాధనలో కొంత ముందుకు సాగితే కాని ఈ సత్యం తెలుసుకోలేడు. అప్పటిదాకా తానూ వేరు ఈశ్వరుడు (భగవంతుడు) వేరు అనే అజ్ఞ్యానంలో ఉంటాడు ఎప్పుడైతే అజ్ఞ్యానం తొలగి జ్ఞ్యానోదయం అవుతుందో అప్పుడు తెలుసుకుంటాడు తానూ ఈశ్వరునికన్నా బిన్నంగా లేడని. అప్పుడు తాను చేసే ప్రతి కర్మకూడా ఈశ్వరార్పణ కర్మ గానే గోచరిస్తుంది. ప్రత్యేకించి ఏ కర్మను కూడా ఈశ్వరార్పణగా చేయనవసరం లేదు. అప్పుడు సాధకుడు నిత్య సంతోషంగా ఆనందమూర్తిగా తానె ఈశ్వరుడిగా బాసిల్లుతాడు "బ్రహ్మవిత్ బ్రెహ్మయేవ భవత్" అందుకే బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మె అవుతాడు.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
ఇట్లు
మీ
భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి