**తిరుమల సర్వస్వం -81*
*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 20*
స్వామిపుష్కరిణిలో ఉన్న మహత్తు ఏమిటంటే మూడు దివ్యమైన మార్గాలద్వారా అందులోకి జలం చేరుతూ ఉంటుంది: *మొదటిది: భూస్పర్శ.* పుష్కరిణిలో ఉన్న అనేక ఊటబావుల నుండి ఎల్లవేళలా జలం ఊరుతూ, పుష్కరిణి నిండుగా ఉంటుంది. అంటే, భూదేవి, పుష్కరిణిని నింపడానికి తనవంతు ప్రయత్నం నిర్విరామంగా చేస్తుందన్నమాట. *రెండవది: ఇంద్రుని సమర్పణ.* వర్షపుధారల ద్వారా వచ్చిన నీటితో పుష్కరిణి నిండుతుంది.
*మూడవది: విరజానది* స్వర్గలోకం నుండి భువికి దిగివచ్చి స్వామిపాదాల క్రిందుగా ప్రవహిస్తూ పుష్కరిణిలో చేరుకుంటున్న *"విరజానది".*
*త్రిపథ జల సంగమమైనది కాబట్టే ఈ పుష్కరిణి పరమపవిత్రమైనదిగా విరాజిల్లుతోంది.*
ఈ పుష్కరిణి చుట్టూ దేవతలు కొలువై ఉంటారని భక్తుల విశ్వాసం. ప్రాచీనకాలంలో ఎందరో మహర్షులు పుష్కరిణి ఒడ్డున తపస్సు చేసి సిద్ధి పొందారు. సంస్కృతంలో *"నీరము"* అంటే నీరు లేదా జలము అని అర్థం. ఉదకం సాక్షాత్తు ఆ శ్రీహరి స్వరూపం కనుక, ఆ స్వామి "నారాయణుడు" అయ్యాడు.
ఈ సందర్భంలో తీర్థక్షేత్రాల గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాలి:
పుష్కరిణిలు, నదులు, ఏ ఇతర సహజ జలసదుపాయం లేకుండా ఉన్నటువంటి దేవాలయాన్ని *క్షేత్రం* అంటారు. దేవాలయం లేకుండా కేవలం సహజ జలసదుపాయం ఉంటే వాటిని *తీర్థం* అంటారు.
పుష్కరిణి లేదా నది మరియు ఆలయం - ఈ రెండూ కలిసి ఉంటే దాన్ని *తీర్థక్షేత్రం* అంటారు. *తిరుమల అన్ని తీర్థ క్షేత్రాలకు తలమానికం.*
దేవాలయాల్లో కూడా వాటి ఆవిర్భావాన్ని బట్టి ఐదు రకాలున్నాయి:
'భగవంతుడే "స్వయంగా" అవతరిస్తే అవి *స్వయంవ్యక్త క్షేత్రాలు.*
దేవతలచే నిర్మింపబడినవి *దివ్యక్షేత్రాలు.*
పురాణ ప్రసిద్ధి గాంచినవి *పురాణ క్షేత్రాలు.*
మునిపుంగవుల ద్వారా ఏర్పాటు చేయబడినవి *సిద్ధ క్షేత్రాలు* లేదా *ఆర్షములు*
భక్తులు, రాజులచే నిర్మించబడినవి *మానుషక్షేత్రాలు
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి