🙏బ్రాహ్మణత్వం -- తత్త్వం 🙏
దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణులలో నాలుగు సంప్రదాయములు ఉన్నాయి. అవి (1) "వైఖానస " (2)"స్మార్త" సంప్రదాయము, (3) "శ్రీవైష్ణవ" సంప్రదాయము, (4). "మధ్వ" సంప్రదాయము అని నాలుగు రకములైన బ్రహ్మణ సంప్రదాయములు ఉన్నాయి.ఎవ్వరైనా బ్రాహ్మణులే.
బ్రాహ్మణ శబ్దానికి ద్విజ, విప్ర, భూసుర, శ్రోత్రీయ వంటి పదాలు వర్యాయములుగా వాడుతున్నారు.
అది తప్పు అనను కానీ ఇవి పర్యాయ పదములు కావు. వీటికి ప్రత్యేక నిర్వచనాలు ఉన్నాయి.
రామాయణ, భారత భాగవతాది గ్రంథాలలో ఆ వ్యక్తిని బట్టి బ్రహ్మణోత్తమా అని, విప్రోత్తమా అని, శ్రోత్రీయా అని, ద్విజోత్తమా అని సంబోధించారు
బ్రాహ్మణ అంటే బ్రహ్మ జ్ఞానాన్వేషి.అని అర్ధం బ్రాహ్మణ జాతికి వర్తిస్తుంది.
ద్విజ అంటే రెండు జన్మలు కలవాడు అని అర్ధం
ద్వి అంటే రెండు జ అంటే పుట్టుక.
ఉపనయనానికి ముందు ఒక జన్మ, ఉపనయనము అయిన తరువాత ఒక జన్మ. ఇక్కడ ఒకవిషయం ఉపనయన సంస్కారం క్షత్రియ, వైశ్య, ఇంకా కొంతమందికి ఉన్నప్పటికీ ద్విజులు అంటే బ్రాహ్మణులు అని శాస్త్రం నిర్ణయించినది. అందుకే
ఏ పురాణాలలో అయినా ద్విజ శబ్దం బ్రాహ్మణ శబ్దానికి వర్యాయముగా వాడబడినది.
ఇక విప్ర శబ్దాన్ని తీసుకుంటే .విశిష్ఠమైన ప్రవర కలిగినవాడు విప్రుడు. మన ప్రవరలో ఋషుల వలె తాత, తండ్రి, మనుమడు ముగ్గురు (మూడు తరాలు) కూడా వేదాధ్యయనం పూర్తి చేస్తే అట్టి బ్రాహ్మణుణ్ణి విప్రుడు అంటారు.కాబట్టి ప్రతి బ్రాహ్మణుడు విప్రుడు కాదు. ఇది గ్రహించాలి
సాధారణ బ్రాహ్మణ జీవన విధానానికి వీరి జీవనవిధానానికి చాలా వ్యత్యాసం ఉంది.
శ్రోత్రీయుడు అంటే వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుడు అని అర్ధం.తాత, తండ్రి వేదాధ్యయనం చేయకపోయినా ఆ వ్యక్తి వేదాధ్యయనం చేస్తే శ్రోత్రీయుడే.అంతేగాక వేద విధానముగా జీవించేవాడు కూడా శ్రోత్రీయుడే కట్టు బొట్టు జుట్టు వంటివి గ్రహించాలి.
భూసురుడు అంటే భూమి మీద ఉన్న దైవ స్వరూపుడు అని అర్ధం. సర్వే జనాః సుఖినో భవంతు త్రికరణ శుద్ధిగా అనే బ్రాహ్మణుడు భూసురుడు.
ఇక వేదంలో చెప్పబడిన విషయాలు చూద్దాము.
బ్రాహ్మణో అస్య ముఖ మాసీత్
బాహూ రాజన్య కృతః
ఊరూ తదస్య యద్వైశ్యః
పద్భ్యాం శూద్రో అజాయతే
ఈ విరాట్టునకు (విష్ణువు ) బ్రాహ్మణుఁడు ముఖమయ్యెను .
బ్రహ్మ జ్ఞానవాంస్తు బ్రాహ్మణః ' అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన మన పూర్వీకులు
బృంహ్ - విస్తరణే - అనే ధాతువు నుండి బ్రహ్మ అనే పదము వచ్చింది. అంతటా వ్యాపించి ఉన్న చైతన్యము బ్రహ్మము. ఆ బ్రహ్మమునే అంతటా దర్శించేవాడు బ్రాహ్మణుడు.
బ్రాహ్మణులు వ్యక్తిగత సుఖాన్ని, స్వార్థాన్ని విడిచి పెట్టి, వైదికాచారాలను పాటిస్తూ, శాంతస్వభావులై, ఏకాంతప్రియులై, సత్యధర్మాచరణ చేస్తూ, దయాళువులై ఉంటారు.
" బ్రాహ్మణస్య దేహోయం న సుఖాయ ప్రకల్పతే "
బ్రాహ్మణుని శరీరము అతని సుఖం కోసం కాదు, లోక క్షేమం కోసం పరమాత్మ తో కల్పించబడింది. బ్రాహ్మణుడు తన సుఖం చూసుకోడు. సర్వ మానవాళి సంక్షేమం కోసం పాటు పడతాడు కనుక, మిగతావారందరూ బ్రాహ్మణుని సంక్షేమం కోరాలి
శూద్రునికి జన్మించిన వాడు శూద్రుడు కాగలడు కానీ బ్రాహ్మణునికి జన్మించినంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడు అంటున్నది ధర్మ శాస్త్రం. వేదము, పురాణాలు, శృతులు, స్మృతులు కూడా ఇదే మాట చెబుతున్నాయి. బ్రాహ్మణున్ని 'ద్విజుడు' అని కూడా అంటారు. ద్విజుడు అంటే రెండు సార్లు జన్మించినవాడు అని అర్థం. మొదటిజన్మ తల్లి గర్భం నుండి జరిగితే రెండవ జన్మ సంస్కారం వల్ల జరుగుతుంది. జన్మవల్ల శూద్రత్వం లభిస్తే కర్మవల్ల బ్రాహ్మణత్వం లభిస్తుంది
వేదాధ్యయనం చేసినవాడు బ్రాహ్మణుడు అని అర్థం. బ్రాహ్మణ స్త్రీ యందు, బ్రాహ్మణ పురుషుడి వలన జన్మించి, తదుపరి, జాతి, కులం, వృత్తి, స్వాధ్యాయం, జ్ఞానాల వల్ల బ్రాహ్మణుడిగా పిలువబడతాడు. తాను నిరంతరం చదువుకుంటూ వుండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలు చేయడం, యజమానులతో చేయించడం, దానాలు ఇవ్వడం-తీసుకోవడం బ్రాహ్మణులు చేయాల్సిన పని. బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారంతా బ్రాహ్మణులు కాలేరు. వారిలో ఉపనయనాది సంస్కారాలు, వైదిక కర్మలు లేని వారిని ‘‘మాత్రులు’’ అని, వైదికాచారాలు పాటిస్తూ శాంత స్వభావులైన వారిని ‘‘బ్రాహ్మణులు’’ అని, బ్రాహ్మణోచితమైన షట్ కర్మలను ఆచరించే వారిని ‘‘శ్రోత్రియులని’’, నాలుగు వేదాలను అధ్యయనం చేసిన వారిని, విద్వాంసులు,‘‘అనూచానులు’’ అని, ఇంద్రియాలను తమ వశంలో వుంచుకున్నవారిని ‘‘భ్రూణులు’’ అని, ఎప్పుడూ ఆశ్రమంలోనో, అరణ్యంలోనో వుండే వారిని ‘‘ఋషికల్పులు’’ అని, రేతస్కలనం లేక సత్య ప్రజ్ఞులైన వారిని ‘‘ఋషులు’’ అని, సంపూర్ణ తత్వ జ్ఞానం కలవారిని ‘‘మునులు’’ అని అంటారు. అఖండ భారత దేశంలోని అన్ని ప్రాంతాలలో బ్రాహ్మణులు విస్తరించి వున్నారు.
సనాతన హిందూ సాంప్రదాయంలో చాతుర్వర్ణ వ్యవస్థ యందు ఉన్నతమైన వర్గం బ్రాహ్మణులు. బ్రాహ్మణులు లేదా బ్రాహ్మలు అనగా బ్రహ్మ ముఖము నుండి పుట్టిన వారు. బ్రాహ్మలు అని వాడుకలో పిలిచినప్పటికీ "బ్రాహ్మణులు" అనడం సముచితం.
"యజనం యాజనం దానం బ్రాహ్మణస్యప్రతిగ్రహః అధ్యాపనం చాధ్యయనం షట్కకర్మాణి ద్విజోత్తమాః".
యజనం = యజ్ఞం చేయడం
యాజనం = యజ్ఞం నిర్వహించడం
అధ్యయనం = (వేదం) చదవడం
అధ్యాపనం = వేదం చదివించడం, చదువు చెప్పడం
దానం = ఇవ్వడం
ప్రతిగ్రహం = తీసుకోవడం
ఈ షట్కకర్మలు బ్రహ్మణులే నిర్వహించాలి.
మునుల వలన ఏ జాతి స్త్రీకి జన్మించిన వారైనను బ్రాహ్మణులుగా గుర్తించబడతారు. భారతీయ మసుస్మృతి ప్రకారం క్షత్రియులు (యోధులు, చట్టం అమలు, పరిపాలకులు), బ్రాహ్మణులు (గురువులు, పండితులు, ఉపాధ్యాయులు, హోమాదికములు, పూజారులు), వైశ్యులు (వ్యవసాయదారులు, వ్యాపారులు, ), శూద్రులు (సేవకులు) అను నాలుగు "వర్ణాలు" లేదా తరగతులు ఉన్నాయి.
హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటుపడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదములయందు ప్రావీణ్యం కలవారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభించుతున్నది. వారు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వేద, పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై మంచి అవగాహనను కలిగి ఉంటారు.
పంచ మహాపాతకాలలో బ్రాహ్మణ హత్య ఒకటి. బ్రాహ్మణులు చూడగానే గుర్తించే విధంగా ఉంటారు. వీరు చతుర్వర్ణ వ్యవస్థలో మొదటి వర్ణం వారు. మడి విధానాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తారు. మద్యపానం, మాంసాహారం వంటి దూరలవాట్లు వీరికి ఉండవు .
బ్రాహ్మణులు పౌరోహిత్యము,అర్చకత్వం, యజ్ఞాలు నిర్వహించడం, అపర కర్మలు చేయించడం,బ్రాహ్మణ మడి వంటలు వండడం,ఇంకా వ్యవసాయం, ఉద్యోగం మొదలైన పనులు చేస్తూ జీవనం సాగిస్తారు.
. ఆధునిక వాడుక భాషలో అందరూ "బ్రాహ్మణులు"" అయినప్పటికీ, ప్రాంతీయ మత ఆచార సాంప్రదాయ వ్యవహారములు, వేద పాఠశాలలు (శాఖలు) వలన వారు ఇంకా వివిధ ఉప కులాల వారీగా విభజించబడ్డారు. బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా ఆలయ పూజారులు అయిననూ బ్రాహ్మణులు అందరూ అగ్నిహోత్రం కలిగినవారు కారు.దేశ కాల పరిస్థితులను బట్టి నేడు చాలా కొద్ది మంది బ్రాహ్మణులు మాత్రం వేద విద్య నేర్చుకోవడం, సన్యాసము వంటివి నిరాడంబరంగా దేశంలో బ్రాహ్మణ విధులు నిర్వర్తించుతున్నారు. ఇప్పటి సామజిక పరిస్థితిని బట్టి ఎవ్వరిని తప్పు పట్టకూడదు. "సమాజంలో ఉన్నంతంగా బ్రతకాలి " అని ప్రతి బ్రాహ్మణుడు అనుకొంటాడు.
పురాతన భారత సామాజిక నిర్మాణం పతనం కారణంగా, వివిధ వృత్తులు, ఉద్యోగాలకు (బ్రిటిష్ వారి ద్వారా తేబడినవి) బ్రాహ్మణులు అవకాశములు వెతుక్కున్నారు. వారి బోధన, జ్ఞానమునకు గుర్తింపుగా ఉపకారవేతనాలు, బహుమతుల ద్వారా వారికి మద్దతు లభించింది. అప్పటి నుండి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు బ్రాహ్మణుల వలసలు బయలుదేరినవి.
సర్వే జనాః సుఖినో భవంతు
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి