8, డిసెంబర్ 2024, ఆదివారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము*


*219 వ రోజు*

చెట్టు ఒకటే ఉంటే దానిని ఏనుగులు, గుఱ్ఱాలు తొక్కివేస్తాయి. గాలి కూల్చేస్తుంది గుంపుగా ఉన్న చెట్లను ఎవరూ ఏమీ చేయలేరు. అన్నదమ్ములు కలిసి ఉంటే వారిని ఎవరూ కన్నెత్తి చూడలేరు. వేరుగా ఉంటే శత్రువుకు లోకువైపోతారు. కాబట్టి కౌరవులు, పాండవులు ఒకరికొకరు అండగా ఉంటే శత్రువుకు జయించరానివారు అవుతారు. పాండు పుత్రులను పిలిచి వారికి హితం కలిగించి నీ పుత్రులను బ్రతికించుకో. ఇచ్చకాలు మాట్లాడేవారు ప్రతిచోటా ఉంటారు. అప్రియమైనా హితం పలికేవారు వేరుగా ఉంటారు. జూదం ఆడిన నాడే నేను వద్దని చెప్పాను. రోగం వచ్చినవాడికి పథ్యం సహించనట్టుగానే నా మాటలు నీవు విన లేదు. కాకుల వంటి నీ కుమారులను నమ్మి నెమళ్ళ వంటి పాండవులను వదులుకుని ఇప్పుడు తల్లడిల్లి పోతున్నావు.పిల్లులను ఆదరించి సింహాలను చేరదీసినట్టు దుర్యోధనాదులకోసం పాండవులను వదిలేసావు. కులం నిలుపుకోవడానికి ఒక్కడినయినా వదులుకోవాలని పెద్దలంటారు. అవినీతిపరుడై, మంచి మాటలు చెప్తే వినని దుర్యోధనుడిని వదులుకుంటే వచ్చే నష్టం ఏమిటి. సహాయం సంపదను బట్టి, సంపద సహాయాన్ని బట్టి ఉంటాయి. ఇలా ఒకదానితో ఒకటి కూడి ఉంటే గాని సిద్ధించవు. కాబట్టి నీ సంపద పాండవులకు, వారి సహాయం నీకు ప్రీతి కలిగిస్తుంది. పరస్పరం కలిసి ఉండడం మేలు. కురువంశోద్ధారకులైన భీష్ముడు,ధర్మరాజు,మంచి పరాక్రమవంతులైన అర్జునుడు, కర్ణుడు , భీముడు, దుర్యోధనుడు, శస్త్ర అస్త్ర విద్యలలో నిపుణులైన అభిమన్యుడు, లక్ష్మణ కుమారుడు, ద్రోణుడు, ద్రుపదుడు వంటి ఆత్మీయులు వారి బంధువులు అంతా చేరి నిన్ను సేవిస్తుంటే నీ వైభవం ఎలా ఉంటుందో ఆలోచించు. " అన్నాడు. పాండవులు ఇప్పుడు పగ విషయం మరిచిపోయినా కొన్నాళ్ళకయినా ఇబ్బందులు పడి చెడుతుందే కాని దుర్యోధనుడితో రాజ్యం పాలించబడదు. అని చెప్పాడు విదురుడు. ధృతరాష్ట్రుడు " విదురా! నీవు చెప్పిన మాటలు రాజనీతి సమ్మతములే . అయినా నా కొడుకును వదలలేను. కనుక ధర్మం జయిస్తుంది అని చూస్తూ ఉంటాను " అన్నాడు. అప్పుడు విదురుడు " రాజా! దాయాదులు గుణం లేనివాళ్ళయినా విడిచిపెట్టకూడదు అంటారు. సకల గుణసంపద కలిగినవారై, నీ అనుగ్రహం కోరే పాండవులను నీవు వదిలి పెట్టవచ్చా. నేను నీ మేలుకోరేవాడిని. పాండవులు బ్రతకడానికి చిన్న పల్లెలు అయినా కొన్నిటిని కేటాయించి, దుర్యోధనుడిని ఒప్పించి సంధి చేస్తే మంచిది. యుద్ధం నివారించడానికి కొడుకులను వదల మన్నాను కాని సంధి చేసుకుంటే అందరికీ క్షేమమే కదా!

ఎన్ని భోగాలు అనుభవించినా మహారాజులకైనా చావు తప్పదు. కాబట్టి చెవికి చేదుగా ఉన్నా  

ఈ విషయాన్ని అర్థం చేసుకున్నావంటే నీకు ఇహ పరాల్లో కీర్తి సంపదలు కలుగుతాయి. ధర్మరాజును వదిలిపెట్టకు. మనసు గట్టిచేసుకొని నీ కొడుకులకు, మంత్రులకు సంధి చేసుకోమని చెప్పు." అన్నాడు. ధృతరాష్ట్రుడు " విదురా! నీ మాటలు నా మనసును తేటపరిచాయి. ఆలోచిస్తే ఇదే తగిన పని అనిపిస్తోంది. అలాగే చేస్తాను " అన్నాడు. విదురుడు " ఆ మాట మీద ఉండు. ఇంతకాలానికి నీకు చేయదగినదానిపై మనసు స్థిరపడింది. దుర్యోధనుని చూసి మనసు మార్చుకోకుండా, అతను మొగ్గినవైపు నీవు మొగ్గకుండా ధర్మరాజుతో సంధి చేసుకో. మా వంటి వారికి ఆనందం కలుగుతుంది " అని చెప్పి తన మందిరానికి వెళ్ళాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: