🙏వేదాంత వ్యాసం🙏
"బ్రహ్మ సత్యం జగన్మిథ్యా,
జీవో బ్రహ్మైవ న పరాః"
బ్రహ్మ అంటే అంతిమ వాస్తవికత, సర్వోన్నత దేవుడు
పురాణాలలో బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ. ఆయనే సృష్టికర్త. మరి ప్రకృతిని కూడా బ్రహ్మ అంటారు. వేదాన్ని, యజ్ఞాన్ని బ్రహ్మ అంటారు. ప్రణవాన్ని బ్రహ్మము అంటారు. ఇవికాక ఉపాధులే లేని నిరాకార పరమాత్మను కూడా బ్రహ్మము అంటారు.
అన్నింటికన్నా పూర్వమైనది, మొదటగా ఉన్నది, రెండు కానిది, ఏకైకమైనది అయిన బ్రహ్మం తన ఏకైక తత్త్వం అనేకం కావాలని సంకల్పించింది. అదే రకరకాల వస్తువులుగా చిత్ర విచిత్ర సమ్మేళనాలతో రూపుదాల్చింది. ద్రవపదార్థాలు, ఘనపదార్థాలు, వాయుపదార్థాలు ఇలా ఎన్నో రకాలుగా మార్పులు చెంది, చిన్నచిన్న రూపాలతో ఈ సృష్టి ఆకారాన్ని పొందింది. జీవరాశులు ఉత్పన్నం అయినాయి. ఆదిలో ఉన్న ఒక్కదానిలో నుంచే ఈ అన్నీ ఉద్భవించాయన్నమాట
వ్యష్టిపరంగా చైతన్యాన్ని ఆత్మ అంటే, సమిష్టిపరంగా అదే చైతన్యాన్ని బ్రహ్మము అంటారు. రెండూ ఒకటే. మరి రెండు పేర్లు ఎందుకు అంటే? కారణం వాటి స్థానం. వ్యష్టి స్థాయిలో ఆత్మ, సమిష్టి స్థాయిలో బ్రహ్మము (ఈ సమిష్టి చైతన్యాన్నే పరమాత్మ అని కూడా అంటారు). వాటి అర్ధాలు కూడా ఇంచుమించు ఒకటే. ఆత్మ అంటే ఆప్నోతి సర్వం ఇతి ఆత్మ - సర్వాత్మకమైన ఎల్లలు లేని వస్తువు. బ్రహ్మము అంటే అనంతం - బృహ్ నుంచి వచ్చింది. బృహ్ అంటే పెద్దది. పూర్తిగా పెద్దది.
“బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి”-బ్రహ్మమును ఎవరు అనుభవించాడో వాడే బ్రహ్మము అవుతాడు. పరబ్రహ్మమును అనుభవించిన కారణం చేత ఆయనే పరబ్రహ్మము. అందుకే “గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః! గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః!!”-గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనబడే మూడు రూపములు పొందినటువంటి వాడై ఉంటాడు. అటువంటి గురువు జ్ఞానమును పొందినప్పటికీ, సమున్నతమైన స్థాయిలో నిలబడినప్పటికీ సామాన్యమైన లోకులు శాస్త్రాన్ని ఎలా ఆచరిస్తారో అలా ఆయన కూడా ఆచరించాలని నియమం లేదు. ఆయన అలా ఆచరించలేదు కాబట్టి ఆయన స్థాయి తక్కువైంది అని చెప్పడం సాధ్యంకాదు. భగవాన్ రమణులు మహా పురుషులు. వారు బ్రహ్మముయొక్క స్థాయిని చేరిపోయినవారు. అంతటి అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉండేవారు. శరీరాన్ని చూపించి ఎప్పుడూ ఇది అని వేలు చూపించి తను సాక్షిగా ఉండేవారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి, గురుస్వరూపుడైన రమణమహర్షి సంధ్యావందనం చేయాలనీ, యజ్ఞోపవీతం వేసుకోవాలనీ, గోచీపోసి పంచె కట్టుకోవాలనీ, వేదం ఎలా చెప్పిందో అలా ఆయన ప్రవర్తించాలనీ, అలా ఆయన ప్రవర్తించకపోతే దోషం వస్తుందనీ, చెప్పడం సాధ్యం కాదు.అది అగ్నిహోత్రం వంటిది. ఆస్థాయికి చేరినటువంటి మహాపురుషులు కర్మాచరణను శాస్త్రీయంగా చేశారా? చేయలేదా? అన్న విషయంతో సంబంధం ఉండదు. వారు ఎప్పుడూ జ్ఞానమునందు ఓలలాడుతూ ఉంటారు. జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చేయకూడదు. అజ్ఞానిని ఎప్పుడూ అనుకరించకూడదు. అనుకరణవల్ల మహాత్ముల స్థాయిని చేరలేరు. పరమభక్తితో కర్మాచరణము చేయగా చేయగా అనుగ్రహించిన భగవంతుని కారుణ్యమే ఒకనాడు జ్ఞానము కలగడానికి అవకాశం ఇస్తుంది. ఒకసారి జ్ఞానము కలిగిన తరువాత అదే మోక్షమునకు హేతువు. జ్ఞాని శరీరముతో ఉన్నప్పటికీ నేను ఆత్మ అని దానియందు రూఢియై అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తాడు శరీరాన్ని. శరీరంతో తాదాత్మ్యత పొందడు. అందుకే అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారో ఎలా వైదికమైనటువంటి ప్రవర్తనకు కట్టుబడుతున్నారో అలా కట్టుబడాలి అని భావించడం పొరపాటు. గురువుయొక్క లీల, మాట పరమశక్తివంతములు. గురువు లోకోద్ధరణకొరకే నోరువిప్పుతాడు. గురువుయొక్క సహజస్థితి మౌనం. భగవాన్ రమణులకు అందుకే మౌనయోగి అని పేరు. అలా మౌనంగా ఉండి పరబ్రహ్మముగా అనుభవములో ఎప్పుడూ రమిస్తూ ఉంటారు. అటువంటి స్థాయి పొందిన మహాపురుషులు.
"బ్రహ్మము నిరాకార చైతన్యము. ఆకారము లేకపోవడంతో దానికి భౌతిక, రసాయనిక లక్షణాలు కూడా వుండవు. అది నిర్గుణం, ఎలాంటి గుణాలు వుండవు. కాలానికి, ప్రదేశానికి అతీతమైనది కాబట్టి దానికి మార్పు లేదు. ఒక ప్రదేశానికి అంకితమవలేదు కాబట్టి ఈ చైతన్యం నిర్వికల్పం. దానికి విభజన లేదు."
అద్వైతానికి ఆధారముగా శంకరాది వ్యాఖ్యాతలు చెప్పారు.
"బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ న పరాః" కు
ఇది ప్రమాణం.
సహజంగా ద్వైతులు ఇంకొక విధముగా వ్యాఖ్యానించారు.
ఇది భగవంతుని వాక్కు. ప్రమాణంగా తీసుకోవలసినది. కనుపించే ప్రపంచం, చూస్తున్న మనం అసత్యంగానూ, కనుపించని ఆత్మ సత్యంగానూ అర్థమవడానికి మనస్సు, బుద్ధి లగ్నం కావాలి.
ఆమాటకు వస్తే చెప్పిన కృష్ణుడూ లేడు, విన్న అర్జునుడూ లేడు, చెప్పబడిన గీతా, దాని అర్థము శాశ్వతమా? అని వితండవాదం చేయవచ్చు. కాని సమాధానం మన వాదములోనే ఉన్నది. అందుకే 5000 సంవత్సరాల తరువాత మనము ఇంకా గీత చెప్పుకుంటున్నాము.
.
ఇది లౌకిక శాస్త్రాలలోనూ నిజమే. న్యూటన్, ఐన్స్టీన్ లేరు. వారి భౌతిక శాస్త్రాలు నేటికీ ఉపయోగంలో ఉన్నాయి
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి
.
ఓఅర్జునా! ఈ సర్వము (ఈప్రపంచమంతయు) ఏ పరమాత్మచేత వ్యాపింపబడిఉన్నదో, అది నాశరహితమని ఎరుంగుము. అవ్యయమగు అట్టి ఆత్మకు ఎవరూను వినాశము కలిగింపలేరు.
ఈ సృష్టికి (ప్రపంచమంతకు) ఆధారభూతమైన వస్తువు ఒకటి ఉన్నది. అది మనకు కనబడటములేదు. అందుకే భగవంతుడు మనకు చెబుతున్నాడు. దానినే పరమాత్మ వస్తువు అని మనం అన్నాము.
వైజ్ఞానికులు దానినే గురుత్వాకర్షణ క్షేత్రము అనవచ్చును
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి