పరిమిత జ్ఞానం
ఈ భూమి మీద వున్న ప్రతి జీవికి కొంత జ్ఞానం కలిగి ఉండ్తుంది . కానీ సాధారణంగా మనం ఏమి అనుకుంటామంటే కేవలం మనుస్యులకు మాత్రమే జ్ఞానం ఉంటుంది ఇతర జీవులకు జ్ఞానం ఉండదు అని అనుకుంటాం. కానీ అది యదార్ధం కాదు ప్రతి జీవికి కూడా కొంత జ్ఞానం ఉంటుంది కానీ అది బుద్ది జీవిగా చెప్పే మనుషులకన్నా తక్కువగా ఉంటుంది. మనందరమూ చూస్తూ ఉంటాము ప్రతి పక్షి కూడా గ్రుడ్లు పెట్టె వయస్సు వస్తే తప్పకుండ గుళ్ళు పెట్టుకుంటాయి. విశేషము ఏమిటంటే ఒక జాతి కి చెందిన పక్షి గుళ్ళు అన్ని ఒకే రకంగా ఉంటాయి. మరి ఆ పక్షులకు ఆ రకంగా గుళ్లను నిర్మించే తెలివి తేటలు ఎక్కడివి అంటే మనం చెప్పలేము. అంతే కాకుండా చీమలు, చెదలు, పాములు కూడా పుట్టలు పెట్టటం మనం చూస్తాము. మీకు తెలుసా ఒక్కొక్క రకపు పాము ఒక్కో రకపు పుట్ట నిర్మిస్తుంది. జంతువులు వాటి వాటి సంతానాన్ని గుర్తించటం మాత్రమే కాకుండా వాటిని ప్రేమతో లాలించటం కూడా మనం చూస్తాము. ఒక ఆవుకు దూడ పుడితే తాను ఆ దూడను యెంత ప్రేమగా చూసుకుంటుందో రైతులకు బాగా తెలుసు. అప్పుడే పుట్టిన మనిషి నడవలేడు కానీ ఆవు దూడ నడవటమే కాకుండా తన తల్లిని గుర్తించి పాలకోసం ఆవు పొదుగు దగ్గరకు వెళుతుంది. తనంతట తానె తల్లి పాలు త్రాగుతుంది. మరి ఈ జ్ఞానం అప్పుడే పుట్టిన దూడకు ఎవరు నేర్పారు. పిల్లలను పెంచటం వాటి ఆలనా పాలన చూడటంలో ఒక్కో జంతువూ ఒక్కో విధంగా తాన బాధ్యతను నెరవేరుస్తుంది. ఒక పిల్లి తాన పిల్లలను ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి తీసుకొని వెళ్ళటానికి తన నోటితో పట్టుకొని వెళుతుంది. కానీ కఠినమైన దాని నోటి దంతాలు (కోర పళ్ళు) తన శిశువుకు గుచ్చుకోకుండా తీసుకొని వెళ్ళటం ఏంటో విచిత్రం కదా. అదే విధంగా ఒక కోతి తన శిశువును తాను పట్టుకోదు కానీ శిశువే తన నాలుగు చేతులతో తల్లి ఉదరభాగాన్ని గట్టిగ పట్టుకొని ఉంటుంది. అది యెంత గట్టిగ తన తల్లిని పట్టుకుంటుందంటే ఆ తల్లి కోతి ఎన్నో చెట్లు, ఇళ్ళు గోడలు ఎక్కి దూకుతూ వున్నా కూడా పిల్ల కోతి తన పట్టు వదలదు. అందుకే ఆధ్యాత్మిక జగత్తులో ఈ రెండు జంతువుల పద్దతులను ఆధారంగా రెండు న్యాయాలను చెప్పారు.. అవి 1) మార్జాల కిశోర న్యాయము అంటే ఒక భక్తుడు తన పూర్తి బాధ్యతను భగవంతుని మీదనే వదిలి తనకు తాను భక్తి పారవశ్యంలో మునిగి వుండటము. పూర్తిగా భక్తిలో మునిగి తేలే భక్తుని బాగోగులు భగవంతుడే చూసుకుంటాడు దీనికి ఈ న్యాయం వర్తిస్తుంది. ఇది కేవలం పరిపూర్ణ భక్తులకు మాత్రమే వర్తిస్తుంది. 2) వానర కిశోర న్యాయము ఈ న్యాయం ప్రకారం ఒక సాధకుడు ఆత్మ జ్ఞాని అయి తన జ్ఞానంతో భగవంతుడిని ఒక వానర శిశువులాగా అంటి పెట్టుకుంటాడు. కాబట్టి సాధకుడు సదా ముక్తుడే. ప్రతి సాధకుడు భక్తి మార్గంలో కొంత దూరం పయనించి తన అంతకరణ శుద్ధి చేసుకొని తరువాత జ్ఞానిగా మారి ముక్తుడు అవాలి.
జంతువులకు ఉన్న జ్ఞానం కొంతమేరకు మాత్రమే అని మనం తెలుసుకున్నాము. వాటికి మాట్లాడే శక్తి లేదు. కానీ ఆలోచించే శక్తి, ఆహారాన్ని సంపాదించుకునే శక్తి, ఇంద్రియ సుఖాలను అనుభావించే జ్ఞానం వున్నది. ఈ విషయాలు ప్రతి మనిషికి కూడా వర్తిస్తుంది. కాకపొతే జంతువులకన్నా మానవులకు వున్న శక్తి ఆలోచనా శక్తి జంతువులకు స్వల్పంగా ఉంటే మనుషులకు ఎక్కువగా ఉంటుంది. ఇంకా మాట్లాడే శక్తి మానవులకు ఎక్కువగా వున్నది. మరి జంతువులకు మాట్లాడే శక్తి లేకపోయినా ఒక జంతువు ఇంకొక జంతువుకు సాంకేతాలను తెలుపుకొనే శక్తి తప్పకుండ ఉండి ఉంటుంది. అది లేకపోతె చీమలన్నీ ఒక వరుసలో ఎలా నడుస్తాయి. పక్షులన్నీ ఒక గుంపుగా ఎలా వెళతాయి. కుక్కలన్నీ ఒకే సారె దాడి ఎలా చేస్తాయి. ఇవన్నీ చూస్తుంటే జంతువులకు ఒక దానితో ఇంకొకటి సాంకేతాలు పంపే ప్రక్రియ ఏదో ఒకటి ఉండి ఉంటుందని తెలుస్తుంది.
జంతువులకు లేకుండా మానవులకు మాత్రమే వున్నది విచేక్షణా జ్ఞానంగా మనం అనుకోవచ్చు. మనిషికి ఉన్న ఈ శక్తి వలన తాను చుసిన రెండు విషయాలలో ఏది ఉత్తమమైనది ఏది కాదు అని తెలుసుకొని ఉత్తమమైనదానిని మాత్రమే ఎంచుకోగలడు. ఈ విచేక్షణ జ్ఞానం వృద్ధి చెందితే దానికి వివేకం అని పేరు. వివేకం అంటే ఏది శాశ్వితము, ఏది అశాశ్వితము అని తెలుసుకునే జ్ఞానం.
మనిషి తన చుట్టూ వున్నా జగత్తును నిత్యం కన్నులతో చూస్తూ వున్నది ఇతర ఇంద్రియాలతో జగత్తు ఉనికిని తెలుసుకుంటున్నారు. దృశ్యంగా కనపడుతున్నది కాబట్టి ఈ జగత్తుని దృశ్యమాన జగత్తు అని అన్నారు. నిజానికి మానవునికి ఉన్నది ఇంద్రియ జ్ఞానమే. ఇంద్రియాలకు లోపడి ఉన్నదానిని మాత్రమే తెలుసుకోగలడు. కాంతి పరిధిలో అంటే VIBGIOR అంటే సప్తవర్ణాలకు ఆధీనంలో ఉన్నదానిని మాత్రమే చూడగలడు అంటే ఆల్ట్రా వైలెట్ మరియు ఇన్ఫ్రా రెడ్ కిరణాల పరిధిని మానవుని కన్నులు గమనించలేవు. అంతే కాదు సూక్ష్మమైన బ్యాక్టీరియాలు, వైరసులను మనం కంటి తో చూడలేము. అంతదాకా ఎందుకు చీమను చూడగలము కానీ చేమ కాలిని చూడగలమా. ఇప్పుడు ప్రశ్న యేమని వస్తుందంటే కంటికి కనపడని వాటిని ఈ జగత్తులో లేవు అని అనగలమా అంటే అన లేము. శాస్త్రీయ పరికరాల ద్వారా ఈ రోజు మనం వాటి ఉనికిని తెలుసుకోగలం. అదే విధంగా సెకనుకు 20 నుండి 20,000 ప్రకంపనలు చేసే వాటి ధ్వనిని మాత్రమే మానవుని చెవులు గమనించగలవు మరి 20 కన్నా తక్కువ మరియు 20,000కన్నా ఎక్కువ ప్రకంపనల సంగతి ఏమిటి అంటే వాటి ఉనికి మానవుని చెవులకు తెలియదు. కుక్క పశువులు, పక్షులు, గబ్బిలాలు, పాములు మొదలగు జీవులకు మానవుని వినికిడి శక్తి కన్నా ఎక్కువ ఉంటుందని ఈ రోజు శాస్త్ర పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ రోజు 20,000 కన్నా ఎక్కువ ప్రకంపనాలు చేసే ఆధునిక పరికరాలను ఉపయోగించి మానవుని శరీరంలోని అవయవాలను చూడటమే కాకుండా గర్భస్థ శిశువు ఉనికి లింగాన్ని కూడా కంప్యూటర్ తెరమీద వైద్యులు తెలుసుకోగలుగుతున్నారు. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే మానవునికి వున్న జ్ఞానం పరిమితంగా ఉన్నది అనిఅర్ధమవుతుంది.
మన ధర్మంలో చతుర్వీదాలు (4+1) అష్టాదశ పురాణాలు (18) రెండు ఇతిహాసాలు , వేలకొద్ది ఉపనిషత్తులు ఉన్నాయి. పంచమ వేదంగా పేర్కొన్న ఆయుర్వేదము, ఇవికాక అనేక గీతాలు (భగవత్ గీత, వసిష్ఠ గీత, అష్టావక్ర గీత మొదలగునవి) కూడా వున్నాయి. ఇవి మన వైదికవాజ్హ్మయం అయితే ఇంకా సంస్కృత, ఆంధ్ర, హిందీ కవులు వ్రాసిన సాహిత్యం పాశ్చాచ్య దేశానినుంచి తెలియ వచ్చిన శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానం గురించి తెలుసుకుంటే ఒక మానవుడు తెలుసుకున్నది తాను తెలుసుకోవలసినదానికన్నా చాలా తక్కువ అని తేలికగా తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఒక్క విషయం రూఢీగా చెప్పవచ్చు అదేమిటంటే బౌతికంగా వున్న జ్ఞానం కూడా అపారంగా ఉన్నట్లు మనకు జ్యోతిక మవుతుంది
మనం తెలుసుకున్నది లేక తెలుసుకోదలుచుకున్నది రెండు కూడా నా కన్నా వేరుగా ఉన్నట్లు మనకు తెలుస్తున్నది. అందుకే ఈ భౌతిక జ్ఞానాన్ని లోక జ్ఞానంగా మనం అభివర్ణించవచ్చు. ఇన్ని విషయాలు తెలుసు కోవటము అవసరమా అని ఆలోచిస్తే అవసరము కాదని మనం అనుకుంటాము ఎందుకంటె మనం చేసే ఏ శాస్త్రాధ్యనం అయినాకూడా కేవలం ఉదర నిమిత్తం అంటే కేవలం అంటే కేవలము ధన సంపాదనకొరకు మాత్రమే ప్రతి మానవుడు తన తన పరిధిలో కొంత జ్ఞానాన్ని సౌపార్జించి దానితో తన భుక్తి కి ఒక మార్గము ఏర్పాటు చేసుకుంటాడు. ఒక వైద్యుడు ఒక న్యాయవాది , ఇంజనీరు ఇత్యాది వృత్తులు కేవలం ఉదర నిమిత్తమే అని మనకు తెలుసు. . ఒక వైద్యునికి న్యాయ శాస్త్రం అనవసరం అలాగే ఒక న్యాయవాదికి వైద్య శాస్త్రం అవసరం లేదు.
ఈ భూమి మీద పరిపూర్ణుడు అంటే సర్వజ్ణ్యుడు ఎవరైనా వున్నారా అంటే లేనే లేరని మనం గంటా పదంగా చెప్పవచ్చు మరి సంపూర్ణ జ్ఞానం ఎవరికి ఉండదా అంటే ఉంటుంది అని జవాబు చెప్పవచ్చు. మరి ఆ సంపూర్ణ జ్ఞాని ఎవరు తెలపగలరు అంటే ఒకటి చెప్పవచ్చు ఆజ్ఞాని మనిషి మాత్రం కాదు మరైతే ఎవరు అంటే ఆయనే భగవంతుడు. కేవలం భగవంతుడే మాత్రమే ఈ జగత్తు గురించి సంపూర్ణ జ్ఞాని ఎందుకంటె ఆయనే సృష్టి, స్థితి మరియు లయకారుడు. అందుకే భగవంతుని బ్రహ్మగా మన ఉపనిషత్తులు పేర్కొన్నాయి.
ప్రతి మానవుడు తనకు అరుదుగా లభించిన అపూర్వ అవకాశంగా ఈ మానవ జన్మను తలంచి దీనిని సార్ధకత చేసుకోవటానికి బ్రహ్మజ్ఞానాభిలాషి అయి సాధన చేయాలి అప్పుడే తనకు తానుగా తన్ను తానుగా యెఱింగి స్వయంగా బ్రహ్మగా మారతాడు "బ్రహ్మవిత్ బ్రహ్మయేవ భవత్"
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
ఇట్లు
మీ
చేరువేల భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి