*రామాలాలి మేఘశ్యామా లాలి...*
శ్రీమహావిష్ణువు దుష్టశిక్షణకు శిష్ట రక్షణకు ఎన్నో అవతారాలు ఎత్తాడు. వాటిలో మాతృగర్భం నుంచి మానవాకారుడై జన్మించిన అవతారాలు రెండే రెండు. అవి రామావతారం. కృష్ణావతారం. ఒకరు మాయామానుష విగ్రహుడు, రెండవ వారు లీలామానుష విగ్రహుడు. ఒకరు తనని తాను జీవితాంతమూ మానవమాత్రునిగా, దశరథ నందనునిగా చెప్పుకున్నారు. రెండవ వారు మానవునిగా జన్మించినా తన లీలలతో భగవంతునిగానే పరిగణింప బడ్డాడు. విశేషమేమంటే వాల్మీకి రామాయణంలో శ్రీరాముని బాల్య చేష్టల గురించి విస్తారంగా వర్ణన లేదు. తెలుగు భాగవతంలోని దశమ స్కంధంలో శ్రీకృష్ణుని బాల్య క్రీడలను విస్తారంగా పోతనామాత్యులు వర్ణించారు. అయితే బాల రాముని చిలిపి చేష్టలను వేరే కవులు తమ తమ గ్రంథాలలో అద్భుతంగా పేర్కొన్నారు. ఆయా గ్రంథాలలో శ్రీకృష్ణజననం మాదిరి రామ జననం కూడా అంతే ప్రాచుర్యాన్ని పొందింది. శ్రీరామ జననం గురించి ఎవరు, ఎన్నిసార్లు చెప్పినా, వినినా తనివి తీరదు. దీనిపై చలన చిత్రాలు వచ్చాయి, నాటకాలు వచ్చాయి. హరికథల్లో లెక్కకు మిక్కిలిగా వర్ణనలు వస్తూనే ఉన్నాయి. అయితే దీనిలో చెప్పేవారి ప్రతిభ కూడా ఉంటుంది. 'కవి ప్రతిభలోన నుండును, కావ్యగత శతాంశముల యందు తొంబదియైన పాళ్ళు అన్నది నిజము' అంటారు కవి సామ్రాట్టు శ్రీ విశ్వనాథ. శ్రీరామ జననంలోని విశేషాంశాలను కవి సామ్రాట్టు తమ రామాయణ కల్ప వృక్షంలో అత్యద్భుతంగా వర్ణించారు.
పుత్ర కామేష్టి జరిగింది. యజ్ఞపరుషుడు దశరథునకు పాయసపాత్ర అందించాడు. దశరథుడు తన భార్యలు ముర్వురికి పాయసం పంచి ఇచ్చాడు. ముగ్గురు సతులు కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భవతులయ్యారు. నెలలు నిండేయి. ప్రభవ నామ సంవత్సరం నుండి పదహారు సంవత్సరాలు గడిచేయి. స్వభాను సంవత్సరం ప్రవేశిం చింది. కౌసల్యను చూడడానికి శుక్ల పక్ష సప్తమినాడు రాముని అక్క శాంతాదేవి వచ్చింది. 'అమ్మా! ఎల్లుండి నవమినాడు షోడశ కళాపూర్ణుడై శ్రీహరి నీ కడుపున పుడతాడట. వారిని దర్శించడానికి నా భర్త (ఋష్యశృంగుడు) శిష్య సమేతంగా వచ్చి విడిదిలో ఉన్నాడు. నిన్ను చూడడానికి వచ్చాను' అంది శాంత. ఈ సందర్భంలో విశ్వనాథవారు 'పూర్వ మెన్నియుష కాలములను నేవి/నవమియే పుణ్యకాలమో/తవిలి ఈ స్వ/భాను వేనోము నోచెనో ? శుక్ల పక్షంబులెంతటి శోభగలదో' అని అద్భుతంగా రాశారు.
చైత్ర శుద్ధ నవమి వచ్చింది. కౌసల్యకు నొప్పులు వచ్చి అధికమయ్యాయి. మధ్యాహ్న మార్తాండుడు ఆ శుభసమయం కోసం ఆతృతగా చూస్తూ కదలకుండా ఉన్నాడు. శ్రీహరి మానవ రూపంలో అవతరించనున్నందున ఆకాశం నుంచి పూల జల్లుల మాదిరి చిరు జల్లులు కురిసేయి. ప్రసవానికి కావలసిన ఏర్పాట్లన్నీ పరిచారికలు చేసారు. శ్రీహరిని మానవావతార రూపంలో దర్శించే అదృష్టం భానుడికి కలగినందుకు చంద్రుడు కినుక వహించాడు. కాసింత అసూయ కూడా కలిగింది. గ్రహ మండలమంతా ఉత్సుకతతో ఎదరుచూస్తున్నది. ఈ సందర్భాన్ని కల్ప వృక్షంలో ఈ విధంగా వర్ణించారు. *శ్రీమన్మాలాభారతి/గా మొదలగు యోగ శతముగా గ్రహ రాజుల్/ స్వామి జననంబు వేళకు /సోమించిరి దితిజహరణ సూచకములుల గాన్'.*
అయోధ్యా నగరంలో మధ్యాహ్న సమయాన్ని సూచిస్తూ కోటలో ఘంటారావం వినిపించింది. అదే సమయంలో శీరోదయం జరిగింది. కర్కాటక లగ్నం, పునర్వసు నక్షత్రం, నవమి తిథి, కౌసల్య గర్భాన పురుషోత్తముడు జన్మించాడు. అంతవరకూ పురిటినొప్పులు భరించిన కౌసల్య తేలికపడి ఆనందంతో ఆ శిశువును అందుకోబోయింది. మంత్రసాని ఆమెను వారించింది. చేతిలోని శిశువును తట్టి గిచ్చింది. 'కెవ్వున స్నిగ్ధమంధరము కేక వినంబడె మంత్ర సానియున్ /బువ్వును బోలెజే శిశువు బూనెను, బట్టపురానియున్ గనుల్ /నొవ్వగు మూత విచ్చుచుగనుంగన్భాగ్యము నామె కన్నులన్/నవ్వెనోజాలి పొందెనోసనాతనమే మధుకాంతి జిమ్మెనో'. అప్పటివరకూ ఉత్కంఠతో నున్న మంత్రసాని, పరిచారికలు ఆ కెవ్వు కేక విని పులకించి ఆనందతన్ముయులయ్యారని విశ్వనాథవారి ఊహా పథంలో రామ జననం ఇలా కవితా ధారగా ప్రవహించింది.
ప్రాణసఖియైన కౌసల్య పుత్రునికి జన్మనిచ్చిందన్న వార్త దశరథునికి తెలిసింది. తన వంశాంకురాన్ని చూడాలన్న తహ తహ ఉరకలెత్తించింది. ఈ సందర్భాన్ని వర్ణిస్తూ కవి సామ్రాట్ కలం ఈ విధంగా స్పందించింది. కొంచెములో కొంచెమునకున్ చనుదెంచెను అంటూ మహారాజు పురిటి దగిలోకి వచ్చాడు. మంత్ర సాని పసికందును చూపించింది. దశరథుడు పసిబిడ్డను చూసి మురిసిపోయేడు.
కొన్రని ఘడియలలో అదే లగ్నంలో అశ్లేష నక్షత్రంలో సుమిత్ర కవలలను కన్నది. మీన లగ్నం, పుష్యమీ నక్షత్రంలో కైకేయి మగబిడ్డకు జన్మనిచ్చింది.
కౌసల్యా సుతునికి బొడ్డు కొయ్యడానికి మంత్రసాని తోరము కట్టిన కత్తిని చేతపట్టుకుంది. కార్యక్రమానికుపక్రమించింది.
కోసిన బొడ్డు పైసదిమి గోర విభూతిని బోరుకొడగం గాసరిదంబు పాదయుగు గంధిసుతాహృదయేశు స్వామి నిం జేసిరి బోరుకాడగనుజేసిరి క్షీర సముఏద్ర శాయిము క్తీశుడు ముక్తి గబ్బు విడయింపగరానినుదింపులొందగన్ తామర తూడును గోటిలో విరిచినంత నేర్పుగా మంత్రసాని బొడ్డుకోసింది. ఆయన సాక్షాత్తూ విష్ణుమూర్తి. ఆయన బొడ్డునుండే తామరలో బ్రహ్మ ఆసీనుడై ఉంటాడు. బొడ్డు కోయగానే చీమ కుట్టినట్టనిపించింది బ్రహ్మకు. విష్ణువు భూలోకంలో అవతరించినట్టు తన మనోనేత్రంతో తెలుసుకున్నాడు. ఆ వెంటనే పరిచారికలు బోరువాడ అంటే స్నానం చేయించారు.
శ్రీరామ జననంతో ఆకాశం నుంచి పూలవాన కురిసింది. ఇక్ష్వాకు కులతిలకుని జనన వార్త విన్న ఆయోధ్య పురవాసులే కాకుండా కోసల రాజ్యమంతా ఆఘమేఘాల మీద ఈ విషయం చేరిపోయింది. వార్త విన్న వారంతా ఉప్పొంగిపోయేరు.
ఆ నాటి నుంచి దశరథుని చూపు ఆకాశం వైపే. షోడష కళాపూర్ణుడైన చంద్రుణ్ణి తన బిడ్డలో చూసుకుంటూ ఉబ్బితబ్బిబ్బయ్యేవాడు. ఆకాశంలో చంద్రబింబం, ఒడిలో పాపడు. వీరిరువురిలో అందగాడెవరు? పురుషోత్తముని కంటె జగత్తులో అందగాడెవరుంటారు? అని తనకు తానే సమాధానం చెప్పుకుని పరవశించేవాడు.
దశరథ నందనునికి నామకరణం చేయడానికి కుల గురువు వశిష్ఠునితో పాటు ఋష్యశృంగాది మునులు కూడా విచ్చేశారు. సూర్యకాంతిలో మరుగును పడిన చంద్రుడు అంతరంగంలో మధనపడుతున్నాడు.
వశిష్ఠుడు పళ్ళెం నిండా బియ్యంపోసి దశరథుని ఒడిలో పెట్టి రత్న అంగుళీయకాన్ని ఇచ్చేడు. తన తపశక్తితో దశరథుని అంతరంగాన్ని తెలుసుకున్న కులగురువు దశరథుని చేత 'శ్రీరామచంద్రుడు' అన్న నామాన్ని రాయించేడు. దశరథుని కంటె ముందుగానే ఆ పేరును ప్రకటించాడు. దశరథుని ఆనందానికి అవధుల్లేవు. సూర్య కాంతి మరుగును ఉన్న చంద్రుని అంతరంగ ఆనందం హద్దులు దాటిపోయింది. పురుషోత్తముడైన శ్రీరామునితో కలిసి శ్రీరామచంద్రునిగా అవనిలో పూజింపబడనుండడమే అందుకు కారణం. ఆలస్యంగా నామకరణోత్సవానికి వచ్చిన మంత్రి సుమంతుడు మహారాజు రాసిన అక్షరాలను 'శ్రీరామ భద్రుడు'గా చదివాడు. అది కూడా సార్థక నామధేయమే అయింది. తల్లిదండ్రులకు రామచంద్రుడు, తతిమ్మా వారికి రామభద్రుడుగా ఇతిహాసంలో నిలిచిపోయేడు.
నామకరణోత్సవంలో సుమిత్రానందనులకు లక్ష్మణ శత్రుఘ్నులనీ, కైకేయి సుతునికి భరతుడని కులగురువు నామకరణం చేశాడు. అనంతరం శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులకు మంగళహారుతిలిచ్చి ఊయలలో పరుండబెట్టారు. పెద్ద ముతైదువులు అందరూ కలసి శ్రీరామా లాలీ...మేఘశ్యామా లాలీ అంటూ లాలిపాటలు ముక్తకంఠంతో పాడారు.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం
*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
_ఆధ్యాత్మికం ఆనందం_
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి