🌹🌷🪷🪔🛕🪔🌷🪷🌹
*🍁దయచేసి అందరూ*
*పూర్తిగా, చివరి వరకు*
*చదువ గలరు🙏*
*🚩IIజై పవన పుత్ర హనుమాన్II🚩*
*🍁హనుమంతుడు🍁*
*వ్యక్తిత్వ వికాస పాఠాలు!*
రచన: *రాయపెద్ది అప్పాశేషశాస్త్రి*
రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఆదోని ఆర్ట్స్ కాలేజి, ఆదోని.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
సమున్నతమైన ఆలోచనా విధానం, అసాధ్యాన్ని సుసాధ్యంచేసే తెగువ, అసాధారణ కార్యకుశలత, భయాన్నీ, నిరాశనూ, నిస్పృహనూ దరిచేరనివ్వని ధీశక్తి వీటన్నిటి కలపోత ఉత్తమవ్యక్తిత్వం అవుతుంది. ఈ లక్షణాలకు తోడు ఎదుటివారిని ప్రభావితంచేయకలిగే వాక్పటుత్వం జతగాచేరితే ఆవ్యక్తి సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. బుద్ధిబలం, కీర్తిని సాధించాలన్న తపన, ధైర్యం, భయరాహిత్యం, వాక్చాతుర్యం, ఆరోగ్యంతో కూడిన బలిష్టమైన శరీరం వంటివి మనం కోరదగిన వ్యక్తిత్వంలోని అంశాలు. మన పురాణసాహిత్యాన్ని పరిశీలించి చూసినపుడు ఈగుణాలలో కొన్ని కొన్ని కొంతమందిలో కనపడవచ్చు. కానీ ఈ లక్షణాలన్నీ ఒక్కరిలోనే సందర్శించగలమా అని ఆలోచిస్తే *హనుమంతుడొక్కడే అట్టివ్యక్తి కానవస్తాడు*.
జీవితంలో మనకు ప్రధానమైన శత్రువు భయం. *మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఋష్యమూక పర్వతము మీదకు రాలేడని సుగ్రీవునికి తెలుసు. ఐనా ధనుర్బాణాలు, కత్తులు ధరించి, ఋషి వేషంలో ఉన్న బలిష్టులైన రామలక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరముల మీద నుండి సుగ్రీవుడు చూసి భయంతో గడ్డ కట్టుకుపోయాడు.* అప్పుడే తొలిసారి మనకు *హనుమ రామాయణంలో దర్శనమిస్తాడు.* సుగ్రీవునికి ధైర్యం చెప్పేప్రయత్నం చేస్తాడు. ఈ రకంగా చూస్తే హనుమ తొలి దర్శనంలోనే సుగ్రీవునికే కాదు మనకు కూడా నిర్భయత్వాన్ని అలవరచుకొమ్మన్న పాఠం చెప్పే గురువు. హనుమ సుగ్రీవునితో చెప్పే మాటలు గమనించండి. “సుగ్రీవా! ఎందుకయ్యా ఇలా శిఖరముల మీద ఎగురుతున్నావు, ఇక్కడికి వాలి రాడు కదా. వాలికి ఉన్న శాపం వలన ఈ పర్వతం మీదకి వస్తే మరణిస్తాడు. నీకు కనపడినవాడు వాలి కాదు, మరి ఎందుకీ గెంతులు. నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికే వచ్చారని అనుకొని గెంతులు వేశావు. ఏమిటయ్యా ఈ చపలత్వం. నడక చేత,అవయవముల కదలిక చేత, మాట చేత, అవతలివారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనస్సులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి, దానికి అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగల సమర్ధత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే, నువ్వు రేపు రాచపదవి ఎలా నిర్వహిస్తావు?” ఈ విధంగా హనుమ తొలి సారిగా కనిపించగానే నిర్భీకతను బోధించే గురువుగా దర్శనమిస్తాడు.
ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు, ఉద్యోగజీవితంలో, వ్యక్తిగత జీవితాలలో సందర్భోచిత వేష ధారణ అవసరమని చెపుతూ ఉంటాం. సందర్భోచిత వేషధారణ హనుమను చూసే నేర్చుకోవాలి. సుగ్రీవుని కోరిక మేరకు రామలక్ష్మణులతో మాట్లాడ్డానికి వెళ్ళేముందు కపివేషంలో కాక భిక్షువు వేషంలో వెళతాడు. వచ్చినవారు ఎవరు, ఎలాంటి వారు అన్న విషయం తెలిసిన తర్వాతనే నిజరూపం ధరిస్తాడు. మనం రూపాలు మార్చలేకపోయినా వస్త్రధారణనైనా సందర్భోచితంగా మార్చుకోగలం గదా!
తాను స్వతహాగా అత్యంత శక్తివంతుడైనా వ్యక్తి గొప్పతనంకంటే ధర్మం గొప్పది అని నమ్మిన వాడు గనకనే *అధర్మపరుడైన వాలితో కాక సుగ్రీవుని తోనే వుంటాడు ఆంజనేయుడు.*
లాయల్టీ అని మనమీనాడు పదే పదే చెపుతూ ఉంటామో ఆ ధర్మాన్ని హనుమంతుడిదగ్గర నేర్చుకోవాలి. అలాగే రాముని సేవకు అంకితమైన తర్వాత రామునికి అత్యంత సమర్థుడైన అనుచరుడుగా, రామదూతగా వాసికెక్కుతాడు.
సమయోచిత వేషధారణ మాత్రమే కాదు సమయోచితంగా సంభాషించగలిగే సామర్థ్యాన్ని గురించి కూడా వ్యక్తిత్వ వికాస తరగతుల్లో బోధిస్తూ ఉంటాము.
సమయోచిత సంభాషణా చాతుర్యం హనుమకు వెన్నతో పెట్టినవిద్య. అతను మాట్లడిన నాలుగు మాటలకే మురిసి పోతాడు తానే పెద్ద వాగ్విశారదుడైన శ్రీరామచంద్రుడు.
హనుమంతుని సంభాషణా చాతుర్యాన్ని గురించి రాముడేమంటున్నాడో చూడండి. *“చూశావా లక్ష్మణా, హనుమ ఎలా మాట్లాడాడో. ఆయన మాటలు విన్నావా. ఇలాగ మాట్లాడేవాడు మంత్రిగా దొరికితే కార్యాలు ఎందుకు నెరవేరవు! ఇలా మాట్లాడేవాడు ఎదురుగా వచ్చి నిలబడితే, కత్తి పట్టి ప్రాణం తీసేద్దాము అనుకున్న వ్యక్తి కూడా కత్తిని ఒరలో పెట్టేస్తాడు. ఇటువంటి వ్యక్తి మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంత అదృష్టవంతుడు.*
*ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనికి ఉపనిషత్తుల అర్ధం పూర్తిగా తెలుసు. అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమలు నిష్కారణంగా కదలడంలేదు, లలాటము కదలడం లేదు. వాక్యము లోపలినుంచి పైకి వచ్చేటప్పుడు గొణుగుతున్నట్టు లేదు, గట్టిగా లేదు. ఈయన మాటలు ప్రారంభించిన దెగ్గరి నుంచి చివరి వరకూ ఒకే స్వరంతో పూర్తి చేస్తున్నారు. కాళ్ళు, చేతులు, శరీరాన్ని కదపడం లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలా పలుకుతున్నారు*. ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడిగా దొరికి, మన దగ్గరికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు". సంభాషణా చాతుర్యం అంటే ఊరకే మాట్లాడుతూ వెళ్ళడం కాదు. అవసరమైనపుడు అతి స్వల్పంగా, ముక్కుకుసూటిగా, క్లుప్తంగా, ప్రధానవిషయాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడటం కూడా రావాలి.
*లంకనుంచి తిరిగి వచ్చినతరువాత దూరంనించే "దృష్టా సీతా" అని ఒక్క మాటలో తన కార్యం విజయవంతమైనదన్న విషయాన్ని సూచించి ఆ తరువాత మిగతా విశేషాలను వివరిస్తాడు.*
అలాకాకుండా మైనాకుడూ, సరమా, సింహికా, లంఖిణీ అని నస మొదలు పెడితే వినేవాళ్ళాకు బీ.పీ. పెరిగిపోవడం ఖాయం.
*అలాగే లంకలో సీత దగ్గిర అకస్మాత్తుగా ఊడిపడి గాభరా పెట్టకుండా కొమ్మమీదకూర్చుని మొదట రామకథను వినిపించి, ఆమెను తగిన మానసిక స్థితికి తేవడంలో హనుమంతుని నేర్పు కనిపిస్తుంది. అదీ మాట తీరు అంటే. ఇదీ మనం నేర్చుకోవాలి హనుమన్న దగ్గర.*
ఎలాంటి వారికైనా సహజంగానే పరిస్థితులప్రాబల్యం వల్ల ఒక్కొక్కసారి దారుణమైన ఆవేదన, గ్లాని కలుగుతూ ఉంటాయి గానీ అలాంటి సందర్భాలలో కూడా వెంటనే తేరుకోగలిగి, నిర్వేదం నుంచి తక్షణమే బయటపడగలిగితేనే ఏదైనా సాధించగలం.
బలహీన క్షణాల్లో ఒక్కొక్క సారి ఎంత అసాధారణ ప్రజ్ఞావంతులకు కూడా ఒక్క క్షణం పాటు "ఆత్మ హత్యతో ఈ బాధకంతా భరతవాక్యం పాడదామా" అని అనిపించవచ్చు కూడా. కానీ అలాంటీ సందర్భాలలోనైనా వెంటనే తేరుకోగలగడం నిజమైన ధీశాలి లక్షణం.
ఈ గుణాలన్నీ అలవరచుకోవడానికి
*మనకు గురుస్థానంలో నిలిచే నిలువెత్తు ఉదాహరణ హనుమంతుడు.*
లంకానగరమంతావెదికి సీత జాడ కానరాక హనుమంతుడు అదేస్థితికి చేరుకొంటాడు. సీత కనపడకుండా నేను తిరిగి వెళితే రామలక్ష్మణ, భరతశతృఘ్నులు, సుగ్రీవుడు, ఇతర వానర జాతి మొత్తం అంతరించి పోయే ప్రమాదము ఉన్నది కనుక నేను అసలు వెనక్కి వెళ్ళను. సీతమ్మ జాడ దొరికేవరకు వానప్రస్థుడిలా ఉంటాను, లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను, లేదా నీటిలోకి ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను" అనుకున్నాడు.
*కాని ఆయన వెంటనే "ఛీ! మరణించడం ఏమిటి, ఆత్మహత్య మహా పాపం. జీవించి వుంటేనే సుఖాలను పొందగలం. కనుక మళ్ళీ ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను. ఎవడు శోకమునకు లొంగిపోడో, ఎవడు నిరంతరము ఉత్సాహముతొ ఉంటాడో, వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను శోకమునకు లొంగను, మళ్ళి సీతమ్మని అన్వేషిస్తాను, మళ్ళి ఈ లంకా పట్టణం అంతా వెతికేస్తాను " అని ఉత్సాహాన్ని పొంది లంకా పట్టణం అంతా వెతికే పనిలో పడతాడు*
ఇదే సామాన్యులకూ, ధీశాలికీ మధ్య గల తేడా. హనుమ తన జీవితాన్నే ఉదాహరణగ చూపి మనకు ఈ గుణాన్నే నేర్పుతున్నాడు.
నేను చేపట్టిన కార్యం అసాధ్యమేమో అని భయపడుతూ ఉండిపోతే ఏ కార్యం కూడా సాధ్యం కాదు... ఉదాహరణకు హనుమన్నకు అప్పగించిన పనినే తీసుకోండి . సీతను అతను ఇంతవరకూ చూడలేదు. ఆమె ఎలాఉంటుందో తెలియదు. ఆమెను ఎత్తికెళ్ళింది ఎవరో తెలియదు ఎక్కడ దాచి ఉంచాడో తెలియదు. ఐనా నెల రోజులలో ఆమె ఆచూకీ తెలుసుకొని వస్తానని బయలుదేరతాడు హనుమంతుడు. మిగతా మూడు దిక్కులకు వెళ్ళిన వారూ, దక్షిణానికే బయలుదేరిన మిగతా వారూ ఉన్నారు కదా మరి ఈ పనిని హనుమంతునికి అప్పగించినట్లు ఎలా అవుతుంది అన్న సందేహం వస్తుంది.
మనం గమనించవలసిన విషయం ఏమిటంటే రాముడు తన ఉంగరాన్ని ఆనవాలుగా హనుమకు ఇవ్వడాన్ని బట్టే ఈ పనిని హనుమకు అప్పగించినట్లు తెలియడం లేదూ? కనుక చాలెంజిలను స్వీకరించి సమర్థంగా ఎదుర్కొని విజయవంతంగా బయటపడటమెలాగో అన్న అంశాన్ని నేర్చుకోవడానికి హనుమన్న జీవితమే మనకు ఒక పెద్ద పాఠ్యపుస్తకం.
సముద్ర తీరానికి చేరుకొన్నప్పుడు హనుమన్న ప్రవర్తన చూచి వినయమంటే ఏమిటో, అన్నీ ఉన్నా ఒదిగి ఉండటమంటే ఏమిటో నేచుకోవాలి. సముద్రాన్ని దాటి లంకను చేరే పని నువ్వే చేయగలవని అందరూ కలిసి అడిగేటంతవరకూ తానుగా నా బలమింతటిది అనీ, ఈ పని నేను చేయగలను అనీ ఎగిసి ఎగిసి పడలేదు. *శ్రేయాంసి బహు విఘ్నాని* అని ఉత్తమ కార్యంలో అనేక విఘ్నాలు ఎదురు అవుతూనే ఉంటాయి. అవాంతరాలను ఎదుర్కొని కార్య సాధన చేయడమెలాగో, తొనకకుండా బెణకకుండా కార్యాన్ని చక్కపెట్టడమెలాగో హనుమనే మనకు చేసి చూపించాడు. మైనాకుడు అనే పర్వతం ఆదరించి ఆతిథ్యం స్వీకరించి పొమ్మని అడగటం, దాన్ని సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగటం సానుకూలగా కనిపించే విఘ్నాలను ఎలాగ ఎదుర్కోవాలో నేర్పుతాయి.
భుజబలాన్నీ, బుద్ధి బలాన్నీ ఉపయోగించి విఘ్నాలను గట్టెక్కడం ఎలాగో సింహికను జయించడంలోనూ, సరమ నోటి లోనికి ప్రవేశించి బయటకు రావడంలోనూ చూపుతాడు.
కష్టాల్లో ఉన్న వాళ్ళను ఓదార్చడంకూడా ఒక గొప్ప కళ. అశోకవనంలో సీతతో మాట్లాడుతున్నప్ప్పుడు చూడాలి హనుమ చాతుర్యం. *"అమ్మా, వానరసైన్యంలో నాకన్నా తక్కువ వాళ్ళెవరు లేరు, నాతో సమానమైనవారూ, నన్ను మించినవారూ ఎందరో ఉన్నారు. రాముడు వానరసైన్యంతో రావణుని సునాయాసంగా జయించగలడు. కనుక నీవు నిర్భయంగా ఉండమ్మా"* అన్న ఇటువంటి పలుకులు ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న వారికైనా ఎంత సాంత్వన కలిగించ గలుగుతాయో చూడండి.
హనుమను మించిన వారు ఎవరున్నారు వానరసైన్యంలో, ఐనా సమయోచితంగా మాట్లాడిన హనుమన్న మాటలు సీతకు ఎంత ఓదార్పు కలిగించి ఉంటాయో! ఇదీ మనము హనుమన్న దగ్గర నేర్చుకోవాల్సిన చాతుర్యం.
ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని హనుమయ్య దగ్గర నేర్చుకోవాలి. అంతిమవిజయానికి ఉపయోగ పడుతుందనుకొంటే, కార్యసాధనలో అవసరమైతే చొరవతీసుకొని స్వతంత్ర నిర్ణయాలను కూడా తీసుకోగలిగి ఉండాలి సమర్థుడైన కార్య సాధకుడు.
సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు, లంకా దహనం చేయమనీ, రాక్షస సంహారం చేయమనీ, రాముడు ఆయనతో చెప్పలేదు. కానీ రామదూతనైన తనే ఇంత విధ్వంసాన్ని సృష్టించగలిగితే కపిసైన్యంతో రాముడు వస్తే ఎంత రాముడి ముందు తాను నిలవగలనా అన్న అనుమానాలను రావణునిలో రేకెత్తించడం అనే ప్రయత్నం చేయడం హనుమ తీసుకొన్న స్వతంత్ర నిర్ణయం.
అక్కడికక్కడ, ఆన్ ది స్పాట్ నిర్ణయ్యాలను తీసుకోగలగాలి ఒక సమర్థుడైన కార్య సాధకుడు.
ఇలా హనుమంతుని దగ్గర మనమెన్నో వ్యక్తిత్వవికాసలక్షణాలనూ, సకారాత్మక ఆలోచనావిధానాన్నీ, మేనేజ్మెంట్ స్కిల్స్ అని చెప్పుకొనే యాజమాన్య కౌశలాన్నీ ఎంతైనా నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలి కూడా. మనకు ఆదర్శవ్యక్తిగా, రోల్ మాడెల్ గా తీసుకోదగిన వ్యక్తి హనుమ.
*భక్తి ప్రపంచం బృందంలో,* ఒక *అధ్యాపకులు* ఎంతో *భక్తి పారవశ్యంతో* వ్రాసిన పలుకులు......
*🍁నేనుగా మీకు భాగస్వామ్యం చేస్తున్నందునకు ధన్యుడను*🙏
*న్యాయపతి నరసింహారావు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి