27, జులై 2020, సోమవారం

*శ్రీమదాంధ్ర మహాభాగవతం - గజేంద్రమోక్షం*

*పోతనామాత్యుల పద్యము*

*8-87-సీస పద్యము*

కలుగఁడే నాపాలికలిమి సందేహింపఁ;
గలిమిలేములు లేకఁ గలుగువాఁడు?
నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ;
బడిన సాధుల కడ్డపడెడువాఁడు?
చూడఁడే నా పాటుఁ జూపులఁ జూడకఁ;
జూచువారలఁ గృపఁ జూచువాఁడు?
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల;
మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?

*8-87.1-తేటగీతము*

అఖిల రూపముల్ దనరూప మైనవాఁడు
ఆదిమధ్యాంతములు లేక యడరువాఁడు
భక్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?

*తాత్పర్యము*

నా విషయంలో ఆ భగవంతుడు గురించి అనుమానించాల్సిన పని లేదు. అతడు ఐశ్వర్యం పేదరికం లాంటివి చూడకుండా అందరికి అండగా ఉంటాడు. కాబట్టి నాకు అండగా ఉంటాడు. దుర్జనుల చేతిలో చిక్కుకున్న సజ్జనులకు సాయపడతాడు. అందువల్ల నాకు సాయం చేస్తాడు. బయటి చూపుల వదిలిపెట్టి తననే చూసేవారిని దయతో చూస్తాడు. కనుక నా కష్టాన్ని చూస్తాడు. దీనుల మొరలు విని తన్ను తానే మరచి పోతాడు కదా. నా మొర తప్పక వింటాడు. అన్ని రూపాలు ఆయన రూపాలే. మొదలు నడుమ తుద అన్నవి ఆయనకు లేవు. భక్తులకు దిక్కులేని వారికి ఆయనే ఆధారం. మరి అటువంటి ప్రభువు ఇంకా నా మొర వినడేం? నా బాధ చూడడేం? నన్ను దయ చూడడేం? తొందరగా రాడేం?

*8-90-శా.శార్దూల విక్రీడితము*

లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

*తాత్పర్యము*

దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా!

*8-91 కంద పద్యము*

విను దఁట జీవుల మాటలు
చను దఁట చనరానిచోట్ల శరణార్థుల కో
యను దఁట పిలిచిన సర్వముఁ
గను దఁట సందేహ మయ్యెఁ గరుణావార్ధీ!

*తాత్పర్యము*

ఓ దయాసాగరా! నీవు సర్వ ప్రాణుల పిలుపులు వింటావట. వారిపై దయ చూపడానికి పోరాని చోట్లకు ఐనా పోతావట. శరణన్న వారికి వెంటనే ఓయ్ అని అంటావుట.కాని ఇప్పుడు ఇదంతా సత్యమేనా అని అనుమానంగా ఉంది.

*ఉత్పలమాల*

ఓ! కమలాప్త! యో! వరద! యో!
.....ప్రతిపక్షవిపక్షదూర! కు
య్యో! కవియోగివంద్య!
.....సుగుణోత్తమ! యో! శరణాగతామరా 
నోకహ! యో! మునీశ్వర మనోహర!
......యో! విమలప్రభావ! రా
వే కరుణింపవే తలఁపవే 
......శరణార్థిని నన్నుగావవే.

*తాత్పర్యము*

ఓ కమలాక్షుడా! ఓ వరాలు ఇచ్చే ప్రభూ! శత్రువులపై కూడ వైరం లేనివాడా! పండితులచే నమస్కారాలు అందుకొనే వాడా! ఉత్తమ సుగుణాలు కలవాడా! శరణు కోరు వారికి కల్పవృక్షం వంటివాడా! మునీంద్రులకు ప్రియమైనవాడా! నిర్మలమైన మహిమ కల వాడా! నా మొర విను. వెంటనే రా. కనికరించు. కరుణించి శరణు వేడుతున్న నన్ను కాపాడు.

*8-93 వచనము*

అని పలికి మఱియు నరక్షిత రక్షకుండైన యీశ్వరుం డాపన్నుఁడైన నన్నుఁ గాచుఁ గాక యని నింగి నిక్కి చూచుచు నిట్టూర్పులు నిగడించుచు బయ లాలకించుచు నగ్గజేంద్రుండు మొఱచేయుచున్న సమయంబున.

*తాత్పర్యము*

ఇలా ప్రార్థించి “రక్షణ లేనివారిని రక్షించే ఆ భగవంతుడు నన్ను కాపాడుగాక!” అని గజరాజు మొరపెట్టుకొన్నాడు. ఆకాశం వైపు నిక్కి నిట్టూర్చాడు. ఆకాశానికి చెవులు అప్పజెప్పి ఆక్రోశించాడు. ఆ సమయంలో.

*8-94 ఆటవెలది*

విశ్వమయత లేమి వినియు నూరక యుండి
రంబుజాసనాదు లడ్డపడక
విశ్వమయుఁడు విభుఁడు విష్ణుండు జిష్ణుండు
భక్తియుతున కడ్డపడఁ దలంచె.

*తాత్పర్యము*

ఆ సమయంలో బ్రహ్మదేవుడు మొదలగు వారికి విశ్వమంతా నిండి ఉండే గుణం లేకపోవుటచేత గజరాజు మొర వినబడినా వారు అడ్డుపడకుండ ఊరికే ఉండిపోయారు. విశ్వమంతా వ్యాపించే వాడు, ప్రభువు, విజయశీలి ఐన విష్ణువు భక్తుడైన గజరాజును రక్షించాలని నిశ్చయించుకొన్నాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఇక్కడ భాగవత రచన చేస్తున్న పోతన గారికొక విచిత్రమైన సమస్య ఏర్పడింది. ఆయన వైకుంఠవాసియైన శ్రీమహావిష్ణువు ఉన్న వైకుంఠాన్ని వర్ణంచే పద్యం ప్రారంభించారు. 

*అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దాపల*  అంటూ మత్తేభవిక్రీడిత పద్యం వ్రాయడం ప్రారంభించారు.
అదే వైకుంఠాన్ని వర్ణించాలి . తానేమో చూడలేదు . తనకంటే ముందు ఎవరూ వర్ణించిన దాఖలాలు లేవు . ఏం చేయాలి ? భాగవత రచనను ఎలా సాగించాలి? ఈ అలోచనలతో సతమతమౌతూ , కొంత సమయం భాగవత రచనను నిలిపి వేసి , స్నానంచేయడానికా గోదావరికి బయలు దేరాడు పోతనగారు. అంతలో భక్తుడంటే భగవంతునికి అపారమైన ప్రేమ కదా! పోతన స్నానానికి బయలుదేరగానే పోతన వేషంలో  భగవంతుడు వచ్చి , గజేంద్రుడు “పాహి , పాహి ” అని ఆర్తితో పిలిచిన సమయంలో తనెక్కడున్నాడో , తానేమి చేస్తున్నాడో వర్ణించే మధురమైన పై పద్యాన్ని పూర్తిచేసి వెళ్ళిపోయాడు.

 8-95 మత్తేభ విక్రీడితము

అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై.

(ఈ పద్యం సాక్షాత్తు భగవంతునిచే పూర్తి చేయబడినది అని అంటారు)

*తాత్పర్యము*

ఆపదలలో చిక్కుకున్న వారిని కాపాడే ఆ భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ అంతఃపురంలో ఒక పక్కన ఉండే మేడకు సమీపంలో ఒక అమృత సరస్సుంది. దానికి దగ్గరలో చంద్రకాంతశిలల అరుగుమీద కలువపూల పాన్పుపై లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. అప్పుడు భయంతో స్వాధీనం తప్పిన గజేంద్రుడు కాపాడమని పెట్టే మొర విన్నాడు. గజరాజుని కాపాడడానికి వేగిరపడ్డాడు.

*8-96 మత్తేభ విక్రీడితము*

సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ" డభ్రగపతిం బన్నింపఁ" డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

*తాత్పర్యము*

గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. వాహనం ఐన గరుత్మంతుని పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడి కూడ చక్కదిద్దుకోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకొంగు కూడ వదలి పెట్టలేదు.

*8-97-వ.వచనము*

ఇట్లు భక్తజనపాలన పరాయణుండును; నిఖిల జంతు హృదయారవింద సదన సంస్థితుండును నగు నారాయణుండు కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబు లాకర్ణించి; లక్ష్మీకాంతా వినోదంబులం దగులు చాలించి; సంభ్రమించి దిశలు నిరీక్షించి; గజేంద్రరక్షాపరత్వంబు నంగీకరించి; నిజపరికరంబు మరల నవధరించి గగనంబున కుద్గమించి వేంచేయు నప్పుడు.

*తాత్పర్యము*

హరి భక్తులను ప్రోచుట యందు అనురక్తి గలవాడు. సర్వ ప్రాణుల హృదయాలనే పద్మాలలో నివసించేవాడు. ఆయన గజేంద్రుని మొరలన్నీ విన్నాడు. లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చాలించాడు. ఆత్రుత చెంది అటునిటు చూసి గజేంద్రుని కాపాడుట అనే బరువైన బాధ్యత తీసుకొని అటుపిమ్మట ఆయుధాలను అవధరించి ఆకాశమార్గాన బయలుదేరాడు. ఆ సమయంలో.

*8-98 .మత్తేభ విక్రీడితము*

తనవెంటన్ సిరి; లచ్చివెంట నవరోధవ్రాతమున్; దాని వె
న్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.

*తాత్పర్యము*

అలా విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించటం కోసం లక్ష్మీదేవి కొంగు వదలను కూడ వదలకుండా తటాలున బయలుదేరటంతో – విష్ణువు వెనుక లక్ష్మీ దేవి, ఆమె వెనకాతల అంతఃపుర స్త్రీలు, వారి వెనుక గరుడుడు, ఆయన పక్కనే విల్లూ గదా శంఖచక్రాలు నారదుడు విష్వక్సేనుడు వస్తున్నారు. వారి వెనువెంట వరసగా వైకుంఠపురంలో ఉన్న వాళ్ళందరు కూడా వస్తున్నారు.
ఇది పోతనగారు ప్రసాదించిన పరమాద్భుత పద్యాలలో ఒకటి. పండిత పామరుల నోళ్ళలో తరచుగా నానుతుండే పద్యం. నడకలో భావంలో ఉత్తమ స్థాయి అందుకున్నది. చదువుతుంటేనే వేగంగా పయనమౌతున్న విష్ణుమూర్తి వెనుక అంత వేగంగాను వెళ్తున్న లక్ష్మీదేవి సూదిమొనగా గల బాణంములుకులాగ అనుసరిస్తున్న పరివారం మనోనేత్రానికి దర్శనమిస్తుంది. *{విష్ణుమూర్తి - (అ) ఆయుధములు 1) ధనుస్సు శారఙ్గము, 2) గద కౌమోదకి 3) శంఖము పాంచజన్యము, 4) చక్రము సుదర్శనము, 5) కత్తి నందకము (ఆ) రథము శతానందము (ఇ) సేనానాయకుడు విష్వక్సేనుడు (ఈ) వాహనం గరుత్మంతుడు}

*8-99-వ.వచనము*

తదనంతరంబ, ముఖారవింద మకరందబిందు సందోహ పరిష్యందమానానం దేందిందిర యగు న య్యిందిరాదేవి గోవింద కరారవింద సమాకృష్యమాణ సంవ్యానచేలాంచల యై పోవుచు.

*తాత్పర్యము*

అప్పుడు పద్మం వంటి లక్ష్మీదేవి ముఖంలో చిందుతున్న మకరందం బిందువులు వంటి తియ్యటి చెమట బొట్లకు తుమ్మెదలు ఆనందంతో ముసిరాయి. విష్ణుమూర్తి తన పైట కొంగు పట్టుకొని లాక్కుపోతుంటే వైకుంఠుని వెన్నంటి పోతూ ఇలా అనుకుంది.

*8-100 మత్తేభ విక్రీడితము*

తన వేంచేయు పదంబుఁ బేర్కొనఁ; డనాథస్త్రీ జనాలాపముల్
వినెనో? మ్రుచ్చులు మ్రుచ్చలించిరొ ఖలుల్ వేదప్రపంచంబులన్?
దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో? భక్తులం
గని చక్రాయుధుఁ డేఁడి చూపుఁ డని ధిక్కారించిరో? దుర్జనుల్.

*తాత్పర్యము*

“ఎందుచేతనో విభుడు తాను వెళ్ళే చోటు చెప్పటం లేదు. దిక్కులేని స్త్రీల దీనాలాపాలు విన్నాడో ఏమో? దుర్మార్గులు ఐన దొంగలు ఎవరైనా వేదాలను దొంగిలించారేమో? దేవతల రాజధాని అమరావతిపై రాక్షసులు దాడి చేసారేమో? విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అంటు దుర్మార్గులు భక్తులను బెదిరిస్తున్నారో ఏమో?” అని అనేక విధాలుగా లక్ష్మి సందేహపడసాగింది.

*8-102 శార్దూల విక్రీడితము*

తాటంకాచలనంబుతో; భుజనటద్ధమ్మిల్లబంధంబుతో;
శాటీముక్త కుచంబుతో; నదృఢచంచత్కాంచితో; శీర్ణలా
లాటాలేపముతో; మనోహరకరాలగ్నోత్తరీయంబుతోఁ;
గోటీందుప్రభతో; నురోజభర సంకోచద్విలగ్నంబుతోన్.

*తాత్పర్యము*

గజేంద్రుని కాపాడాలని పరుగు పరుగున వెళ్తున్న భర్త వెంట కోటి చంద్రుల కాంతి నిండిన ముఖంతో లక్ష్మీదేవి వెళుతోంది. అప్పుడు ఆమె చెవి లోలకులు కదుల్తున్నాయి. భుజాల మీద వీడిన కొప్పుముడి చిందు లేస్తోంది. స్తనాలపై పైటకొంగు తొలగిపోయింది. ఒడ్డాణం వదులై పోయింది. నుదిటి మీద రాసుకొన్న లేపనం చెదిరిపోయింది. మోము కోటి చంద్రుల కాంతితో నిండిపోయింది. స్తనాల భారంతో నడుం చిక్కిపోయింది. ఆమె పైట కొంగు ప్రియభర్త చేతిలో చిక్కుకొనే ఉంది.

*8-103 కంద పద్యము*

అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్
వెడవెడ సిడిముడి తడఁబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.

*తాత్పర్యము*

అప్పుడు లక్ష్మీదేవి భర్తను అడుగుదా మని వేగంగా అడుగులు వేసేది. అడిగితే మారు పలుకడేమో అని అడుగుల వేగం తగ్గించేది. చీకాకుతో తొట్రుపాటుతో అడుగులు వేసేది. మళ్ళీ ఆగేది. అడుగులు కదిలించలేక తడబాటుతో నడిచేది.
కరిని కాపాడలని కంగారుగా వెళ్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొంగు వదల లేదు. దానితో భర్త వెనుకనే వెళ్తున్న లక్ష్మీదేవి –

ఈ పద్యంచూస్తున్నామా వింటున్నామా చదువుతున్నామా అనిపిస్తుంది. సందర్భానికి తగిన పలుకుల నడకలు. భావాన్ని స్ఫురింపజేసే పద ధ్వని. ఇంకా ఆపైన సందర్భశుద్ధికేమో బహు అరుదైన సర్వలఘు కంద పద్యం ప్రయోగం. ఆహా ఏమి పద్యం.

*8-104 సీస పద్యము*

నిటలాలకము లంట నివుర జుంజుమ్మని;
ముఖసరోజము నిండ ముసురుఁ దేంట్లు;
నళులఁ జోపఁగఁ జిల్క లల్ల నల్లన చేరి;
యోష్ఠబింబద్యుతు లొడియ నుఱుకు;
శుకములఁ దోలఁ జక్షుర్మీనములకు మం;
దాకినీ పాఠీనలోక మెసఁగు;
మీన పంక్తుల దాఁట మెయిదీఁగతో రాయ;
శంపాలతలు మింట సరణిఁ గట్టు;

*8-104.1 ఆటవెలది*

శంపలను జయింపఁ జక్రవాకంబులుఁ
గుచయుగంబుఁ దాఁకి క్రొవ్వుజూపు;
మెలఁత మొగిలు పిఱిఁది మెఱుఁగుఁదీవయుఁ బోలె
జలదవర్ణు వెనుకఁ జనెడునపుడు.

*తాత్పర్యము*

మేఘం వెంట మెరుపు తీగ వలె లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెంట వెళ్ళసాగింది. ఆ సమయంలో ఆమె నుదుటి మీది ముంగురులను చక్కదిద్దుకోబోతే, పద్మంలాంటి ఆమె మోము నిండా తుమ్మెదలు ముసురుకున్నాయి. వాటిని తోలుతుంటే, ఆమె పెదవులను చూసి దొండపం డనుకొని చిలుకలు వచ్చి చేరాయి. చిలకలని తోలుతుంటే, చేపల లాంటి ఆమె కన్నులను చూసి ఆకాశగంగ లోని పెనుచేపలు ఎగసి పడ్డాయి. చేపలను తప్పించుకోగానే ఆమె శరీరపు మెరుపు చూసి ఆ దేహలతని ఒరుసుకోడానికి మెరుపు తీగలు బారులు తీరాయి. మెరుపు తీగలను దాటగానే, చక్రవాకపక్షుల జంటలు మిడిసి పాటుతో గుండ్రటి ఆమె స్తనద్వయాన్ని తాకాయి.

*8-105 మత్తేభ విక్రీడితము*

వినువీథిన్ జనుదేరఁ గాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీ
వనసంపత్తి నిరాకరిష్ణుఁ గరుణావర్ధిష్ణుఁ యోగీంద్ర హృ
ద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజనబృందప్రాభవాలంకరి
ష్ణు నవోఢోల్ల సదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్.

*తాత్పర్యము*

విష్ణుమూర్తి రాక్షసుల బతుకు తెరువులను నశింప జేసే వాడు, దయా రసంతో మించేవాడు, మహాయోగుల హృదయా లనే వనాలలో విహరించేవాడు, గొప్ప ఓర్పుగల వాడు, భక్తుల గొప్పదనాన్ని పెంపొందించేవాడు, నవయౌవనంతో వెలుగొందే లక్ష్మీదేవితో కలిసి విహరించే వాడు. జయశీలుడు, మహా కాంతిమంతుడు. అట్టి భగవంతుడిని ఆకాశమార్గంలో వస్తుండగా దేవతలు చూసారు.

*8-107 మత్తేభ విక్రీడితము*

చనుదెంచెన్ ఘనుఁ డల్లవాఁడె; హరి పజ్జం గంటిరే లక్ష్మి? శం
ఖ నినాదం బదె; చక్ర మల్లదె; భుజంగధ్వంసియున్ వాఁడె; క్ర
న్నన యేతెంచె నటంచు వేల్పులు నమోనారాయణాయేతి ని
స్వనులై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం జక్రికిన్.

*తాత్పర్యము*

గజేంద్రుని ఆర్తి బాపటానికి ఆరాటంగా ఆకాశంలో వెళ్తున్న శ్రీమహావిష్ణువును చూసి దేవతలు “అదిగదిగో మహనీయుడైన విష్ణుమూర్తి వస్తున్నాడు. అతని వెనుకనే శ్రీమహాలక్ష్మి వస్తున్నది చూడండి. అదిగో పాంచజన్య శంఖధ్వని. సర్పాలను సంహరించేవాడు గరుత్మంతుడు అదిగో చూడండి వెంట వస్తున్నాడు.” అనుకుంటు “నారాయణునికి నమస్కారం” అంటు నమస్కారాలు చేస్తున్నారు.

*8-108 వచనము*

అ య్యవసరంబునఁ గుంజరేంద్రపాలన పారవశ్యంబున దేవతానమస్కారంబు లంగీకరింపక మనస్సమాన సంచారుం డై పోయిపోయి కొంతదూరంబున శింశుమారచక్రంబునుం బోలె గురుమకరకుళీర మీనమిథునంబై; కిన్నరేంద్రుని భాండాగారంబునుంబోలె స్వచ్ఛ మకరకచ్ఛపంబై; భాగ్యవంతుని భాగధేయంబునుంబోలె సరాగ జీవనంబై; వైకుంఠపురంబునుంబోలె శంఖచక్ర కమలాలంకృతంబై; సంసార చక్రంబునుంబోలె ద్వంద్వసంకుల పంక సంకీర్ణంబై యొప్పు నప్పంకజాకరంబుఁ బొడగని.

*తాత్పర్యము*

ఆ సమయంలో గజేంద్రుడిని రక్షంచాలని వెళ్తున్న తొందరలో, విష్ణుమూర్తి దేవతల మొక్కులు అందుకోలేదు. అలా మనోవేగంతో వెళ్ళి, ఏనుగు మొసలి పోరాడుతున్న మడుగుని చూసాడు. ఆ మడుగులో శింశుమార చక్రంలో లాగ గొప్ప మొసళ్ళు, పీతలు, చేపలు జంటలు జంటలుగా ఉన్నాయి. కుబేరుని ధనాగారంలోని కచ్చపం అనే నిధి వంటి శ్రేష్ఠమైన తాబేళ్ళు ఉన్నాయి, ధనవంతుని సుఖజీవనంలోని అనురాగం లాగ ఎఱ్ఱని జీవనం (నీరు) నిండుగా ఉంది, వైకుంఠం వలె శంఖం, చక్రం (చక్రవాక పక్షులు), కమల (లక్ష్మి) లతో అలంకరింపబడి ఉంది. సుఖ దుఃఖాలనే ద్వంద్వాలతో నిండిన సంసారం వలె జలచరాల జంటలతో కలచబడిన బురద కలిగుంది.

*8-109 మత్తేభ విక్రీడితము*

కరుణాసింధుఁడు శౌరి వారిచరమున్ ఖండింపఁగాఁ బంపె స
త్త్వరితాకంపిత భూమిచక్రము మహోద్యద్విస్ఫులింగచ్ఛటా
పరిభూతాంబర శుక్రమున్ బహువిధబ్రహ్మాండభాండచ్ఛటాం
తరనిర్వక్రముఁ బాలితాఖిల సుధాంధశ్చక్రముం జక్రమున్.

*తాత్పర్యము*

దయాసాగరుడైన నారాయణుడు మొసలిని చంప మని తన చక్రాన్ని పంపాడు. ఆ చక్రం భూమండలాన్ని కంపింప జేసే వేగం కలది. గొప్ప అగ్నికణాల జల్లుతో ఆకాశ మండలాన్ని కప్పివేసేది. అనేక విధమైన బ్రహ్మాండభాండాల సమూహాలలోను ఎదురు లేనిది. దేవతలను అందరిని కాపాడేది.

*8-111 శార్దూల విక్రీడితము*

అంభోజాకరమధ్య నూతన నలిన్యాలింగన క్రీడ నా
రంభుం డైన వెలుంగుఱేని చెలువారన్ వచ్చి నీటన్ గుభుల్
గుంభద్ధ్వానముతోఁ గొలంకును కలంకం బొందఁగా జొచ్చి దు
ష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై.

*తాత్పర్యము*

ఇలా పంపగానే, చక్రాయుధం సరోవరంలోని లేలేత పద్మాలని కౌగలించుకోడానికి వెళ్తున్న సూర్యబింబంలా వెళ్ళింది. గుభిల్లు గుభిల్లనే పెద్ద చప్పుడుతో మడుగు కలచిపోయేలా లోపలికి దూకింది. రివ్వున మనో వేగంతో ఆ చెడ్డదైన మొసలి ఉన్న చోటు సమీపించింది.

*8-112 శార్దూల విక్రీడితము*

భీమంబై తలఁ ద్రుంచి ప్రాణములఁ బాపెం జక్ర మా శుక్రియన్
హేమక్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం
గామక్రోధన గేహమున్ గరటి రక్తస్రావ గాహంబు ని
స్సీమోత్సాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్.

*తాత్పర్యము*

రివ్వున పోయి, చక్రాయధం మొసలి తలని భయంకరంగా తెగనరికింది. ఆ మకరం మేరు పర్వతమంత పెద్ద దేహం గలది, అడవి ఏనుగులకు సైతం భయం కలిగించేది, కామక్రోధాలతో నిండినది. గజరాజు రక్తధారల రుచిమరిగినది, అంతులేని ఉత్సాహంతో అలసటలేకుండ పోరాడుచున్నది, గెలుపుని నమ్మకంగా కోరుతున్నది. విష్ణుచక్రం వెళ్ళి అలాంటి మొసలి శిరస్సుని ఖండించి ప్రాణాలు తీసింది.

*8-113 వచనము*

ఇట్లు నిమిష స్పర్శనంబున సుదర్శనంబు మకరితలఁ ద్రుంచు నవసరంబున.

*తాత్పర్యము*

ఇలా రెప్పపాటు కాలంలో మొసలి శిరస్సును సుదర్శన చక్రం ఖండించిన ఆ సమయంలో

*8-114 కంద పద్యము*

మకర మొకటి రవిఁ జొచ్చెను;
మకరము మఱియొకటి ధనదు మాటున డాఁగెన్;
మకరాలయమునఁ దిరిగెఁడు
మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్.

*తాత్పర్యము*

ద్వాదశరాశులలో ఉండే మకరం సూర్యుని చాటున నక్కింది. నవనిధులలో ఉండే మకరం కుబేరుని చాటున దాక్కుంది. సముద్రంలో ఉన్న మకరాలు ఆదికూర్మం చాటుకి చేరాయి.
(మకరం అంటే మొసలి. ఇలా మొసళ్ళు అన్ని బెదిరిపోడానికి కారణం భూలోకంలో ఒక మడుగులో ఉన్న గజేంద్రుని హరించ సిద్ధపడ్డ మకరం ఖండింపబడటం. విష్ణుమూర్తి సుదర్శనచక్రం అంటే ఉన్న విశ్వవ్యాప్త భీతిని స్ఫురింపజేసినట్టి కవి చమత్కారం యిది. (1) ఆకాశంలో ఉన్న మకరం అంటే ఆకాశంలో (1.మేషము, 2.వృషభము, 3.మిథునము, 4.కర్కాటకము, 5.సింహము, 6.కన్య, 7.తుల, 8.వృశ్చికము, 9.ధనుస్సు, 1.0మకరము, 11.కుంభము, 12.మీనము అనబడే) ద్వాదశ రాసులు ఉన్నాయి కదా వాటిలోని మకరం, (2) పాతాళంలో ఉన్న మకరం అంటే కుబేరుని వద్ద (1.మహాపద్మము 2.పద్మము 3.శంఖము 4.మకరము 5.కచ్ఛపము 6.ముకుందము 7.కుందము 8.నీలము 9.వరము అనబడే) నవనిధులు ఉన్నాయి కదా వాటిలోని మకరం. (3) సముద్రంలోని మకరాలు అంటే మొసళ్ళకి అదే కదా నివాసం. ఆ మకరాలన్నీ. ఇంకా సముద్ర మథన సమయంలో ఆది కూర్మం సముద్రంలోనే కదా అవతరించింది.)

8-115 మత్తేభ విక్రీడితము

తమముం బాసిన రోహిణీవిభు క్రియన్ దర్పించి సంసారదుః
ఖము వీడ్కొన్న విరక్తచిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూడ్చి పా
దము లల్లార్చి కరేణుకావిభుఁడు సౌందర్యంబుతో నొప్పె సం
భ్రమదాశాకరిణీ కరోజ్ఝిత సుధాంభస్స్నాన విశ్రాంతుఁడై.

*తాత్పర్యము*

కారుచీకటి నుండి వెలువడిన చందమామ లాగ, సంసార బంధాల నుండి విడివడిన సన్యాసి లాగ, గజేంద్రుడు మొసలి పట్టు విడిపించుకొని ఉత్సాహంగా కాళ్ళు కదలించాడు. ఆదరంతో ఆడదిగ్గజాలు లాంటి ఆడ ఏనుగులు తొండాలతో పోసిన అమృత జలంలో స్నానం చేసి అలసట తీర్చుకొన్న వాడై గజేంద్రుడు గర్వించి చక్కదనాలతో చక్కగా ఉన్నాడు.

*8-116 శార్దూల విక్రీడితము*

పూరించెన్ హరి పాంచజన్యముఁ గృపాంభోరాశి సౌజన్యమున్
భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్
సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్
దూరీభూత విపన్నదైన్యమును నిర్ధూతద్విషత్సైన్యమున్.

*తాత్పర్యము*

విష్ణుమూర్తి విజయసూచకంగా పాంచజన్య శంఖాన్ని ఊదాడు. ఆ శంఖం దయారసానికి సాగరం వంటిది. తన మహా గొప్పధ్వనితో పంచభూతాల మహా చైతన్యాన్ని పటాపంచలు చేసేది. అపారమైన శక్తితో కూడిన తెల్లని కాంతితో ఇంద్రాది ప్రభువులకైన బెరకు పుట్టించేది. దీనుల దుఃఖాన్ని పోగొట్టేది. శత్రువుల సైన్యాలను పారదోలేది.

*8-117 మత్తేభ విక్రీడితము*

మొరసెన్ నిర్జరదుందుభుల్; జలరుహామోదంబులై వాయువుల్
దిరిగెం; బువ్వులవానజల్లుఁ గురిసెన్; దేవాంగనాలాస్యముల్
పరఁగెన్; దిక్కులయందు జీవజయశబ్దధ్వానముల్ నిండె; సా
గర ముప్పొంగెఁ దరంగ చుంబిత నభోగంగాముఖాంభోజమై.

*తాత్పర్యము*

శ్రీహరి పాంచజన్యం ధ్వనించగానే దేవతల దుందుభులు మోగాయి. పద్మాల సువాసనలతో కూడిన గాలులు వీచాయి. పూలవానలు కురిసాయి. దేవతా స్త్రీలు నాట్యాలు చేసారు. సకల ప్రాణుల జయజయధ్వానాలు నల్దిక్కుల వ్యాపించాయి. తన తరంగాలతో సముద్రుడు ఉప్పొంగి ఆకాశగంగ ముఖపద్మాన్ని ముద్దాడి ఆనందించాడు.

*8-118 కంద పద్యము*

నిడుద యగు కేల గజమును
మడువున వెడలంగఁ దిగిచి మదజల రేఖల్
దుడుచుచు మెల్లన పుడుకుచు
నుడిపెన్ విష్ణుండు దుఃఖ ముర్వీనాథా!

*తాత్పర్యము*

మహారాజా! విష్ణుమూర్తి తన పొడవైన చేతితో గజేంద్రుని సరస్సులోంచి బయటకు తీసుకొని వచ్చాడు. అతని మదజల ధారలు తుడిచాడు. మెల్లగా దువ్వుతు దుఃఖాన్ని పోగొట్టేడు.

*8-119 కంద పద్యము*

శ్రీహరి కర సంస్పర్శను
దేహము దాహంబు మాని ధృతిఁ గరిణీసం
దోహంబుఁ దాను గజపతి
మోహన ఘీంకార శబ్దములతో నొప్పెన్.

*తాత్పర్యము*

విష్ణుమూర్తి చేతి స్పర్శ వల్ల గజేంద్రుని శరీరతాపం అంతా పోయింది. గజరాజు సంతోషంగా ఆడఏనుగుల సమూహంతో కలిసి చేస్తున్న ఘీంకర నాదాలతో సొంపుగా ఉన్నాడు.

*8-120 కంద పద్యము*

కరమున మెల్లన నివురుచుఁ
గర మనురాగమున మెఱసి కలయం బడుచుం
గరి హరికతమున బ్రతికినఁ
గరపీడన మాచరించెఁ గరిణుల మరలన్.

*తాత్పర్యము*

శ్రీహరి దయవల్ల బతికినట్టి గజేంద్రుడు, ఇదివరకు లానే తన ఆడ ఏనుగులను తన తొండంతో మెల్లగా తాకాడు. మళ్ళీ మిక్కిలి ప్రేమగా వాటి తొండాలను తన తొండంతో నొక్కాడు.

*8-121 సీస పద్యము*

జననాథ! దేవలశాప విముక్తుఁడై;
పటుతర గ్రాహరూపంబు మాని
ఘనుఁడు హూహూ నామ గంధర్వుఁ డప్పుడు;
తన తొంటి నిర్మల తనువుఁ దాల్చి
హరికి నవ్యయునకు నతిభక్తితో మ్రొక్కి;
తవిలి కీర్తించి గీతములు పాడి
యా దేవు కృప నొంది యందంద మఱియును;
వినత శిరస్కుఁడై వేడ్కతోడ

*ఆటవెలది*

దళిత పాపుఁ డగుచు దనలోకమున కేగె
నపుడు శౌరి కేల నంటి తడవ
హస్తి లోకనాథుఁ డజ్ఞాన రహితుఁడై
విష్ణురూపుఁ డగుచు వెలుఁగుచుండె.

*తాత్పర్యము*

పరీక్షిన్మహారాజా! అప్పుడు దేవల ముని పెట్టిన శాపం నుండి విముక్తి కావడంతో “హూహూ” అనే పేరు గల ఆ గంధర్వుడు ఆ కఠినమైన మొసలి రూపం విడిచిపెట్టేడు. తన పూర్వపు నిర్మల మైన రూపం ధరించాడు. మిక్కిలి భక్తితో విష్ణుమూర్తికి మొక్కి స్తోత్రాలు చేసి ఆ దేవదేవుని అనుగ్రహం పొందాడు. భక్తిగా వంచిన శిరస్శుతో మరల మరల నమస్కరిస్తు సంతోషంగా పుణ్యాత్ముడై గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి గజరాజును చేతితో దువ్వాడు. వెంటనే గజరాజు అఙ్ఞాన మంతా తొలగిపోయింది. అతను విష్ణుదేవుని సారూప్యం పొంది ప్రకాశించాడు.

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: