*జీవితంలో ఒంటరి తనాన్ని తప్పించుకోవడానికే మనిషి నానారకాలుగా వ్యాపకాలలో మునిగి తేలుతుంటాడు. నిజానికి చుట్టూ సమూహలే. మన చుట్టూరా మనుషులే. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా తన మనిషి అనుకునేవారు వుండరు. ఎంతటి దురవస్థ ఇది. సముద్రం మధ్యన ఉండి దాహంతో అల్లాడిపోయే స్థితి ఇది. ఇదే ఇవాలిటి మానవుడి దుస్థితి. తమ లోపలి ఒంటరితనాన్ని తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ వుంటారు. ఆ క్రమంలో అసలు జీవితాన్నే కోల్పోతారు. ఎందుకీ ఒంటరితనం? జీవితాన్ని జీవించలేక పోవడంలోనే ఈ లోపం ఉంది. అనవసరమైన ఆరాటాలలో పడి తమ సహజాతాల్ని కోల్పోవడంలోనే మానవ జీవిత విషాదం ఇమిడి ఉంది. ఎవరినీ ప్రేమించలేరు, ప్రేమను పొందలేరు. ప్రేమ లేనప్పుడు జీవితంలో మిగిలేది ఒంటరితనమనే చీకటే. చాలామంది బతుకులు ఈ చీకట్లోనే హరించుకుపోతాయి. లోలోపల పెను దుఃఖం సుడులు తిరుగుతున్నా పైకి మాత్రం నిబ్బరంగా వుంటారు. లోపల దుఃఖ పునాదుల్ని బయటకు రాకుండా ఒడిసి పట్టుకునే యత్నం లొనే బతుకులు దగ్దమైపోతాయి. ఎందుకీ విషాదం? ఎందుకీ పెను దుఃఖం? మనిషికి తోడుగా మరో మనిషి లేకపోవడమే ఈ దౌర్భాల్యానికి మూలం. "నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే జీవించుటకు తోడు ఒకరుండిన అదే చాలును" అన్నాడో కవి. కానీ సుదీర్ఘ జీవిత కాలంలో అలా ఒక్క మనిషీ కనిపించక పోవడమే మానవుడికి అసలు విషాదం. జీవితంలో సంపదలు పొగుచేసుకోగలరు, కీర్తి ప్రతిష్టలు పెంచుకోగలరు. కానీ జీవిత కాలమంతా కలసి తనని త్రికరణ శుద్ధిగా ప్రేమించే ఒక్క మనిషినైన సంపాదించుకోలేరు. ఎందుకని? తనకు ఏం కావాలో తను తెలుసుకోలేకపోవడమే దీనికి కారణం. బుచ్చిబాబు "చివరకు మిగిలేది" నవలలో దయానిధి అన్నట్టు 'మనిషికి కావలసింది కాసింత దయ, ప్రేమ". అవి మనుషులకు లభించనంత కాలం ఈ ఒంటరితనం, దుఃఖం నుంచి విముక్తి లేదు మరి.*
*సర్వేజనా సుఖినో భవంతు....మీ ఆకొండి రామ మూర్తి....27.07.2020....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి