శ్రీమాత్రేనమః
*45వ నామ మంత్రము* 27.7.2020
*ఓం ఐం హ్రీం శ్రీం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః* పద్మములను సైతము తిరస్కరించునటువంటి పాదద్వయ ప్రభాజాలములు (కాంతులు) కలిగిన శ్రీమాతకు నమస్కారము శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం ఐం హ్రీం శ్రీం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ తల్లి కరుణించి సకలాభీష్టములను నెరవేర్చును, శాశ్వతమైన బ్రహ్మజ్ఞానమును సంప్రాప్తింపజేయును🌻🌻🌻 *భగవంతుని పాదపద్మములు* అనడం సాధారణం. అంటే పాదాలను పద్మములతో పోల్చిచెప్పడము అని అర్థం. కాని అమ్మవారి పదద్వయమును పోల్చుటకు సరోజములు (తామరపువ్వులు - పద్మములు) సైతము చాలవు. ఎందుకంటే అమ్మవారి పాదముల కాంతులు పద్మముల కాంతుల వలెకాదట. అంతకన్నా దివ్యకాంతితోను, మృదువుగాను, కోమలంగాను అమ్మవారి పాదములు విరాజిల్లుతున్నాయని వశిన్యాదులు వివరించారు. కారణ మేమిటంటే పద్మములకాంతి మూడునాళ్ళముచ్చటయే రెండుమూడు రోజులలో నీటిలో ఉన్ననూ వాటికాంతులు వెలవెలపోతాయి. అమ్మవారి పాదద్వయము నిరంతరం దివ్యకాంతులు వెదజల్లుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నీటిలో ఉన్నంతవరకే వాటికాంతులు ఒక్కరోజైనా. ఇంకనూ కలువలకు చంద్రకాంతి, కమలములకు సూర్యుకాంతి ఉంటేనే కళకళలాడుతూ ఉంటాయి. అమ్మవారి పాదములు ఎల్లవేళలా ప్రభాసించుతూ ఉంటాయి🌺🌺🌺 *బ్రహ్మవిష్ణుమహేశాన వేద పూజితాంఘ్రద్వయే* అని వశిష్ట మహర్షి అంటారు అనగా బ్రహ్మవిష్ణుమహేశ్వరుల చేతను, చతుర్వేదముల చేతను పూజింపబడే అమ్మవారి పాదములు సరోజములతో (పద్మములు) ఎలా పోల్చగలము?🌻🌻🌻అమ్మవారి కుడిపాదము శుక్లవర్ణము, ఎడమ పాదము రక్తవర్ణము గలవి. ఈ రెండునూ అజ్ఞానము, అవిద్యా రూప సంసార బంధమును తొలగించునని భావము. బ్రహ్మ తేజస్సుచే పరమేశ్వరి పాదద్వయ మేర్పడినది🌺🌺🌺 అందుకనే జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ఐం హ్రీం శ్రీం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః* అని అంటాము, ఆరాధిస్తాము🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ* అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది నేడు సోమ వారము🌻🌻🌻ఇందు వారము అని కూడా అంటాము నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము *ఓం నమశ్శివాయ* అనే ఈ ప పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము. మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి