27, జులై 2020, సోమవారం

శ్రావణ సోమవారం నీలకంఠుడిని పూజిస్తే..

శ్రావణ సోమవారం నీలకంఠుడిని పూజిస్తే.. 
విశేష ఫలప్రదము.

మాసాలన్నింటిలో శ్రావణమాసం ప్రత్యేకతను ... ప్రాధాన్యతను కలిగివుంది. శ్రావణమాసం శుభాన్ని సూచిస్తుందనీ ... శుభకార్యాలకు ద్వారాలు తెరుస్తూ ఆనందాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రవణా నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడు కూడిన మాసమే 'శ్రావణ మాసం'గా భావించబడుతోంది. శ్రావణ మాసంలో సోమవారం ... మంగళవారం ... శుక్రవారం ...శనివారం... పౌర్ణమి విశిష్టమైనవిగా చెబుతుంటారు

పరమ శివుడు సముద్రమధనంలో వెలువడిన హాలాహలాన్ని శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పరమ శివుని పూజిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి. పార్వతి దేవికి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడంగా నమ్ముతారు.
శ్రావణ సోమవారం రోజున చేసిన శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మహర్షులు చెప్పడం జరిగింది. ఈ రోజున సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా శివరాధాన చేస్తాడట. అందువలన ఈ రోజున పరమశివుడిని భక్తితో అభిషేకించిన వారిని ఆయనతో పాటు విష్ణువు కూడా అనుగ్రహిస్తాడు.

ఇంకా శివాలయాల్లో జరిగే అభిషేకాలు, పూజలు చేయించేవారికి వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఇక అమ్మవారిని మంగళ గౌరీ అంటారు కనుక మంగళవారం రోజున అమ్మవారిని పూజిస్తూ 'శ్రావణ మంగళవారం' నోము నోచుకుంటూ వుంటారు. తమ సౌభాగ్యాన్ని కాపాడమంటూ వివాహిత స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నోము నోచుకుంటారు.

మహిళలు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తే సకలసంపదలు చేకూరుతాయి. శ్రావణ మాసంలో పెళ్ళిల్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది.

కామెంట్‌లు లేవు: