16, నవంబర్ 2020, సోమవారం

ఇంద్రునికి

 పురాణాలలో ఇంద్రునికి తపస్సులు పాడుచెయ్యడం తప్ప మరొక పని లేదా?


కొన్ని కొన్ని పురాణాలకు వ్యాఖ్యానాలు రాసేవారు, మరికొన్ని విశ్లేషణలు చేసేవారు అనవసరంగా ఇంద్రుని తక్కువ చేసి రాస్తున్నారు. అసలు కొన్నింటికి ప్రతిపదార్ధం మాత్రం అనువాదం చేసి అక్కడ విషయాన్ని సరిగ్గా అందించక దేవతలలో ఉత్తముడిని పరమ లోలునికింద చూపుతారు. ఇక ఈ మధ్య వచ్చిన మాధ్యమాల వలన పాపం ఆయన అనవసరంగా అందరికీ లోకువ అయిపోయాడు. కేవలం ఇంద్రుడు అంటే మద్యం సేవించేవానిగా అప్సరసల నాట్యం తిలకించేవానిగా, పనికట్టుకుని ఎవరు తపస్సు చేస్తే వారి గురించి భయపడి వారిని చేడగొట్టే వానిగా ఇక మామూలు మానవులకు ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ ఆపాదించేసి దేవతలను తక్కువ చేసి చూపి మొత్తానికి మన హైందవ సంస్కృతి మీద మీ దేవుళ్ళు ఇలా అని దాడి చేస్తున్నారు. పూర్తిగా తర్కం తెలియని చాలా మంది హిందువులు అవును నిజం కాబోలు అని అనవసరంగా ఆయనను అలా చిత్రించేసుకున్నారు. అసలు ఈ ఇంద్రుడు ఎవరు, ఆయన బాధ్యతలు ఏమిటి, కొన్ని సార్లు ఎందుకు విపరీతంగా ఆయన నడిచారో తార్కికంగా చర్చించుకుందాము.


ఇంద్రుడు అన్నది ఒకరు కాదు, అది ఒక పదవి. మనమున్న కల్పంలో  వైవస్వత మన్వంతరంలో ఉన్న ఇంద్రుడు వాసవుడు, అదితి పుత్రుడు. ఈయన దేవతలకు అధిపతి. మనకున్న సమయాలను బట్టి ఆయన ఆయుర్దాయం ఒకసారి లెక్కకడితే 

1 మానవ సంవత్సరం = దేవతలకు ఒక అహోరాత్రం ( పగలు + రాత్రి )

360 దేవ అహోరాత్రాలు = 1 దేవతల సంవత్సరం ( 360 మానవ సంవత్సరాలు )

12000 దేవవత్సరాలు = 1 చాతుర్యుగం ( 12,000 * 360 = 43,20,000 మానవ సంవత్సరాలు)

(4800 దేవవత్సరాల సత్య యుగం + 3600 దేవవత్సరాల త్రేతాయుగం + 2400 దేవవత్సరాల ద్వాపరం + 1200 దేవవత్సరాల కలియుగం )

71 చాతుర్యుగాలు = 1 మన్వంతరం ( 1 మనువు ఆయుష్షు ) (30,67,20,000 మానవ సంవత్సరాలు ) 

14 మన్వంతరాలు = 1 కల్పం (429,40,80,000 మానవ సంవత్సరాలు ) – ఇది ఒక ఇంద్రుని ఆయుష్షు = బ్రహ్మకు ఒక పగలు.

కాబట్టి మనవంటి వారిలా ఆయనను లెక్క కట్టడం మన మూర్ఖత్వం.  ( మనం ఒక ఈగ తరపున ఆలోచించాము అనుకోండి, అది బ్రతికే 28 రోజుల వ్యవధికి మన ఆయుర్దాయం చాలా ఏళ్ళగా అనిపిస్తుంది )


ఒకరు ఇంద్రపదవి అధిష్టించాలి అంటే వారు 100 అశ్వమేధ యాగాలు చెయ్యాలి. ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్క అశ్వమేధ యాగం అంటే అశ్వంలా పరుగులు పెట్టె తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని ఎంతో శ్రద్ధగా క్రతువును నిర్వహించి తనకున్న సొమ్మును అంతా చాతుర్వర్ణ ప్రజలకు దానం చేసి దేవతలను సంప్రీతులను చెయ్యాలి. మరల సంపాదించి మరొక యాగం చెయ్యాలి. అంటే ఎన్ని సంవత్సరాలు తపస్సో ఒక్కసారి చెయ్యండి. ఈ యాగం చేసిన సంవత్సరం పొడుగునా ఏకభుక్తం, మరెన్నో నియమాలు ఉంటాయి.ఇవన్నీ పాటించాలి అంటే ఎంతో ఇంద్రియనిగ్రహం ఉండాలి, ఎంతో సాధన ఉండాలి, ఎంతో త్యాగం చెయ్యాలి. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఎదురవ్వవచ్చు, ఎన్నో అవరోధాలు కల్పింపబడతాయి. వాటిని ఎంతో ధైర్యంగా అధిగమించి, సాధన చేసి ఆ పదవికి యోగ్యత సాధిస్తారు. వారికి దేవతల రాజుగా ఉండే అదృష్టం దక్కుతుంది. ఎంతో తపస్సు చేస్తే తప్ప సాధ్యం కాదు. భూలోకానికి కావలసిన వర్షం, మనుగడకు కావలసిన సౌకర్యాలు కల్పించడం ఆయన కర్తవ్యం. ఎంతో ప్రేమ, దయ వుంటే తప్ప ఆ పదవికి అర్హులు కారు. 


ప్రతీ యుగంలో ఎందరో సాధన చేస్తూ ఉంటారు. వారిని పరీక్షించి వారిని మరింత ఉన్నతికి చేరువగా చేర్చడం ఆయన కర్తవ్యం. తపస్సు అందరూ చేస్తారు, దేవతలు, రాక్షసులు కూడా. దైవాన్ని చేరుకునె తపస్సు సాత్వికం, పరపీడనా పరాయణులు చేసే తపస్సు తామసికం. వారికి వరాలు అందితే చేసేది అందరినీ పీడించడం. ఆయనకు ఈ లోకాలను కాపాడవలసిన బాధ్యత వుంది కావున ఆయన ఎవరి తపస్సు ఎటువంటిదో అని పరీక్షిస్తూ ఉంటాడు. వారికి ఎటువంటి లౌల్యం ఉందొ ఆ తపస్సు మానడం వలన వారికి తెలిసి వచ్చి దానిని అధిగమించి మరింత పురోగామిస్తారు. ఉదాహరణకు విశ్వామిత్రుని తపోభంగం వలన ఆయనకు తన తప్పు తెలిసివచ్చి మరింత కృషి చేసి బ్రహ్మర్షి అయ్యాడు. కొందరు ఆ పరీక్షలలో లౌల్యానికి గురయ్యి పతనం చెందితే నూటికో కోటికో ఒకరు దాన్ని దాటి పురోగమించారు. ఆయన విశ్వపాలనాధికారి అయిన విష్ణువు యొక్క ఆదేశం మేరకు తన కర్తవ్యం నిర్వహిస్తాడు తప్ప అందులో ఆయన తప్పు ఉండదు. కానీ దేహదారికి కనుక అప్పుడప్పుడు దైవాపరాధాలు జరిగి వెంటనే సరిదిద్దబడతాయి. ఉదాహరణకు శ్రీకృష్ణుడు కూడా భూలోకంలో దేహంతో ఉన్నందున భూలోక వాసుల మీద ఆయన అధికారం ఉంది కనుక ఆయనను ఇబ్బందిపెట్టబోయి తన తప్పు తెలుసుకుని ఆయన పాదాలు పట్టాడు. 


ఆయన మనకు ఉన్న ప్రభువు. సకాలంలో వర్షాలు కురిపించి, సరైన వాతావరణం చేకూర్చి పంటలు పండి యజ్ఞయాగాలు నిర్విఘ్నంగా జరిపించాలి అన్నది ఆయన కర్తవ్యం. ఆ కర్తవ్య నిర్వహణలో కొందరు వారి కర్మానుసారం ఆయన పరీక్షలకు లోనయి తత్ఫలితాలు అనుభవిస్తారు. ఉదాహరణకు అహల్య ఇంద్రుని మీద ఎప్పటినుండో మనసు పడి దేవతల నాయకుడు అయిన ఆయన మీద మనస్సు ఉండి పెళ్ళయి కూడా పరుని మీద వ్యామోహం ఉన్నది కావున గౌతముని వలన సరిదిద్దబడాలి అని ఆయన నాటకంలో భాగం అయ్యాడు, లేకపోతే మనుషులు ఎక్కడ దేవతలు ఎక్కడ వారి దేహాలు ఏమిటి మనుష్యుల దేహాలు ఏమిటి, మనుష్యుల దేహం మీద వారికి మోహం ఏమిటి ఒకసారి ఆలోచించండి? ఇక తపస్సు చేసే వారు నిజంగా వేటిని పట్టించుకోక కేవలం తమ ఏకాగ్రత తపించే మంత్రం మీద వున్నదా, ఆ దేవతాశక్తి మీద ఉన్నదా అని తెలుసుకోవడం కోసం కొన్ని వ్యతిరిక్త పరిస్థితులను కల్పించి వారికి సహాయం చేస్తూ ఉంటాడు. 


అలాగే వారికి వారి తత్త్వపరిశోధనలో ఆయన సహాయం అర్ధిస్తే అది ఇస్తారు. ఉదాహరణకు భరద్వాజ మహర్షి వేదం మొత్తం చదవాలని ఎంతో కోరిక మేర తపస్సు చేసి ఇంద్రుని వలన మూడు సార్లు వెయ్యి వెయ్యి సంవత్సరాల ఆయుర్దాయం పెంపొందించుకుని వేదసారాన్ని అభ్యసిస్తూ ఉంటారు. చివరకు ఇంద్రుడే ఆయనముందు ప్రత్యక్షమై నాయనా నీవు ఈ మూడు వేల సంవత్సరాలలో చదివింది ఇది అని మూడు కొండల నుండి మూడు గుప్పెళ్ళ మట్టి ఇచ్చి, నువ్వు నేర్చుకున్నది ఇంత, తెలుసుకోవలసినది మరి ఎంతో చూడు అని ఆయనకు దిశానిర్దేశం చేస్తారు. ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో ఆయన మహిమలు ఉన్నాయి. ఋగ్వేదంలో ఇంద్రుని పరమపురుషుని ప్రతినిధిగా పొగుడుతూ ఆయనే దేవుడు అని చెప్పే ఎన్నో ఋక్కులు ఉన్నాయి. 


రాబోయే కల్పానికి ఇంద్రుడు బలిచక్రవర్తి. ఆయనను స్వయంగా విష్ణువే అనుగ్రహించి త్రివిక్రమావతారంలో ఆయనను పాతాళానికి పంపి అక్కడ ఆయన చేస్తున్న తపస్సుకు ప్రత్యక్ష్యంగా ఆయనే కాపు కాస్తున్నాడు. ఆయనకు ఉన్న అహంకారాన్ని తీసేసి ఆయనను ఇంద్రపదవికి అర్హత సంపాదించేలా ఆయనను ఈ దేవ దానవ గొడవలనుండి దూరం చేసి, తపస్సు మీద మనస్సు లగ్నం చేసే విధంగా పరిస్థితి కల్పించి నేర్పుతున్నాడు స్వయానా విష్ణువు. ఇప్పటి వాసవుడు కూడా ఇతఃపూర్వం అంతటి తపస్సు చేసి పరబ్రహ్మ అనుగ్రహం సంపాదించినవాడే కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేవతలు, మానవులు ఒకరికి ఒకరు సహాయకారిగా సృష్టిలో ఉండాలని ఆయన శాసనమని తెలియచేస్తాడు. ఆయన అంశతో ఉన్నవాడే రాజు కాగలడు, అటువంటి సూక్ష్మమైన అంశ కలిగిన ఇంద్రుడు సాక్షాత్తు మనకు మాననీయుడు. సదా మనల్ని అనుగ్రహించే పరమ మిత్రుడు. కావున ఆయనను మనం మన స్వామి ప్రతినిధిగా గౌరవించి పూజించాలి తప్ప తక్కువ ఆలోచనలు కూడదు.

కామెంట్‌లు లేవు: