16, నవంబర్ 2020, సోమవారం

రుద్రం-నమకం-చమకం

 రుద్రం-నమకం-చమకం


మనము నిత్యమూ ఆ పరమ శివుని దివ్య మంగళ లింగ రూపమునకు అభిషేకాదులు భక్తితో నిర్వహిస్తూ ఉంటాము. నమక చమకములతో, ఉదాత్తానుదాత్త స్వరితాలతో భక్తి పారవశ్యంతో కొలుస్తూ ఉంటాము. ఐతే మనం చేసే అభిషేకంలో చెప్పే మంత్రార్థం మాత్రం తెలియకుండా అభిషేకము చేయడంకంటే ఆ మంత్రార్థము తెలిసి అభిషేకము చేసినట్లైతే ఒక్క శాతం ఫలము పొందే స్థానంలో వంద శాతం ఫలాన్ని పొందగలం.

యదధీత మవిజ్ఞాతం నిగదేనైవ శబ్ధ్యతే

అనాగ్నావివ శుష్కేంధౌ నతజ్జలతి కర్హిచిత్.


తాత్పర్యము:- చదివిన దానికి తప్పక ఆర్థము తెలుసుకొన వలయును. జప మంత్రములకు జప కాలములో అర్థభావన చేయవలయును. అర్థము తెలియని అక్షర జపము వలన అగ్ని లేని ఎండు కట్టెలు వలె అది జ్వలించదు. అనే ఆర్యుల అభిప్రాయంలో ఎంతో ఔచిత్యం ఉంది.


🌹 రుద్ర నమకము - చమకము - భావము మీకు తెలుసా? 🌹*

 *భాగము 2


రుద్రము - నమకము


🌻 అనువాకము 1 - 1🌻


దీనిలో మొత్తం 15 మంత్రములు కలవు.


1వ మంత్రము.


 నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః.

నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తేనమః.


ఓ రుద్రుఁడా! నీ కోపమునకు నమస్కారము. నీ కోపము నా బాహ్యాంతశ్శత్రువులపైన ప్రవర్తించును గాక. (నన్ను బాహ్యాంతశ్సత్రుహీనునిగా చేయుదువు గాక అని భావము) అంతే కాదు. నీ బాణమునకు, ధనుస్సునకు ధనుర్బాణ సహితములైన నీ బాహువులకు ఇదే నా నమస్కారము.*


*2వ మంత్రము.*


**యాత ఇషుః శ్శివతమా శివం బభూవ తే ధనుః**

శివాశరవ్యా యా తవ తయానో రుద్ర మృడయ.


ఓ రుద్రుఁడా! నీ యీ శరము చాలా శాంతమైనదాయెను. నీ ధనుస్సు శాంతమైనదాయెను. నీ యమ్ములపొది శాంతమైనదాయెను. కావున శాంతించిన శరీరము తోడను, అమ్ములపొది తోడను మమ్ములను సుఖపరచుము.


3వ మంత్రము.


యాతే రుద్ర శివా తనూః అఘోరా పాపకాశినీ.

తయా నస్తనువా శంతమయా గిరిశంతాభిచా కశీహి.


ఓ రుద్రుఁడా! మమ్ములను అనుగ్రహించు నీ శివ యను శరీరము మా పట్ల అఘోరమై యుండును గాక. ఆ నీశరీరము మా పట్ల హింసారూపమైన అనిష్టమును ప్రకాశింప జేయకుండును గాక.(ఇట పాపమనగా హింసా రూపమగు అనిష్టము) ఓ పరమ శివా నీ శరీరము మమ్ములను స్వయముగా హింసింప కుండుటయే కాదు. పరుల వలన యే అనిష్టము కలుగ నీయక కాపాడ వలయును. మమ్ములనెవరును హింసింపకుండ కాపాడవలెను. మాకేపాపములు అంటనీయక కాపాడవలెను. మాలోనేవేని పాపములు, లోపములు ఉన్నచో తొలగింపుము. వానిని బహిర్గతములు కానీయకుము, అని మేము నిన్ను ప్రార్థించు చున్నాము.


4వ మంత్రము.


యామిషుం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే

శివాం గిరిత్ర తాం కురు

 మా హిగ్ంసీః పురుషం జగత్.


ఓ గిరిశంత! రుద్ర! వైరులపై చిమ్ముటకు నీవు చేత బాణములను దాల్చితివి. కైలాస గిరిని పాలించు ఓ రుద్రుఁడా! శత్రువులను శిక్షించుటకు చేత దాల్చిన నీ యా బాణమును మాపై చిమ్మక, దానిని శాంతము కలదిగ నుంచుము. పురుషులమగు మమ్ములను, మనుష్య వ్యతిరిక్తమై స్థావర జంగమములతో నిండిన యే జగత్తును హింసింపకుము తండ్రీ! అని ప్రార్థించెను.


5వ మంత్రము.


శివేనవచసాత్వా గిరిశాచ్ఛా వదామసి.

యధానః స్సర్వమిజ్జగత్  

అయక్ష్మగ్ం సుమనా అసత్.


మహా శివా! నీవు కైలాసమున నివసించు చున్నావు. నిన్ను జేరుటకు మంగళకరమైన స్తుతు లొనర్చుచు ప్రార్థించుచున్నాను. మాదగు ఈ సర్వ జగత్తు మనుష్య పశ్వాది జంగమములతో నిండి యున్నది. ఈ జంగమ ప్రపంచము నిరోగమై సౌమనస్య సంపన్నమగులట్లు గావింపుము తండ్రీ!


6వ మంత్రము.


అధ్యవోచ దధివక్తా ప్రథమోదైవ్యోభిషక్.

అహీగ్ంశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః


మహాదేవా! మాయందరిలో నీతడే యధికుఁడని నిన్నుద్దేశించి చెప్పుటచే నీవే అధివక్తవైతివి. దేవతలలో నీవే ప్రథముఁడవు, ముఖ్యుఁడవు కదా! నీవు దైవ్యుఁడవు(దేవతలనెల్లస్వయముగా పాలింప సమర్థుఁడవు) నిన్ను దలంచి నంతనే సర్వ రోగములును ఉపశమించును. కాన నీవు చికిత్సకుఁడవు. సర్వ సర్పములను, వ్యాఘ్రాదులను, సర్వ రాక్షసులను నశింపజేయువాఁడవు కదా! కావున మమ్ములను కాపాడుము తండ్రీ!


7వ మంత్రము.


అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమంగళః.

యేచేమాగ్ం రుద్రా అభితో దిక్షుః శ్రితాస్సహస్రశోవైషాగ్ం హేడఈమహే.


ఏ రుద్రుఁడు ఈ మండలస్థాదిత్య రూపుఁడో అతఁడు ఉదయ కాలమున అత్యంత రక్త వర్ణుఁడాయెను. ఉదయాత్పూర్వము ఇంచుకంత రక్త వర్ణుఁడాయెను. అంతే కాదు ఉదయానంతర కాలమున పింగళ వర్ణుఁడాయెను.ఆయా కాలములందు అతనిలో మిగిలిన వర్ణములు కలవు. అంధకారాదులను నివారించుటచే అత్యంత మంగళ స్వరూపుఁడాయెను. కిరణ రూపులైన ఏ యితర రుద్రులు ఈ భూమిపై నంతటను, తూర్పు మున్నగు దిక్కులందును, వ్యాపించి యున్నారో వారునూ సహస్ర సంఖ్యాకులై కలరు. సూర్య రూపులును, సూర్య రశ్మి రూపులును అగు ఈ రుద్రులకు అందఱకును ఏ క్రోధ సదృశమైన తీక్షణత్వము కలదో దానిని భక్తి నమస్కారాదులతో నివారించు చున్నారము.

                 

8వ మంత్రము.


అసౌయో உవసర్పతి నీలగ్రీవో విలోహితః.

ఉతైనం గోపా అదృశన్

 అదృశన్ను దహార్యః.

ఉతైనంవిశ్వాభూతాని సదృష్టో మృడయాతినః. 


ఏ రుద్రుఁడు కాల కూటమను విషము దాల్చుటచే నీలగ్రీవము కలిగి యుండెనో, అట్టి ఈతఁడు విశేషమైన రక్త వర్ణము కలవాడై, మండల వర్తియై, ఉదయాస్తమయ సంపాదకుడై ప్రవర్తించుచున్నాఁడు. అంతే కాదు. వేద శాస్త్ర సంస్కార హీను లైన గోపాలురు కూడ ఈ ఆదిత్య రూపుఁడై మండలమున గల రుద్రుని చూచుచున్నారు. నీరమును గొనివచ్చు వనితలును ఈ రుద్రుని చూచుచున్నారు. అంతే కాదు ఆదిత్య రూపుఁడగు ఈ రుద్రుని గోవులు, బఱ్ఱెలు మున్నగు సకల ప్రాణులును చూచుచున్నవి. వేద శాస్త్రజ్ఞుల చేతను, వేదశాస్త్రములు తెలియని వారిచేతను, పశుపక్ష్యాదుల చేతను చూడ బడువాఁడైన రుద్రుఁడు మమ్ములను సుఖ వంతులనుగా చేయును గాక.


9వ మంత్రము.


నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే

అధోయే అస్య సత్వానో உహం తేభ్యోకరం నమః.


తాత్పర్యము : ఇంద్ర మూర్తి ధారణచే వేయి కన్నులవాఁడైన శివునకు నమస్కార మగును గాక. ఫర్జన్య రూప ధారియై, వృష్టి కర్తయై సుఖమొసగు శివునకు నమస్కారము. అంతే కాదు. ఏవి ఈ రుద్రుని యొక్క భృత్య రూపములైన ప్రాణులు కలవో వానికి నేను నమస్కారము చేయుచున్నాను.


10వ మంత్రము.


ప్రముంచధన్వ నస్త్వం ఉభయోరార్త్నియోర్జ్యాం*

*యాశ్చతే హస్త ఇషవః. పరాతా భగవోవప.


ఓ భగవంతుఁడా! నీవు పూజా వంతుఁడవు. మహదైశ్వర్య సంపన్నుఁడవు. ఓ రుద్రా! నీవు నీ ధనుస్సున రెండు చివరలకు కట్టిన త్రాటిని విడువుము. విప్పివేయుము. నీ చేతనున్న బాణములను విడిచిపెట్టుము. మాపై విడువకు తండ్రీ!*


11వ మంత్రము.


అవతత్యధనుస్త్వగ్ం

  సహస్రాక్ష శతేషుధే.

నిశీర్య శల్యానాంముఖా శివోనఃస్సుమనాభవ.


ఇంద్ర రూపుఁడవైన ఓ రుద్రుఁడా! వందల కొలదీ అమ్ములపొదులు కలవాఁడా! ధనుస్సును దించి, బాణముల యొక్క ముఖములను అంప పొదులలో నుంచి, మా పట్ల అనుగ్రహ యుక్తుఁడవై శాంతుఁడవు కమ్ము.


12వ మంత్రము.


విజ్యంధనుః కపర్దినో విశల్యోబాణవాగ్ం ఉత

అనేశన్నస్యేషవ ఆభురస్య నిషంగధిః.


జటాజూటము గల శివుని యొక్క ధనుస్సు విగతమైన వింటి త్రాడు కలది యగు గాక. అంతే కాదు. నీ యొక్క బాణములు గల అంప పొది బాణములు లేనిది అగు గాక. ఈ రుద్రుని యొక్క బాణములు అంప పొదిలో నుండుటచే చంపుట కసమర్ధములు అగుగాక. ఈ రుద్రుని యొక్క అంప పొది బాణ వహన మనెడి చిన్న పని చేయుటకు మాత్రమే సమర్ధము అగు గాక. కత్తులు దాచు ఒర కత్తులు మోయుటకు మాత్రమే సమర్ధమగు గాక.


13వ మంత్రము.


యాతే హేతిర్మీఢుష్టమ

 హస్తే బభూవతే ధనుః

తయాస్మాన్ విశ్వత

స్త్వమ యక్ష్మయా పరిబ్భుజ.


అందరి కోరికలను అధికముగా తీర్చే ఓ శివుఁడా! ఏ నీ ఆయుధము ఖడ్గాది రూపమున కలదో, నీ యొక్క చేతియందు ఏ ధనుస్సు కలదో, నీవు ఉపద్రవములు కావింపని ఆ ఆయుధముచే, ఆ ధనుస్సుచే, మమ్ములను అంతటను అన్ని విధములా పరిపాలింపుము.


14వ మంత్రము.


నమస్తే అస్త్వాయుథాయా உ

అనాతతాయ ధృష్ణవే

ఉభాభ్యాముతతే నమో 

బాహుభ్యాం తవ ధన్వనే.


ఓ రుద్రుఁడా! ధనుస్సున బంధింప బడని కారణమున ప్రసరింపఁ జేయఁ బడినట్టియు, స్వరూపము చేతనే చంప సమర్ధమైనట్టి నీ యొక్క ఆయుధమునకు నమస్కార మగు గాక. అంతే కాదు నీయొక్క రెండు భుజములకు నమస్కారము అగు గాక. నీ యొక్క ధనుస్సునకు నమస్కార మగు గాక.


15వ మంత్రము.


పరితే ధన్వనో హేతిః

అస్మాన్ వృణక్తు విశ్వతః.

అథోయ ఇషుధిః

స్తవా உరే అస్మన్నిధేహితం.


ఓ శివుఁడా! నీధనుస్సునకు బాణాది రూపమైన ఆయుధము మమ్ములను అన్ని విధముల విడుచును గాక. అంతే కాదు. నీ యొక్క ఏ అంప పొది కలదో దానిని మా కంటె దూరముగా ఉంచుము.


అనువాకము 1 సమాప్తము.


సశేషం...

             ....

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: