16, నవంబర్ 2020, సోమవారం

ధార్మికగీత - 82*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 82*

                                    *****

     *శ్లో:- రాజవత్ పంచ వర్షాణి ౹*

            *దశ వర్షాణి దాసవత్ ౹*

            *ప్రాప్తే తు షోడశే వర్షే ౹*

            *పుత్రం మిత్రవ దాచరేత్ ౹౹*

                                 *****

*భా:- సంస్కృతిలో అపురూప దాంపత్య ఫలాలు బిడ్డలు.వారే వంశాభివృద్ధికి,సమున్నతికి కారకులు. అట్టి బిడ్డల పెంపకంలో మూడు కీలక దశలు గమనించాలి. 1. "రాజవత్":- బిడ్డని ఐదేండ్ల(1-5) వరకు రాచమర్యాదలతో ఆలనా, పాలనా చేయవచ్చు. అతడు కోరిందే తడవుగా అచ్చట,ముచ్చట తీర్చవచ్చు. లాలించి,బుజ్జగించి ముద్దులొలికే పలుకులు, చిలిపి పనులతో మురిసిపోవచ్చు. మహారాజులా పెంచి పోషించవచ్చు. 2. "దాసవత్":- పదేండ్లపాటు (6-15) అతనిని "చక్కని నగ తయారీకి బంగారపు కడ్డీని సుతారంగా సుత్తె దెబ్బలతో మలిచినట్లుగా", క్రమశిక్షణ గరపుతూ, విద్యాబుద్ధులతో పాటు దైవప్రీతి, పాపభీతి,సంఘనీతి,మర్యాద,మన్నన, నయము,వినయములలో, సామదానభేదదండోపాయాలతో సుశిక్షణ నిచ్చి తీర్చిదిద్దాలి. ఈ దశలో ఒక సేవక భావనతో కఠినంగా వ్యవహరించాలి. 3."మిత్రవత్" :- బిడ్డకి పదహారో యేడు వచ్చీ రాగానే, అతణ్ణి వర్ధమాన పౌరునిగా గుర్తించాలి. మిత్రునిగా భావించాలి. ప్రియమిత్రుని వలె ఆదరంతో మన్ననగా అడిగి పనులు చేయించుకోవాలి. అతని పనులలో మనం చేయూత అందించి ప్రోత్సహించాలి. అప్పుడే వారి మదిలో,హృదిలో మనపై ప్రేమ,నమ్మకము,పెద్దరికం, ఆదరణ బలపడతాయి. ఆ పవిత్రబంధం కడదాకా పెనవేసుకుపోతుంది. "పుత్రాత్ ఇచ్ఛేత్ పరాజయం" అన్నట్టుగా బిడ్డని మంచిగా, తన కన్నా మిన్నగా తీర్చిద్దిద్ది, అతని చేతిలో ఓటమిని మనసారా కోరుకోగలిగినవాడే నిజమైన తండ్రి యని సారాంశము*.

                                  *****

                   *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: