17, ఆగస్టు 2021, మంగళవారం

*శ్రీ సూక్తము..* *( ఆరవ భాగము.)*

 *శ్రీ సూక్తము..* *( ఆరవ భాగము.)*


*మూడవ ఋక్కు* ::  


*అ॒శ్వ॒పూ॒ర్వాం ర॑థమ॒ధ్యాం హ॒స్తినా॑ద ప్ర॒బోధి॑నీం శ్రియం॑ దే॒వీముప॑హ్వయే॒ శ్రీర్మా॑ దే॒వీర్జు॑షతాం ॥*


సర్వ సౌభాగ్య దాయిని అనే లక్ష్మీస్వరూపాన్ని ఈ మూడవ ఋక్కులో ధ్యానిస్తున్నాము. 


అ॒శ్వ॒పూ॒ర్వాం, ర॑థమ॒ధ్యాం, హ॒స్తినా॑ద ప్ర॒బోధి॑నీం, శ్రియం, దే॒వీమ్, మా, అనే 7 కొత్త మాటలు ఇందులో వచ్చాయి.


దేవీభాగవతంలో దేవసేనలకు నాయకత్వం వహిస్తూ వెళ్తున్న సేనాపతి రూపంలో ఉన్న అమ్మవారిని ఇక్కడ ధ్యానించడం జరుగుతుంది. ఇందులో మొదటి మూడు మాటలకు గుర్రాలు ముందు వెళుతుంటే రధం మధ్యలో కూర్చుని తన వెనక ఏనుగుల ఘీంకారాలు వినిపిస్తుంటే కదిలి వెళ్తున్న అమ్మవారి వర్ణ న కనిపిస్తుంది.


 అశ్వాలు రథము అనే మాటలకు ఇంతకు ముందు అర్థాలు చెప్పుకున్నాము. యోగ శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకొని శరీరం మధ్యలో ఉన్న కుండలినీ శక్తిని ఓంకారంతో ప్రేరేపించడం అనే భావం ఈ ఋక్కులో అంతర్లీనంగా ఉంటుంది.


శ్రియం అంటే అందరికీ ఆశ్రయం ఇచ్చేది శ్రేయస్సును కలిగించేది. 


దేవి అనే పదానికి ప్రకాశించేది కాంతి తో కూడినది అనేది ఒక అర్థము. క్రీడించేది అనేది రెండవ అర్థము. ఆమె స్వయంగా ప్రకాశ రూపిణి. ఆవిడ చేసే పనులన్నీ లీలలు.


మా అనే మాటకు తల్లి, లక్ష్మీదేవి అని రెండర్థాలు.


ఉపాహ్వాయే జూషతాం అనే రెండు పదాలు ఇక్కడ ఉన్నాయి. ఇంతకు ముందు రెండు ఋక్కులలో అమ్మవారిని ఆవాహన చేయడం స్థిరాసనం ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారు మంది మార్బలంతో కలిసి రావడాన్ని ఈ ఋక్కులో మొదటి పాదంలో సూచించారు. ఆ రావడం కూడా చాలా దర్జాగా దర్పంతో వచ్చినట్టుగా చూపించారు. ఇప్పుడింక సాధకుడు ఉపాహ్వాయే అంటే నా దగ్గర గా ఉండేటట్టు అమ్మవారిని ఆహ్వానించు అని ప్రార్థిస్తాడు. అమ్మవారు ఎల్లప్పుడు తన పక్కన ఉండాలన్నమాట.


 మనుషులకు కోరుకున్నది దొరికినా తృప్తి ఉండదు. ఇంకాస్త కావాలనుకుంటారు. శ్రీ సూక్తం లో సాధకుడు కూడా ముందుగా అమ్మవారు మా ఇంటికి రావాలి అనుకోవడం. తర్వాత ఇంకెక్కడికి పోకుండా తన ఇంట్లోనే ఉండాలి అనుకోవడం. దాని తర్వాత తన పక్కనే కూర్చుని ఉండాలి అనుకోవడం. అక్కడితో కూడా ఆగడం లేదు.


జూషతాం అంటే ప్రీతి పెంచుకుని సేవ చేయడం. అమ్మవారు తన పక్కన కూర్చొని తన మీద ఇష్టం పెంచుకొని తన అవసరాలు కనిపెట్టి అవన్నీ తీరుస్తూ ఉండాలని కోరుకోవడం. జుషతాం అనే మాటకు ప్రీతి కలిగి ఉండడం సేవించడం మొదలైన అర్థాలున్నాయి. అమ్మవారిని మనం సేవించడమా?? అమ్మవారు మనలను సేవిస్తుందా?? ఇక్కడ సాధకుడి కోరిక ఆవిడ మన మీద ప్రేమ పెంచుకొని మన కోరిక తీర్చాలి అని స్పష్టంగా ఉంది. ఆ కోరిక తీరడానికి సాధకుడు లక్ష్మీ దేవితో చుట్టరికం పెట్టుకున్నాడు. మా = అమ్మ అని సంభోదించాడు. తల్లి బిడ్డ మీద ప్రేమ పెంచుకొని బిడ్డకు ఎలా సేవ చేస్తుందో బిడ్డ కోరికలు ఎలా తీరుస్తుందో అలాగ లక్ష్మీదేవి తన మీద ప్రేమ పెంచుకొని తన కోరికలు తీర్చాలని సాధకుడి కోరిక.


మహారాణి లాగ గుర్రాలు ఏనుగులు రథాల తో కూడి వచ్చిన లక్ష్మీదేవి ఎల్లవేళలా నాకు దగ్గరగా ఉండి నన్ను కుమారుని గా భావించి ప్రేమతో నా కోరికలన్నీ తీర్చి గాక. అనేది భావము.


*నాలుగవ ఋక్కు* ::  


*కాం॒సో᳚స్మి॒ తాం హిర॑ణ్యప్రా॒కారా॑మా॒ర్ద్రాం జ్వలం॑తీం తృ॒ప్తాం త॒ర్పయం॑తీం ।*

*ప॒ద్మే॒ స్థి॒తాం ప॒ద్మవ॑ర్ణాం॒ తామి॒హోప॑హ్వయే॒ శ్రియం ॥*


ఈ ఋక్కులో మహాలక్ష్మి స్వరూపాన్ని పరాశక్తి రూపంలో ధ్యానించడం జరుగుతుంది.


కాం॒, సో᳚స్మి॒,తాం, ఆర్ద్రాం, పూర్తిగా కొత్త పదాలు. మిగతా పదాలు పరవాలేదు.


*కాం* :: క అనే అక్షరానికి పరబ్రహ్మ, నీరు, శిరస్సు, సుఖము అని అర్థాలున్నాయి. ఇవి కాక కః అంటే ఎవడో అని కా అంటే ఎవతేనో అని అర్థం. కాం అంటే ఎవతో ఒకావిడను ఒకానొక అమ్మాయిని అని సంస్కృత భాషలో అర్థము. చందన చర్చిత పాటలో శ్లిష్యతి కామపి చుంబతి కామపి పశ్యతి కామపి అని వస్తుంది. ఆ కామపి కామపి అన్న మాటలు కాం+అపి. ఆ పాటలో ఎవరో ఒక అమ్మాయిని కృష్ణుడు ఇలా చేశాడు ఎవరో ఒక అమ్మాయిని కృష్ణ డలా చేశాడు అని వర్ణిస్తారు. ఇన్ని విశేషణాలు ఇన్ని వర్ణనలను చేసి అమ్మవారెవరో తెలియనట్లు కాం అనే పదం ఎందుకు వాడినట్లు. బ్రహ్మ పదార్థాన్ని పరాశక్తిని వేదాంత పరిభాషలో స్పష్టంగా నిర్వచించలేము. మనసు వాక్కు వాళ్లను వర్ణించ లేక ఏం చెప్పాలో తెలీక అంటే calm (కాం) అయిపోతాయి. అందువల్ల లింగ వచన విభక్తులు లేని శుద్ధబ్రహ్మన్ని క్వచిత్ అని పిలుస్తారు. రావణ కృత శివతాండవ స్తోత్రం లో క్వచిద్దిగంబర అనే పదం వస్తుంది. అందులో క్వచిత్ అందమైన ప్రయోగము. అలాగే శివమహిమ్నస్తోత్రం లో కూడా క్వచిత్ పదం వస్తుంది. నిర్గుణ బ్రహ్మ అనే అర్థంలో ఈ పదాన్ని వాడతారు. ఒక స్థాయి ఉన్న వాళ్లు తప్ప ఈ పదాన్ని అందరూ సులభంగా ప్రయోగించలేరు. ఈ పదానికి పుంలింగం కశ్చిత్ స్త్రీ లింగం లో కాచిత్ అవుతుంది. కా అనేదానికి ద్వితీయ విభక్తి కాం. ఇది అది అని వాక్కు ద్వారా వర్ణించడానికి వీలులేని పరాశక్తి అనే అర్థంలో కాం శబ్దాన్ని ఇక్కడ వాడారు. 


బ్రహ్మీ శక్తి అంటే సరస్వతీ దేవిని ఈ అక్షరం సూచిస్తుంది. సుఖ స్వరూపిణీ అంటే ఆనంద రూపిణీ ఆనంద దాయినీ అని అర్థాలు వస్తాయి. పైగా కామ్ బీజాక్షరం కూడా. లలిత అమ్మవారి పంచదశి మంత్ర అక్షరాలలో ప్రధానమైనది క కారము. ఈ అక్షరంతో మొదలయ్యే మంత్రాన్ని కాది విద్య అని పిలుస్తారు. ఆ అక్షర రూపంలో ఉన్న దేవత అని కూడా అర్థం వస్తుంది.


ఇంకా వుంది......


*పవని నాగ ప్రదీప్.*

కామెంట్‌లు లేవు: