17, ఆగస్టు 2021, మంగళవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఐదువారాల నిద్ర..*


"నేను చాలా ఇబ్బందుల్లో వున్నాను..దిక్కు తోచడం లేదు..నువ్వు కొద్దిగా డబ్బు సర్దుబాటు చేస్తే..మళ్లీ నేను కోలుకున్నాక నీ డబ్బు నీకు వడ్డీ కలిపి తిరిగి ఇచ్చేస్తా..కాదనకు.. ఇవి చేతులు కావు, కాళ్లనుకో.." అంటూ ఆ వ్యక్తి శ్రీ మీరాశెట్టి గారి వద్ద ప్రాధేయపడసాగాడు..మీరాశెట్టి గారు అతనిని అనునయించాలని చూస్తున్నారు గానీ వీలు కుదరటం లేదు..ఇప్పటికిప్పుడు ఎంతో కొంత డబ్బు అతని చేతిలో పెడితేగానీ వదిలేటట్లు కనిపించడం లేదు..


ఆ వచ్చిన వ్యక్తి పేరు వెంకటేశ్వర్లు..మీరాశెట్టి గారికి బాగా తెలిసిన వాడే..వ్యాపారం చేసి అందులో నష్టపోయాడు.. అప్పులపాలయ్యాడు..నిజానికి అతను వ్యాపారం మొదలుపెట్టిన నాడు ఏ ఇబ్బందీ లేదు..ఉన్నంతలో సర్దుకొని అలానే కొనసాగించి వుంటే..ఈ పరిస్థితి దాపురించేది కాదు..అత్యాశకు పోయి..అప్పులు తెచ్చి వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేసాడు..తాను పెట్టిన పెట్టుబడి కి, రాబడికి వ్యత్యాసం పెరిగిపోయి..అప్పుల్లో పడ్డాడు..ఇక దిక్కుతోచక మీరాశెట్టి గారి వద్దకు వచ్చాడు..


"నువ్వంతగా బాధ పడుతున్నావు కాబట్టి..నేను నీకు పదివేల రూపాయలు సహాయం చేస్తాను..అదికూడా నువ్వొక మాట ఇస్తేనే.." అన్నారు మీరాశెట్టి గారు..ఏమిటో చెప్పామన్నాడు వెంకటేశ్వర్లు..ఐదు వారాల పాటు, వారానికి ఒకరోజు లెక్కన.. భార్యతో కలిసి..మొగలిచెర్ల గ్రామం వద్ద ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద నిద్ర చేయాలని..తన సమస్యలు తీరిన తరువాత..శ్రీ స్వామివారి మందిరం వద్ద అన్నదానం చేయాలని..షరతులు పెట్టారు మీరాశెట్టి గారు..సరే అన్నాడు వెంకటేశ్వర్లు..


అనుకున్న ప్రకారం..వెంకటేశ్వర్లు కు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేసారు మీరాశెట్టి గారు..(1980 ప్రాంతంలో పల్లెటూరులో..పదివేల రూపాయాలంటే పెద్ద మొత్తం క్రిందే లెఖ్ఖ!). వెంకటేశ్వర్లు ఆ డబ్బును వెంటనే ఖర్చు పెట్టలేదు..ముందుగా మీరాశెట్టి గారికి మాట ఇచ్చిన ప్రకారం..ఆరోజు సాయంత్రమే బయలుదేరి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి భార్యతో సహా వెళ్ళాడు..ఆరోజు రాత్రి శ్రీ స్వామివారి మందిరం లో నిద్ర చేశారు వెంకటేశ్వర్లు దంపతులు..తెల్లవారి లేచి..శ్రీ స్వామివారి సమాధిని దర్శనం చేసుకొని..తిరిగి తన ఊరికి వచ్చేశాడు..మీరాశెట్టి గారిని కలిసి, తాను మొగలిచెర్ల వెళ్లొచ్చిన సంగతి చెప్పాడు..


మరో వారం గడిచేసరికి మీరాశెట్టి గారు వెంకటేశ్వర్లు సంగతి దాదాపుగా మర్చిపోయారు..అతని బాధ అతను పడుతున్నాడు..పదే పదే అతని వెంటపడటం ఎందుకని మీరాశెట్టి గారి భావన..పైగా వెంకటేశ్వర్లు సమస్యను ను మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి కి అప్పచెప్పాము కదా..ఆ స్వామే అన్నీ చూసుకుంటాడు అనే నమ్మకం మీరాశెట్టి గారిది..


మరో రెండువారాలు గడిచాయి..మొత్తం మూడువారాలు వెంకటేశ్వర్లు మొగలిచెర్ల వెళ్లి, శ్రీ స్వామివారి సమాధి మందిరం లో నిద్ర చేసి వచ్చాడు..అతని ఆర్ధిక పరిస్థితి లో మార్పు రాసాగింది..అప్పుల వాళ్ల వత్తిళ్ళు కొద్దిగా తగ్గడమే కాదు, తనకు రావాల్సిన పైకం కూడా వసూలు అవడం జరిగింది..మీరాశెట్టి గారి వద్ద తీసుకున్న పదివేల రూపాయల లో ఏమీ ఖర్చు కాలేదు..అలానే ఉండిపోయింది..వెంకటేశ్వర్లు కు శ్రీ స్వామివారి మీద నమ్మకం ఏర్పడింది..నాలుగో వారం కూడా మొగలిచెర్ల వెళ్లి, నిద్ర చేసి వచ్చాడు..ఐదు వారాలు పూర్తయ్యే సరికి..వెంకటేశ్వర్లు లో మునుపటి నైరాశ్యం లేదు..ఉత్సాహంగా వున్నాడు..ఇంకో రెండు నెలల కల్లా..వ్యాపారం గాడిలో పడింది..అనవసరపు ఆర్భాటాలు తగ్గించుకున్నాడు..ఉన్నంతలో వ్యాపారం చేసుకోసాగాడు..చిత్రమేమిటంటే..ఐదు వారాల పాటు శ్రీ స్వామివారి మందిరం వద్ద నిద్ర చేయాలనుకున్న వెంకటేశ్వర్లు..ప్రతి వారం మొగలిచెర్ల వచ్చి, మందిరం వద్ద నిద్ర చేసి వెళ్లసాగాడు..


మీరాశెట్టి గారి వద్ద తాను అప్పుగా తెచ్చిన పదివేల రూపాయలను తిరిగి ఇవ్వడానికి ఆయన వద్దకు వెళ్లి.."నువ్వు ఇచ్చిన ఈ డబ్బు ఖర్చు పెట్టలేదు..ఇంట్లోనే ఉంచుకున్నాను..తీవ్రమైన అవసరం వస్తేనే ఖర్చుపెట్టాలని అనుకున్నాను..కానీ ఈలోపలే ఆ దత్తాత్రేయ స్వామి దయ వల్ల నా ఇబ్బందులు తొలిగాయి..చిన్న చిన్న సమస్యలను నేను పరిష్కరించుకోగలను..నువ్వు ఆరోజు మొగలిచెర్ల వెళ్లి, శ్రీ దత్తాత్రేయ స్వామి వద్ద నిద్ర చేయాలని నాచేత ప్రమాణం చేయించుకున్నావు..నువ్వు చెప్పినట్లే చేసాను..ఆ స్వామి కరుణించాడు.. ఇంకెప్పుడూ అత్యాశకు పోను..ఉన్నంతలో వ్యాపారం చేసుకుంటాను..ఇదిగో నువ్విచ్చిన డబ్బు..వడ్డీ తో కలిపి తెచ్చాను.." అన్నాడు..


మీరాశెట్టి గారు వడ్డీ తీసుకోకుండా తానిచ్చిన పదివేల రూపాయలు మాత్రం తీసుకున్నారు..మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి పాదాలను నమ్ముకోమని..వాటిని విడవకుండా పట్టుకోమని..వెంకటేశ్వర్లు కు మళ్లీ సలహా ఇచ్చారు..


మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో మీరాశెట్టి గారిదే మరో అనుభవం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: