26, అక్టోబర్ 2021, మంగళవారం

మరుత్తరాట్చరిత్ర

 *చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు రచియించితి మరుత్తరాట్చరిత్ర*


సరే ఇంతకు ఏమిటీ మరుత్తుని చరిత్ర.

........................................................


చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు రచియించితి మరుత్తరాట్చ చరిత్ర.


మనోజ్ఞమైన రూపంతో నూనూగు మీసాలప్రాయంలో మరుత్తరాట్చరిత్ర గ్రంథాన్ని వ్రాశానని శ్రీనాథకవి సార్వభౌముడు చెప్పుకొన్నాడు. మనం కూడా చదువుకొన్నాం, కాని ఈ మరుత్తచక్రవర్తి కథేమిటో చాలామందికి తెలియదని నా అభిప్రాయం. అలాంటి వారి కోసం.


పూర్వం కరందముడనే రాజొకడు వుండేవాడు. అతని పట్టపురమహిషి వీరమహదేవి. వీరికి అనిక్షితుడనే కొడుకు కలిగాడు. అతను పెరిగి పెద్దవాడైన సమయానికి విశాల రాజు తన కుమార్తె వైశాలికి స్వయంవరం ప్రకటించాడు.


ఆ రాకుమారిని స్వయంవరంలో చేపట్టడానికి అనిక్షితుడు బయలుదేరాడు. ఈ యువరాజు అందగాడే కాక సకలకళావల్లభుడు పైగా మంచి యోధుడు కూడా. అనిక్షితుడు స్వయంవరానికి వస్తే తమలో ఎవరికికూడా రాకుమారి దక్కదని ఇతర రాజకుమారులు అసూయ చెంది మోసంతో బంధివేశారు.


కొడుకు బంధీఅయినాడని తెలియగానే కరందముడు పెద్ద సేనతో వచ్చి ఇతర రాకుమారులను ఓడించి అనిక్షితుని విడుదలచేశాడు. సాహసవీరుడై వుండి శక్తిసామర్థ్యాలు కలిగివుండి కూడా ఇతర రాజకుమారులను ఓడించలేక తండ్రిచేత విడుదలైనందుకు అనిక్షితుడు బాగా సిగ్గుపడ్డాడు. ఇలాంటి అసమర్ధుడైన తనకు పెండ్లెందుకని రాజ్యమెందుకని విచారించాడు. తండ్రి ఎంత వారించినా నాలాంటి చేతకానివాడికి పాలించే అర్హత లేదని బ్రహ్మచర్యదీక్ష తీసుకొంటానని అడువులకు వెళ్ళిపోయాడు. కానితల్లి నోము నోచేవేళ ఆమె దగ్గరేవుండి సేవలు చేసేవాడు. ఆ రోజున అడిగినవారికి లేదనుకుండా దానం చేసేవాడు.


అనిక్షితుడి పౌరుషం దీక్షలు వైశాలికి నచ్చాయి. పెండ్లంటూ చేసుకొంటే అనిక్షితుడిని తప్ప ఇతరులను పెండ్లాడనంటూ పంతంతో తపస్సు చేసుకోటానికని అడవులకు వెళ్లిపోయింది.


పాతళలోకంలో నాగులున్నారు. ఓ వృద్ధ నాగేంద్రం వారికి నాయకుడు. నాగులకు శత్రుబాధ అధికంగా వుంది. వారి హాని వలన నాగజాతి హరించుకుపోయే ప్రమాదముంది. వైశాలి అనిక్షితుల పుత్రుడే తమ కష్టాలను తీర్చగలడని ఆ నాగేంద్రునకు తెలుసు.


అందుకే తపంలోనున్న వైశాలిని ఆ నాగేంద్రుడు పాతాళలోకానికి తీసుకుపోయాడు. చక్కగా చూసుకొన్నాడు. ఆమెకు జన్మించబోయే బిడ్డకుబాగా శిక్షణలు ఇచ్చి మంచివీరుడిగా చేస్తానని మాట ఇచ్చాడు. అలాగని ఆమెతో మాట కూడా తీసుకొన్నాడుకాని బ్రహ్మచర్యంలోనున్న అనిక్షతుడికి పాతాళంలోనున్న వైశాలికి కుదిరేదెట్లా ? కరందముడు కూడా వంశాంకురంలేదని వేదన పడసాగాడు. అందుకు అతనికో ఆలోచన వచ్చింది.


తల్లి వీరమహాదేవి నోమునోచుకొనే వేళ అనిక్షితుడు అమ్మ దగ్గరకు వచ్చాడు. తల్లినోము పూర్తికాగానే అనిక్షితుడు ఎవరేమి అడిగితే దానిని లేదనకుండా దానంగా ఇవ్వసాగాడు. తండ్రి నా వంశం నిలబడే సంతానాన్ని కనమని ఇదే తనకు దానంగా ఇవ్వాలని కరందముడు కొడుకును కోరాడు.


తండ్రికి ఇచ్చిన మాట దాటలేక వైశాలితో పరిణయానికి ఒప్పుకొన్నాడు. నాగరాజు సాయంతో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇద్దరికి వివాహం జరిగింది. అనిక్షితుడు రాజ్యం చేపట్టాడు.


వారికో కొడుకు పుట్టాడు, అతనికి మరుత్తుడనే పేరు పెట్టారు. మరుత్తు అన్ని రకాల రాజనీతులు యుద్ధతంత్రాలు నేర్చుకొని తాత రాజ్యాన్ని తండ్రి అనుమతితో పొంది ఏలసాగాడు. యజ్ఞయాగాలు చేశాడు. మరుత్తుడు ఎంత పరాక్రముడంటే ఇంద్రునికే యుద్ధాలలో తోడ్పడేవాడు.


మరుత్తుని యజ్ఞయాగాల నిర్వహణ అతని శక్తియుక్తులు రణతంత్రాలను చూచి ఇంద్రుడు అసూయపడ్డాడు. ఒకసారి మరుత్తు ఓ యాగాన్ని తలపెట్టి బృహస్పతిని ఉపద్రష్టగా (యాగ నిర్వహాకుడు) వుండమని కోరాడు. కాని ఇంద్రుడు అందుకు ఒప్పుకోలేదు. బృహస్పతిని అడ్డగించాడు. బృహస్పతిని మరుత్తు పిలిచినా రాలేదు. నువ్వు రాకపోతేనేమి నీ సోదరుడైన సంవర్తునితో యాగం పూర్తిచేస్తానన్నాడు. సంవర్తబుుషిని యాగకర్తగా యజ్ఞం తలపెట్టాడు.


ఈలోగా నాయనమ్మనుండి మనవడికి కబురొచ్చింది. పాతాళనాగులు మనదేశంపై పడి మునులను హింసిస్తున్నారు, పదునైన కోరలతో కాటువేసి చంపుతున్నారు. బుుషులను అసహాయులను ఉపిరాడకుండా చుట్టి బాధిస్తున్నారనేది నానమ్మ పంపిన సారాంశం.


మరుత్తు రెట్టించిన క్రోధంతో నాగులపై బడ్డాడు. నాగులను చీల్చిచెండాడసాగాడు. దీంతో నాగరాజు భయపడిపోయాడు. ఒకప్పుడు అడవిలో తపస్సు చేసుకొంటున్న వైశాలిని నాగేంద్రుడు పాతాళానికి తీసుకువెళ్ళి ఆదరించి తనకు పుట్టబోయే కొడుకుచేత నాగులకు శత్రుబాధలేకుండా చేయిస్తానని మాటకు ఆమెనుండి తీసుకొన్నాడు కదా !


ఆ చనువుతో నాగరాజు, మరుత్తునుండి రక్షించాల్సిందిగా ఆమెను ప్రార్థించాడు. వైశాలి భర్తయైన అనిక్షితుడివద్దకు వెళ్ళి కొడుకుచే యుద్ధాన్ని ఆపించాల్సిందిగా కోరింది. తండ్రి కొడుకును పిలిచి నాగులసంహారాన్ని ఆపాల్సిందిగా ఆదేశించాడు. అమాయక తపసులను ప్రజలను చంపే నాగులను ఉపేక్షించేదిలేదని మరుత్తు బదులిచ్చాడు. తండ్రియైన తనమాటనే కాదన్నందుకు మరుత్తుమీద అనిక్షితుడు కోపగించాడు.


ఇద్దరికి మాటమాట పెరిగింది. కత్తులు దూశారు. ఇరు పక్షాలకు ఘోరయుద్ధం మొదలైంది. వారి ఆయుధధాటికి కొండలు పిండైనాయి, భూమి కంపించింది, సముద్రాలు ఉప్పొంగినాయి. లోకాలన్ని అల్లాడిపోయాయి. ఈ పరిస్థితినుండి కాపాడమని దేవతలు మునులు దేవేంద్రుని ప్రార్థించారు.దేవేంద్రుడు వారి మాటను ఆలకించారు.


తండ్రికొడుకుల యుద్ధభూమికి వచ్చాడు. ఇద్దరిని శాంతించమని కోరాడు. నాగులు మరుత్తుని రాజ్యంలో అశాంతికి తానే కారణమని దేవేంద్రుడు చెప్పాడు. మరుత్తు తల్లి వైశాలి నాగులకు ఇచ్చిన మాటను కట్టుబడక శత్రువులనుండి నాగులను రక్షించడానికి మరుత్తుని వారిలోకానికి ఆమె పంపలేదని, అందుకుగాను నాగులు తన్నశ్రయించారని, పైగా తనకు అడ్డుచెప్పి యాగనిర్వహణనను ఉపద్రష్టగా (యాగ నిర్వాహకుడి) సంవర్తుని నియమించి యాగనిర్వహణ మరుత్తు తలపెట్టాడని, ఇదే అవకాశంగా నేనే నాగులను మీ రాజ్యంపైకి ఉసిగొల్పానని చెప్పాడు.


అంతేకాకుండా చనిపోయిన ముని, జనాలను, నాగులను బ్రతికించినాడు. ఇద్దరు యుద్ధం ఆపి శాంతించాలని కోరాడు.


తండ్రికొడుకులు యుద్ధం ఆపి శాంతించారు. ఇంద్రుడు మరుత్తుని మిత్రుడిగా అక్కున చేర్చుకొని, శత్రువులనుండి నాగులను కాపాడటానికి దివ్యాయుధాలు ఇచ్చాడు.


*చిన్నప్రశ్న.*

*శ్రీకృష్ణదేవరాయలంతటివాడినే అడవి దున్ననుండి యోధుడొకడు రక్షించాడు. ఆ యోధుడి పేరేమైనా మీకు తెలిస్తే చెప్పండి.*


*॥శుభమ్॥*


॥సేకరణ॥

..................................................................................................................జిబి.విశ్వనాథ, Deputy Co॥ector (Rtd) గోరంట్ల, అనంతపురం జిల్లా.944 1245857.

కామెంట్‌లు లేవు: