*26.10.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదునెనిమిదవ అధ్యాయము*
*వానప్రస్థ - సన్న్యాసాశ్రమముల ధర్మములు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*18.40 (నలుబదియవ శ్లోకము)*
*యస్త్వసంయతషడ్వర్గః ప్రచండేంద్రియసారథిః|*
*జ్ఞానవైరాగ్యరహితస్త్రిదండముపజీవతి॥12952॥*
*18.41 (నలుబది ఒకటవ శ్లోకము)*
*సురానాత్మానమాత్మస్థం నిహ్నుతే మాం చ ధర్మహా|*
*అవిపక్వకషాయోఽస్మాదముష్మాచ్చ విహీయతే॥12953॥*
పంచేంద్రియముల మీదనూ, మనస్సుపైనను అదుపులేనివానిని ఇంద్రియములనెడి గుర్రములు, బుద్ధియనెడి సారథి అపమార్గమును పట్టించును. అతనిలో జ్ఞానముగాని, వైరాగ్యముగాని మచ్చునకైనను ఉండవు. అతడు ఉదరపోషణార్థమై దండ, కమండలమును, కాషాయంబరములను గలిగి, సన్న్యాసి వేషమును ధరించినను అతడు సన్న్యాసధర్మములనే గాక ఇతర ఆశ్రమ ధర్మములను కించపఱచువాడును, హృదయములో ఆత్మరూపముననున్న నన్నును మోసగించునట్టివాడును అగును. కేవలము సన్న్యాసివేషము వేసికొనినంత మాత్రమున వానికి విషయవాసనలు ఏమాత్రమూ నశింపవు. అట్టివానికి ఇహలోకమునందును, పరలోకమునందును సుఖము ఉండదు. అనగా ఉభయభ్రష్టుడగును.
*18.43 (నలుబది శ్లోకము)*
*భిక్షోర్ధర్మః శమోఽహింసా తప ఈక్షా వనౌకసః|*
*గృహిణో భూతరక్షేజ్యా ద్విజస్యాచార్యసేవనమ్॥12954॥*
జితేంద్రియత్వము, అహింస (సకల ప్రాణులయెడ ఎట్టి ద్రోహచింతయు లేకుండుట) అనునవి సన్న్యాసియొక్క పరమధర్మములు. కాయ క్లేశములకు ఓర్చుకొనుచు తత్త్వచింతన చేయుట, భగవద్భక్తి భావము కలిగియుండుట వానప్రస్థుని ధర్మములు. సకలప్రాణులను దయతో రక్షించుట,ఆచార్యుని చక్కని భక్తిశ్రద్ధలతో సేవించుట బ్రహ్మచారి యొక్క ధర్మము.
*18.43 (నలుబది మూడవ శ్లోకము)*
*బ్రహ్మచర్యం తపః శౌచం సంతోషో భూతసౌహృదమ్|*
*గృహస్థస్యాప్యృతౌ గంతుః సర్వేషాం మదుపాసనమ్॥12955॥*
గృహస్థునకు బ్రహ్మచర్యము (ఋతుకాలమునందే ధర్మపత్నితో సంగమించుట), తపస్సు (కాయక్లేశములకు ఓర్చుకొనుట), శౌచము (బాహ్యభ్యంతర శుచిత్వము), సంతోషము (సంగ్రహబుద్ధి లేకుండా లభించినదానితో తృప్తిచెందుట), సకలప్రాణులయెడ ప్రేమభావమును కలిగియుండుట అనునవి ముఖ్యధర్మములు. అన్ని ఆశ్రమముల వారికిని నన్ను (భగవంతుని) ఉపాసించుటయే పరమధర్మము.
*18.44 (నలుబది నాలుగవ శ్లోకము)*
*ఇతి మాం యః స్వధర్మేణ భజేన్నిత్యమనన్యభాక్|*
*సర్వభూతేషు మద్భావో మద్భక్తిం విందతే దృఢామ్॥12956॥*
చతురాశ్రమములవారును స్వధర్మములను ఆచరించుచు, ఇతర లౌకిక ప్రయోజనములను ఆశింపకుండా నన్ను భజించు చుండవలెను. సకల ప్రాణులయందును పరమాత్మ భావమును కలిగియుండవలెను. అప్పుడు వారికి నా యందు దృఢమైన భక్తి కుదురుకొనును.
*18.45 (నలుబది ఐదవ శ్లోకము)*
*భక్త్యోద్ధవానపాయిన్యా సర్వలోకమహేశ్వరమ్|*
*సర్వోత్పత్త్యప్యయం బ్రహ్మ కారణం మోపయాతి సః॥12957॥*
ఓ ఉద్ధవా! నేను సృష్టి, స్థితి, లయములకు కారణమైన పరబ్రహ్మను, సకలలోక మహేశ్వరుడను, నన్ను అనన్యభక్తితో సేవించినవారు నన్నే పొందుదురు.
*18.46 (నలుబది ఆరవ శ్లోకము)*
*ఇతి స్వధర్మనిర్ణిక్తసత్త్వో నిర్జ్ఞాతమద్గతిః|*
*జ్ఞానవిజ్ఞానసంపన్నో న చిరాత్సముపైతి మామ్॥12958॥*
తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుట వలన పరిపూర్ణమైన అంతఃకరణశుద్ధి ఏర్పడును. తద్ద్వారా నా ఐశ్వర్యమును - నా స్వరూపమును తెలిసికొనును. అంతట జ్ఞాన-విజ్ఞాములతో సంపన్నుడైన ఆ భక్తుడు శీఘ్రముగ నన్ను పొందును.
*18.47 (నలుబది ఏడవ శ్లోకము)*
*వర్ణాశ్రమవతాం ధర్మ ఏష ఆచారలక్షణః|*
*స ఏవ మద్భక్తియుతో నిఃశ్రేయసకరః పరః॥12959॥*
ఉద్ధవా! ఇంతవఱకును నేను నీకు వర్ణాశ్రమ ధర్మములను, వాటి ఆచారలక్షణములను గూర్చి తెలిపితిని. నాయందు దృఢమైన భక్తిగలగి ఈ ధర్మములను ఆచరించినచో, మానవుడు అవలీలగా పరమశ్రేయస్కరమైన మోక్షమును పొందును.
*18.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*
*ఏతత్తేఽభిహితం సాధో భవాన్ పృచ్ఛతి యచ్చ మామ్|*
*యథా స్వధర్మసంయుక్తో భక్తో మాం సమియాత్పరమ్॥12960॥*
సాధుపురుషా! నీవడిగిన ప్రశ్నలకు సమాధానముగా 'భక్తుడు స్వధర్మపాలనము గావించుచు, పరబ్రహ్మస్వరూపుడనైన నన్ను ఏవిధముగా చేరుకొనునో అను దానిని వివరించితిని.
*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే అష్టాదశోఽధ్యాయః (18)*
ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *వానప్రస్థ - సన్న్యాసాశ్రమముల ధర్మములు* అను పదునెనిమిదవ అధ్యాయము (18)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి