26, అక్టోబర్ 2021, మంగళవారం

సంస్కృత మహాభాగవతం*

 *26.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పందొమ్మిదవ అధ్యాయము*


*జ్ఞాన-భక్తి-యమనియమాది సాధనముల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీభగవానువాచ*


*19.1 (ప్రథమ శ్లోకము)*


*యో విద్యాశ్రుతసంపన్నః ఆత్మవాన్ నానుమానికః|*


*మాయామాత్రమిదం జ్ఞాత్వా జ్ఞానం చ మయి సన్న్యసేత్॥12961॥*


*శ్రీభగవానుడు నుడివెను* ఉద్ధవా! ఉపనిషత్తులు మొదలగు శాస్త్రములయొక్క శ్రవణ, మనన, నిదిధ్యాసనముల ద్వారా జ్ఞానసంపన్నుడు, శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, ఆత్మసాక్షాత్కారమును పొందినవాడు ఐన యోగికి 'ఈ జగత్తంతయును భగవన్మాయ' యని తెలియును. అట్టివాడు ఆ జ్ఞానమును నాయందే సమర్పించును. అనగా నన్ను జ్ఞానస్వరూపునిగా భావించును.


*19.2 (రెండవ శ్లోకము)*


*జ్ఞానినస్త్వహమేవేష్టః స్వార్థో హేతుశ్చ సమ్మతః|*


*స్వర్గశ్చైవాపవర్గశ్చ నాన్యోఽర్థో మదృతే ప్రియః॥12962॥* 


అట్టి జ్ఞానికి నేనే అత్యంత ఇష్టుడను. ప్యాప్యుడను, తదుపాయమును నేనే, స్వర్గము, అపసర్గము (మోక్షము) నేనే. నేను తప్ప అతనికి ఈ విశ్వమునందు ప్రియమైన పదార్థము మరి ఏదియును లేదు.


*19.3 (మూడవ శ్లోకము)*


*జ్ఞానవిజ్ఞానసంసిద్ధాః పదం శ్రేష్ఠం విదుర్మమ|*


*జ్ఞానీ ప్రియతమోఽతో మే జ్ఞానేనాసౌ బిభర్తి మామ్॥12963॥*


జ్ఞానవిజ్ఞానములతో సంపన్నుడైన సిద్ధపురుషుడు నా యొక్క సర్వాతిశాయియగు వాస్తవిక స్వరూపమును ఎరుగును. అట్టి జ్ఞాని తన జ్ఞానముద్వారా నిరంతరము అంతఃకరణమునందు నన్నే ధారణ చేయును. ఉద్ధవా! అట్టి జ్ఞాని నాకు అత్యంత ప్రియతముడు.


*19.4 (నాలుగవ శ్లోకము)*


*తపస్తీర్థం జపో దానం పవిత్రాణీతరాణి చ|*


*నాలం కుర్వంతి తాం సిద్ధిం యా జ్ఞానకలయా కృతా॥12964॥*


పరమాత్మజ్ఞానముయొక్క ఒక అంశతో లభించు సిద్ధికి సమానముగ తపశ్చర్యలు, తీర్థసేవలు, జపములు, దానములు, ఇంకను పవిత్రకార్యములు మొదలగువాని వలన ప్రాప్తించెడి సిద్ధులెవ్వియును సాటిరావు.


*19.5 (ఐదవ శ్లోకము)*


*తస్మాజ్జ్ఞానేన సహితం జ్ఞాత్వా స్వాత్మానముద్ధవ|*


*జ్ఞానవిజ్ఞానసంపన్నో భజ మాం భక్తిభావతః॥12965॥*


కనుక, ఉద్ధవా! జ్ఞానసహితముగా నీ ఆత్మస్వరూపమును ఎరుంగుము. జ్ఞానవిజ్ఞానసంపన్నుడవై భక్తిభావముతో నన్ను భజింపుము.


*19.6 (ఆరవ శ్లోకము)*


*జ్ఞానవిజ్ఞానయజ్ఞేన మామిష్ట్వాఽఽత్మానమాత్మని|*


*సర్వయజ్ఞపతిం మాం వై సంసిద్ధిం మునయోఽగమన్॥12966॥*


మహామునులు సర్వయజ్ఞ స్వరూపుడను, తమ అంతఃకరణములయందు నిలిచిన నన్ను జ్ఞానవిజ్ఞానయజ్ఞములద్వారా ఆరాధించి, పరమసిద్ధిని పొందిరి.


*19.7 (ఏడవ శ్లోకము)*


*త్వయ్యుద్ధవాశ్రయతి యస్త్రివిధో వికారో మాయాంతరాఽఽపతతి నాద్యపవర్గయోర్యత్|*


*జన్మాదయోఽస్య యదమీ తవ తస్య కిం స్యురాద్యంతయోర్యదసతోఽస్తి తదేవ మధ్యే॥12967॥*


ఉద్ధవా! దేహేంద్రియ అంతఃకరణములతోగూడిన ఈ శరీరము త్రిగుణాత్మకమైన ప్రకృతియొక్క వికారరూపము. అజ్ఞానకారణముగా దీనిని నీవు ఆశ్రయించితివి. నీ ఆత్మస్వరూము మాయచే ఆవృతమై ఉన్నది. ఈ శరీరము జన్మకు ముందుగాగాని, మరణానంతరముగాని అవ్యక్తమే. కేవలము మధ్యకాలములో మాయాకారణమున ప్రతీతమగుచున్నది. జన్మాది షడ్వికారములు ఈ శరీరమునకు సంబంధించినవి. ఇది (నశ్వరమైన ఈ శరీరము) ఆద్యంతములయందును, మధ్యకాలమునందును అనిత్యమే. దీనితో నీకు ఎట్టి సంబంధమూలేదు.


*ఉద్ధవ ఉవాచ*


*19.8 (ఎనిమిదవ శ్లోకము)*


*జ్ఞానం విశుద్ధం విపులం యథైతద్వైరాగ్యవిజ్ఞానయుతం పురాణమ్||*


*ఆఖ్యాహి విశ్వేశ్వర విశ్వమూర్తే త్వద్భక్తియోగం చ మహద్విమృగ్యమ్॥12968॥*


*ఉద్ధవుడు పలికెను* విశ్వేశ్వరా! నీవు విరాట్ పురుషుడవు. నీవు వివరించిన జ్ఞానయోగము విశుద్ధము, విపులము. ఇది ఉపదేశపరంపరాప్రాప్తము, వైరాగ్యవిజ్ఞానయుతము. ఇప్పుడు దయతో భక్తియోగమును గూర్చి విశదీకరింపుము. పరమగోప్యమైన ఈ భక్తియోగమును బ్రహ్మాదిదేవతలుగూడ అన్వేషించుచుందురు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: