మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*సూర్యోపాసకుడు..*
"ఈ క్షేత్రం లో ఒక వారం పాటు ఉండాలని వచ్చాము..మా ఉపాసనకు ఇదే సరైన ప్రదేశమని మాకు ఆ సూర్యభగవానుడి నుంచి ఆదేశం వచ్చింది..మీరు మాకోసం ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లూ చేయనవసరం లేదు..మా అవసరాలు మేము తీర్చుకోగలం.." అన్నారాయన..
కాషాయ వస్త్రాలు ..పొడవాటి గడ్డం..శిరస్సుపై ముడి వేసిన జుత్తు..అరవై ఏళ్ల పైబడిన వయసు..ఇదీ వారి రూపం..చూడగానే ఒక సాధువు అనే భావం కలుగుతుంది..ఆయన కళ్ళు మాత్రం మిల మిలా మెరుస్తున్నాయి..ఆ ముఖం లో కళ్లదే ప్రత్యేక ఆకర్షణ..వారి చూపు చాలా తీక్షణంగా ఉంది..నేనూ కుతూహలం ఆపుకోలేక పోయాను..
"స్వామీ..మీరెక్కడినుంచి వస్తున్నారు?..మీ పేరేమిటి?.." అని అడిగాను..
"మాది ఒక ప్రాంతం అని చెప్పలేను..సూర్యోపాసన చేస్తుంటాను..కొన్నాళ్ల పాటు ఈ క్షేత్రం లో ఉండి.. ఉపాసన చేసుకోవాలని సంకల్పం కలిగింది..అందుకు ఆ ప్రత్యక్ష నారాయణుడి అనుగ్రహం కూడా కలిగింది..ఇది కూడా ఒక సాధకుడి తపో భూమి కదా? ఇక్కడ కూడా సాధన చేయాలని అనిపించింది.. వచ్చాను..ఒక చోట స్థిరంగా ఉండలేను..అందుకనే మా ఊరు ఫలానా అని చెప్పలేదు..ఎన్నో క్షేత్రాల్లో ఈ రకంగా నా ఉపాసనను అందరికీ చూపించాను.."అన్నారు..
ఆ మాటల్లో "నేను చాలా గొప్పవాడిని సుమా!.."అనే అహం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది..
వారి ఉపాసనా పద్దతి చాలా చిత్రంగా ఉండేది..ఉదయం ఎనిమిది గంటల నుండి..మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సూర్యునికి అభిముఖంగా నిలబడి..నేరుగా సూర్యుడిని చూస్తూ వుండేవారు..అలా చూడటం మనబోటి వాళ్లకు సాధ్యపడదు..సూర్యుని నుంచి వచ్చే ఆ కాంతి కిరణాలను ఎటువంటి ఆచ్ఛాదనా లేకుండా..కంటితో చూడలేము..కానీ..ఆయన దాదాపు ఐదు గంటల సేపు..అలానే చూస్తూ వుండేవారు..ఆ సమయం లో ఆ కళ్ళలో తెల్లటి పొర అడ్డం వున్నట్లుగా ఉండేది..ఇటువంటి ఉపాసన కానీ..సాధన గురించి కానీ నేనెక్కడా విని వుండలేదు..చూసి కూడా వుండలేదు..
అలా చూడటం అయిపోయిన తరువాత.."చూసారా..నేను చేస్తున్న ఈ ఉపాసన!..ఇది అందరికీ సాధ్యం కాదు..మా గురువుగారు కూడా తన వల్ల కూడా సాధ్యపడదు అని చెప్పారు..నన్ను చూసి..మీరు అనుకరించొద్దు..కళ్ళకు ప్రమాదం..జాగ్రత్త!.."అన్నారు..
ఆరోజు ఆదివారం కూడా..తన సాధన ముగించుకొని వచ్చి.."నాయనా..శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకుంటాను.." అన్నారు..సరే అన్నాను..
ముందుగా శ్రీ స్వామివారి సమాధి గది ద్వారం వద్ద నిలబడి కళ్ళుమూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసుకున్నారు..ఆ తరువాత..లోపలికి ప్రవేశించి..శ్రీ స్వామివారి సమాధికి మూడు ప్రదక్షిణాలు చేసి..శ్రీ స్వామివారి పాదుకలను తాకి నమస్కారం చేసుకున్నారు..ఆ పాదుకలను నెత్తి మీద పెట్టుకోబోయి..ఒక్కసారిగా ఆగిపోయి..వాటిని యధాస్థానంలో ఉంచి..మోకాళ్ళ మీద కూర్చుని..వంగి..ఆ పాదుకులకు తన శిరస్సు ఆనించి ..అలానే ఓ పది నిమిషాలు ఉండిపోయారు..వెంటనే లేచి..గబ గబా సమాధి మందిరం లోనుంచి బైటకు వచ్చారు..ఆయన కళ్ల నుంచి ధారాపాతంగా అశ్రువులు కారిపోతున్నాయి..
"స్వామీ..నేను అహంకారంతో ఇన్నాళ్లూ ప్రవర్తించాను..నన్ను క్షమించు..నా ఉపాసనా..సాధనా..అన్నీ ప్రదర్శన కోసం వినియోగించాను..పొట్టకూటి కోసం ఈ విద్యను ఉపయోగించుకున్నాను..నన్ను మన్నించు.." అని పరి పరి విధాల విలపించడం మొదలుపెట్టారు..
కొద్దిసేపటి తరువాత నా దగ్గరకు వచ్చారు.."ఖర్చులకు ఉంచండి!" అని ఒక వేయి రూపాయలు తీసి ఆయన చేతిలో పెట్టాను..మొహమాటపడుతూనే..ఆ డబ్బు తీసుకొని..గది ఖాళీ చేసి వెళ్లిపోయారు..ఆ తరువాత ఆయన గురించి ఎటువంటి వార్తా మాకు అందలేదు..
సమాధి లోపల ఉన్న శ్రీ స్వామివారు..ఏ బోధ చేసారో తెలీదు..నా అంతటి వాడు లేడు అని విర్రవీగిన ఆయన అహంకారాన్ని క్షణాల్లో అణచి..గురువు పాదాలు పట్టుకునేలా చేసారు..
సర్వం..
శ్రీ దత్తకృప.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి