*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*475వ నామ మంత్రము* 26.10.2021
*ఓం విశుద్ధిచక్రనిలయాయై నమః*
కంఠమునందు తెల్లని రంగుగల పదహారుదళాల పద్మమందు వజ్రేశ్వరియను చక్రాధిష్ఠానదేవతా స్వరూపంలో విలసిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *విశుద్ధిచక్రనిలయా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం విశుద్ధిచక్రనిలయాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ పరమేశ్వరి కరుణచే సాధకునికి చక్కని వాక్పటిమ, పలువురిని ఆకట్టుకొనే నేర్పరితనము, అంతకు మించి తనయొక్క వృత్తి లేదా ఉద్యోగ కార్యక్రమములందు నేర్పరితనముగలిగి కీర్తిప్రతిష్టలతోబాటు, ధనధాన్యసంపదలను కూడా సంప్రాప్తింపజేసికొనగలుగును.
మన శరీరంలో షట్చక్రములు అన్నవి. యోగ సాధనచేసేవారికి తప్ప సాధారణమైనవారికి సరిగా అవి అలాంటివి అర్ధంకావు అని. అది నిజమే సుమా, అందులో తప్పులేదు కదా.
మన శరీరంలో షట్చక్రములు ఉన్నవి. ఏడవది అయిన సహస్రారంకూడా గలదు. ఈ విషయం యోగసాధన చేయువారికి వివరంగా తెలుస్తుంది. సాధన చేసేవారు ఆ చక్రాలను అనుభవించగలరు. ఆ చక్రాల పేర్లెేంటో అవి ఎక్కడ ఉంటాయో తెలుసుకొందాం.
*మూలాధారం గుదస్థానం, స్వాదిస్ఠానం తు మేహనం నాభిస్థు మణిపూరాఖ్యాం, హృదయాబ్జ మనాహతం తాలుమూలం విశుద్దాఖ్యం, ఆఙ్ఞాఖ్యం నిటలాంబుజం సహస్రారాం బ్రహ్మరంధ్ర ఇత్యాగమ విదోవిదుః*
వీటిని ఊర్ద్వలోక సప్తకమంటారు.
7. సహస్రారం -- సత్యలోకం -- పరమాత్మస్థానం
6. ఆజ్ఞాచక్రం -- తపోలోకం -- జీవాత్మస్థానం
5. విశుద్దం -- జనలోకం -- ఆకాశభూతస్థానం
4. అనాహతం -- ముహర్లోకం -- వాయుభూతస్థానం
3. మణిపూరకం -- సువర్లోకం -- అగ్నిభూతస్థానం
2. స్వాదిష్ఠానం -- భువర్లోకం -- జలభూతస్థానం
1. మూలాధారం -- భూలోకం -- పృథ్వీభూతస్థానం
*మూలాధారం:* మలరంధ్రానికి రెండు అంగుళాల పై భాగంలో ఉంటుంది. దీనిరంగు ఎర్రగా రక్తవర్ణంలో ఉంటుంది. నాలుగు రేకులుగల తామరపువ్వు ఆకారంలో ఉంటుంది. ఈ చక్రానికి అధిపతి గణపతి, వాహనం ఏనుగు.
*స్వాధిష్టానం* : ఇది జననేంద్రియం వెనుక భాగాన, వెన్నుముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మ, తత్వం జలం. సింధూరవర్ణంలో ఉంటుంది, ఆరు రేకుల పద్మాకారంలో ఉంటుంది. వాహనం మకరం.
*మణిపూరకం*: బొడ్డునకు మూలంలో వెన్నుముకయందు ఉంటుంది. అధిపతి విష్ణువు, పది రేకుల పద్మాకారంలో, బంగారు వర్ణంలో ఉంటుంది, వాహనం కప్ప.
*అనాహత చక్రం :* హృదయం వెనుక వెన్నుముకలో ఉంటుంది. అధిదేవత రుద్రుడు, పండ్రెండు రేకుల తామరపువ్వు వలె నీలం రంగులో ఉంటుంది. తత్వం వాయువు, వాహనం లేడి.
*విశుద్ధిచక్రం :* కంఠం యొక్క ముడియందు ఉంటుంది. అధిపతి జీవుడు, నలుపురంగులో ఉంటుంది. తత్వం ఆకాశం, వాహనం ఏనుగు.
*ఆఙ్ఞాచక్రం :* రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. అధిపతి ఈశ్వరుడు, రెండుదళాలు గల పద్మాకారంలో, తెలుపు వర్ణంలో ఉంటుంది.
*సహస్రారం :* కపాలం పై భాగంలో, మనం మాడు అని పిలిచేచోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రం అంటారు. అధిపతి పరమేశ్వరుడు, వేయిరేకుల పద్మాకృతిలో ఉంటుంది. సుషుమ్నా నాడి పై కొన మీద ఈ చక్రం ఉంటుంది. దీనికి ఫలం ముక్తి.
కంఠమందున్న విశుద్ధిచక్రకర్ణికయే పరమేశ్వరి నివాసస్థానమై విలసిల్లుచున్నది గనుకనే ఆ తల్లి *విశుద్ధిచక్రనిలయా* యని అనబడినది.
విశుద్ధిచక్రము నుండి సప్తచక్రములందును డాకినీ, రాకినీ, లాకినీ, కాకినీ, సాకినీ, హాకినీ, యాకినీ అనుపేర్లుగల ఏడుగురు యోగినీ దేవతలు అధిష్ఠానదేవతలై యుండిరి.
ఇక్కడ (విశుద్ధిచక్రము) ప్రారంభముగా చెప్పుటకు కారణము డాకిన్యాది యోగినుల క్రమము అనుసరించుటకు అని చెప్పబడినది. సప్తచక్రములు, ఆ చక్రాధిష్ఠాన యోగినీ దేవతలకు సంబంధించిన నామ మంత్రములు లలితా సహస్రంలో క్రిందిక్రమంలో ఈయబడినవి.
475వ నామ మంత్రము - *విశుద్ధి చక్రనిలయా*
484వ నామ మంత్రము - *డాకినీశ్వరీ*
485వ నామ మంత్రము - *అనాహతాబ్జనిలయా*
484వ నామ మంత్రము - *రాకిన్యంబా*
495వ నామ మంత్రము - *మణిపూరాబ్జనిలయా*
503వ నామ మంత్రము - *లాకిన్యంబా*
504వ నామ మంత్రము - *స్వాధిష్ఠానాంబుజగతా*
513వ నామ మంత్రము - *కాకినీరూపధారిణీ*
514వ నామ మంత్రము - *మూలాధారాంబుజారూఢా*
520వ నామ మంత్రము - *సాకిన్యంబాస్వరూపిణీ*
521వ నామ మంత్రము - *ఆజ్ఞాచక్రాబ్జనిలయా*
527వ నామ మంత్రము - *హాకినీరూపధారిణీ*
528వ నామ మంత్రము - *సహస్రదళపద్మస్థా*
534వ నామ మంత్రము - *యాకిన్యంబాస్వరూపిణీ*
అమ్మవారు ఆయా చక్రములకు సంబంధించిన పద్మములయందు ఆయా యోగినీరూపములలో విలసిల్లుతున్నదని పైన చెప్పిన నామమంత్రములద్వారా తెలియుచున్నదని మనవి.
విశుద్ధి చక్రమందుగల డాకినీ యోగినీధ్యానము ఈ విధంగా వర్ణింపబడినది:- *కంఠమందు పదునారుదళములుగల పద్మముగలదు. దానికి విశుద్ధిచక్రమనిపేరు. ఆ పద్మముయొక్క కర్ణికయందు పాటలవర్ణముతో, మూడునేత్రములుగలది, చతుర్బాహువులందును క్రమముగా ఖట్వాంగము (మంచపుకోడు), ఖడ్గము, త్రిశూలము, మహాచర్మము అను నాలుగింటిని ధరించునదియు, ఒక్క ముఖము గలిగినదియు, అజ్ఞానులగువారికి భయమును గలిగించునదియు, పరమాన్నమునందాసక్తియు గలదియు, చర్మధాతువునందు చైతన్య రూపముగా ఉండునదియు, చుట్టూ అమృతాది శక్తులచే ఆవరింపబడినదియు, ఉపాసకులచే నమస్కరింపదగినదియు అగు డాకినీదేవికి నమస్కరిస్తున్నాను*. ఈ డాకినీస్వరూపిణియే పరమేశ్వరి. అటువంటి పరమేశ్వరి డాకినీస్వరూపిణిగా విశుద్ధిచక్రమునందు ఉండుటచే అమ్మవారు *విశుద్ధిచక్రనిలయా* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం విశుద్ధిచక్రనిలయాయై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి