ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం
(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన,
"శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం"
అనే పత్రంలోని ఒక అంశం)
-----------------------
5. పరిపాలనా విధానం
ప్రజలకి చక్కని పరిపాలన అందించాలంటే పాలకులకు ఉండవలసిన ముఖ్య లక్షణాలు తెలిసికోవలసిన అవుసరం ఎంతైనా ఉంది.
రాజదోషాలుగా పరిపాలకునకు ఉండకూడని పదునాలుగు లక్షణాలు,
సమయంతో కూడిన ఆధారమూ,
చర్చలూ,
నివేదికలూ,
మానవ వనరులూ,
నేరాలూ - శిక్షలూ,
సామాజిక సమానతా అనే ప్రధాన విషయాలతోపాటు అనేకం శ్రీమద్రామాయణంలో పరిపాలనా సంబంధ విషయాల ద్వారా తెలుస్తాయి.
పదునాలుగు రాజదోషాలు
* నాస్తికత్వము,
* అబద్ధమాడడం,
* క్రోధం,
* ఏమరుపాటు,
* కర్తవ్యాన్ని ఉపేక్షిస్తూ కాలయాపన,
* జ్ఞానులను దర్శించకుడడం,
* సోమరితనం,
* పంచేద్రియాలకు వశుడవడం,
* రాచకార్యాలపై మంత్రులతో చర్చించక తానొక్కడే ఆలోచించడం,
* విషయాలపై అవగాహన లేనివారితో సమాలోచన,
* నిశ్చయించిన పనులను వెంటనే ప్రారంభించకుండుట,
* రహస్యాలను దాచకుండడం,
* మంగళకరమైన ఆచారాలను పాటించకపోవటం,
* పెక్కుమంది శత్రువులపై ఒకే సమయంలో దండెత్తడం
- అనే పదునాలుగు రాజదోషాలనీ పరిత్యజించాలని శ్రీరాముడు భరతునికి ఉపదేశించాడు.
ఆధారం - సమయం
* ధర్మాచరణానికీ,
* అర్థార్జనకూ,
* కామానుభవాలకూ సముచిత సమయాలను విభజించుకొని,
తగిన సమయాలలో ధర్మార్థకామాలను నడుపుతున్నావా?
- అని భరతుని అడుగుతున్నట్లుగా సందేశమిస్తాడు శ్రీరాముడు.
- ధర్మము చేత అర్థమునుగానీ,
- అర్థముచేత ధర్మమునుగానీ,
- అధిక సుఖాసక్తుడై - కామముచేత ధర్మార్థములనుగానీ బాధించరాదని కూడా ఆ సమయంలోనే సందేశమిస్తాడు.
చర్చలు
రహస్య లోచనలని
- ఒక్కడే ఆలోచించకూడదనీ,
- పెక్కుమందితో కూడా మంత్రాంగం నడుపకూడదనీ చెప్పబడింది.
రాజనీతి శాస్త్రాన్ని అనుసరించి ముగ్గురు లేక నలుగురు మంత్రులతో
- విడివిడిగా గానీ లేక
- అందఱితో కలసి గానీ రహస్య సమాలోచనలని చేస్తూండాలనీ,
రహస్య చర్చలు రాజ్యాన్ని దాటి పోకూడదనీ రామాయణం సూచిస్తుంది.
నివేదికలు
* విధులు బాగా ఎఱిగినవారూ,
* ప్రతిభాశాలురూ,
* ఋజువర్తనులు అయినవారూ,
కార్యాలని నిర్వహింపచేయడానికి నియుక్తులై,
- చేయబడిన కార్యాలనుగూర్చీ,
- చేయవలసిన కార్యాలనుగూర్చీ,
ఎప్పటికప్పుడు పరిపాలకునికి నివేదించాలని చెప్పబడింది.
మానవ వనరులు
- ఉన్నతశ్రేణి ఆలోచనకి చెందినవారిని గొప్ప కార్యాలకూ,
- మధ్యస్థాయికి చెందిన వారిని సామాన్య కార్యాలయందునూ,
- నిమ్నస్థాయి ఆలోచనాపరులను అథమ/స్వల్ప కార్యాలయందునూ నియమించాలని తెలుపబడింది.
నేరాలూ - శిక్షలూ - సమాన న్యాయం
శ్రీమద్రామాయణం "నేరాలూ - శిక్షలూ - సమాన న్యాయం" అనే అంశాలపై స్పష్టంగా నిర్వచించింది. వాటిలో కొన్ని తెలపబడుతున్నాయి.
అ) నిర్దోషులు అసత్యాలైన నేరారోపణలకు గుఱైనప్పుడు, రాజు వాస్తవాలను తెలిసికోకుండా, "తనకు తిరుగులేద"ని తన ఇష్టంవచ్చినట్లు ఆ నిరపరాధులను శిక్షించరాదు.
ఆ) సజ్జనులు, ఉత్తమస్వభావులు త్రికరణశుద్ధికలవారు,
దొంగతనం వంటి నేరారోపణలకు గురైనప్పుడు,
న్యాయశాస్త్ర నిపుణులచేత లోతుగా విచారణ చేయించకుండానే లోభంతో వారికి శిక్షలు విధించకూడదు.
ఇ) దీనికి విరుద్ధంగా దొంగతనం చేసే సమయాన చూడబడి, చౌర్యం చేసి పట్టుబడేవారూ,
అధికారులు ప్రశ్నించినప్పుడు దొరికిపోయినవారూ,
దొంగిలించిన ధనంతో చిక్కినవారూ,
ఇలా అనేక కారణాలచే నేరాలు ఋజువైనా,
అట్టి చోరులని ధనలోభంచే విడిచిపెట్టకూడదు.
ఈ) ధనవంతుని విషయంలో గానీ, నిర్ధనుని విషయంలో గానీ, ఏదైనా ఒక వివాదం ఏర్పడినప్పుడు,
న్యాయశాస్త్ర నిపుణులు ధనలోభంతో గానీ, పక్షపాత బుద్ధితో గానీ వ్యవహరించకూడదు.
శ్రీమద్వాల్మీకి రామాయణంలో పరిపాలనా విషయమై ప్రస్తావించబడిన ముఖ్యమైన ఎన్నో విషయాలలో కొన్ని మనం ఇంతవరకూ పరిశీలించాం.
తద్వారా ఆదర్శ పరిపాలన వలన ప్రజలు సంపదలతో తులతూగుతూ, సుఖశాంతులతో ఆనందంతో న్యాయబద్ధంగా, ధర్మంతో జీవించే సమాజం మనకి కనిపిస్తుంది.
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి