6, అక్టోబర్ 2021, బుధవారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

 *6.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పండ్రెండవ అధ్యాయము*


*సత్సంగముయొక్క మహాత్మ్యము - కర్మవిధి - కర్మత్యాగవిధి*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీభగవానువాచ*


*12.1 (ప్రథమ శ్లోకము)*


*న రోధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఏవ చ|*


*న స్వాధ్యాయస్తపస్త్యాగో నేష్టాపూర్తం న దక్షిణా॥12663॥*


*12.2 (రెండవ శ్లోకము)*


*వ్రతాని యజ్ఞశ్ఛాందాంసి తీర్థాని నియమా యమాః|*


*యథావరుంధే సత్సంగః సర్వసంగాపహో హి మామ్॥12664॥*


*శ్రీభగవానుడు నుడివెను* ఉద్ధవా! వర్ణాశ్రమోచిత కర్మయోగములు, ప్రాణాయామయోగము, ప్రకృతి పురుషులకు సంబంధించిన సాంఖ్యయోగము, అహింసాది ధర్మములు, వేదాధ్యయనము, అనశనాది (ఉపవాసాది) తపశ్చర్యలు, దానధర్మములు, యాగాదివైదిక కర్మలు, వాపీ, కూప, తటాకాది నిర్మాణములు, యజ్ఞయాగాదుల పరిసమాప్తియందు ఇయ్యబడు సాద్గుణ్య దక్షిణలు *(హతో యజ్ఞస్త్వదక్షిణః - సాద్గుణ్య దక్షిణలు లేని యజ్ఞము యజ్ఞమే కాదు -నీతి శాస్త్రము)*, ఏకాదశి - ఉపవాసాది వ్రతములు, పంచమహా యజ్ఞములు (1. బ్రహ్మయజ్ఞము - అధ్యాపనము, 2. పితృయజ్ఞము - తర్పణము, 3. దేవయజ్ఞము - హోమము, 4. భూతయజ్ఞము - బలి 5. నృయజ్ఞము - అతిథిపూజ మరియు 1.. మాతాపితృభక్తి, 2. పాత్రివత్యము, 3. సమత, 4. మిత్రులను ద్వేషించకుండుట, 5. విష్ణుభక్తి - అనునవి పంచామహా యజ్ఞములు), గోప్యములగు మంత్రములు, గంగాది తీర్థముల యందలి పవిత్రస్నానములు, శౌచ-అశౌచ-ఆచమనాది నియమములు, బాహ్యాభ్యంతర మనోనిగ్రహాదులు మొదలగునవి ఎవ్వియును సత్సంగముతో సాటిరావు. ఏలయన సత్సంగము సకల లౌకిక బంధములను దూరమొనర్చును. మీదుమిక్కిలి, అది తన (సాధకుని) హృదయమున నన్ను (భగవానుని) పదిలపరచుకొనుటలో ప్రముఖ సాధనము (శ్లో. *సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వమ్| నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః॥* క్రమముగా జీవన్ముక్తికి సాధనమైన సత్సంగత్వమును వర్ణించుట జగద్గురు శంకరాచార్యస్వామికే సాధ్యము)


*12.3 (మూడవ శ్లోకము)*


*సత్సంగేన హి దైతేయా యాతుధానా మృగాః ఖగాః|*


*గంధర్వాప్సరసో నాగాః సిద్ధాశ్చారణగుహ్యకాః॥12665॥*


*12.4 (నాలుగవ శ్లోకము)*


*విద్యాధరా మనుష్యేషు వైశ్యాః శూద్రాః స్త్రియోఽన్త్యజాః|*


*రజస్తమఃప్రకృతయస్తస్మింస్తస్మిన్ యుగేఽనఘ॥12666॥*


*12.5 (ఐదవ శ్లోకము)*


*బహవో మత్పదం ప్రాప్తాస్త్వాష్ట్రకాయాధవాదయః|*


*వృషపర్వా బలిర్బాణో మయశ్చాథ విభీషణః॥12667॥*


*12.6 (ఆరవ శ్లోకము)*


*సుగ్రీవో హనుమాన్ ఋక్షో గజో గృధ్రో వణిక్పథః|*


*వ్యాధః కుబ్జా వ్రజే గోప్యో యజ్ఞపత్న్యస్తథాపరే॥12668॥*


సత్సంగము యొక్క ప్రభావము అపారమైనది, నిరుపమానమైనది. ఆయా యుగములయందు సత్సంగము ద్వారా దైత్యులు, రాక్షసులు, మృగములు, పక్షులు, గంధర్వులు,అప్సరసలు, నాగులు, సిద్ధులు, చారణులు, గుహ్యకులు (యక్షులు), విద్యాధరులు మున్నగువారు నా సేవలలో తరించిరి. మానవులలో వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, నిమ్నజాతులవారు మొదలగు రజస్తమోగుణ స్వభావములు గలవారు ఈ సత్సంగముద్వారా నన్నుభజించి, నా అనుగ్రహమునకు పాత్రులైరి. అట్లే వృత్రాసురుడు, ప్రహ్లాదుడు, వృషపర్వుడు, బలిచక్రవర్తి, బాణుడు, మయుడు, విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు, జటాయువు, తులాధారుడను వైశ్యుడు, ధర్మవ్యాధుడు, కుబ్జ, వ్రజాంగనలు (గోపికలు), యజ్ఞాచరణమునందు నిమగ్నులైన బ్రాహ్మణుల యొక్క పత్నులు, ఇంకను పెక్కుమంది ఈసత్సంగముద్వారా నన్ను సేవించి కృతార్థులైరి. 


*12.7 (ఏడవ శ్లోకము)*


*తే నాధీతశ్రుతిగణా నోపాసితమహత్తమాః|*


*అవ్రతాఽతప్తతపసః సత్సంగాన్మాముపాగతాః॥12669॥*


వీరు అందరును వేదాధ్యయనపరులుగారు, మహాత్ములను ఉపాసించినవారు (మహాత్ములను ఆశ్రయించి దైవోపాసనలను ఒనర్చినవారు) కారు. ఏ విధమైన వ్రతములను, తపస్సులను ఆచరించి యుండలేదు. వీరు ఎల్లరును కేవలము సత్సంగప్రభావముననే నా కృపకు పాత్రులై పరమపదమును పొందిరి.


*12.8 (ఎనిమిదవ శ్లోకము)*


*కేవలేన హి భావేన గోప్యో గావో నగా మృగాః|*


*యేఽన్యే మూఢధియో నాగాః సిద్ధా మామీయురంజసా॥12670॥*


గోపికలు, గోవులు, యమళార్జునాది వృక్షములు, వ్రజభూమియందలి మృగములు, తమోగుణ ప్రధానులైన కాళియుడు మొదలగువారు కేవలము నన్నే ఆశ్రయించి, స్మరించి ముక్తిని పొందిరి. అట్లే కొందరు సిద్ధులు ఈ భక్తిమార్గమున నన్ను సేవించి, కృతార్థులైరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పండ్రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: