6, అక్టోబర్ 2021, బుధవారం

స్వామికిచ్చిన మాట..*

 *స్వామికిచ్చిన మాట..*


"మా తమ్ముడు వాళ్ళు వచ్చారు..పొంగలి పెట్టుకొని స్వామి దగ్గర పూజచేయించుకుంటాము"..అంటూ కందుకూరు నుండి క్రమం తప్పకుండా వచ్చే వెంకమ్మ గారు నా దగ్గరకు వచ్చి చెప్పారు...


ఆమెకు గానీ..ఆమెతో వచ్చే వారికి గానీ..మా అర్చకులు, సిబ్బంది ఎటువంటి అడ్డూ చెప్పరు...శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సిద్ధిపొందిన నాటినుండి, నేటివరకూ ఆ స్వామినే నమ్ముకుని క్రమం తప్పకుండా గుడికి వచ్చే అతి కొద్దిమంది భక్తులలో ఆవిడ ఒకరు..


మధ్యాహ్నం హారతి వేళకు, వెంకమ్మ గారి తమ్ముడు, శ్రీ లేళ్ల వెంకట శ్రీనివాసరావు , వారి భార్య పద్మావతి, వారి సంతానంతో సహా పొంగలి గిన్నె తీసుకొని పూజకు వచ్చారు..


శ్రీ శ్రీనివాసరావు గారికి, 1981 మే నెలలో వివాహం అయింది..ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు కూతుళ్లు..మగపిల్లలిద్దరికీ తరచూ ఆరోగ్యం బాగలేకుండా ఉండటం, తనకూ కడుపులో విపరీతంగా నొప్పి రావడం..జరుగుతూ ఉండేది..తనకు ఆపరేషన్ చేయక తప్పదని, ఆరోజుల్లో కందుకూరు లో ఉన్న ప్రముఖ డాక్టర్ లు తేల్చి చెప్పారు..


ఒకసారి,మొగలిచెర్ల వచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధిని దర్శించి, మొక్కుకుంటే, మంచిదని వెంకమ్మ గారు పదే పదే చెప్పడంతో, ఆమె ప్రోద్బలంతో, శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి, పిల్లల ఆరోగ్యం గురించి మ్రొక్కుకున్నారు..త్వరలోనే, పిల్లలిద్దరూ ఆ అనారోగ్యపు ఛాయల నుంచి బయట పడ్డారు!..వారి మాటల్లోనే చెప్పాలంటే.."ఆరోజునుంచి, ఈరోజు దాకా దాదాపు 35 ఏళ్ల బట్టి, పిల్లలిద్దరూ లక్షణంగా ఉన్నారండీ..ఏ అనారోగ్యమూ లేదు..వివాహాలు కూడా అయ్యాయి..


"పిల్లల ఆరోగ్యం కుదుట బడిందని, స్వామి దగ్గర పొంగలి పెట్టుకుని, నా కడుపునొప్పి గురించి కూడా స్వామికి మొరపెట్టుకున్నాను..నాకు నయమైతే.. ప్రతి ఆదివారం మాంసం తినే నేను, అది మానేస్తానని మొక్కుకున్నాను..అంతే.. మళ్లీ ఈరోజు వరకు, కడుపునొప్పి ఎరుగనండీ..ఆపరేషన్ తప్పదని చెప్పిన డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారండీ!..ఇప్పటికీ ఎంతమందికి నేను ఈ విషయం చెప్పుకున్నానో లెక్కేలేదు..నేనూ పూర్తిగా శాఖాహారి గా మారిపోయానండీ..స్వామివారి సమాధిని దర్శించుకొని మన కష్టాలు ఆయనకు విన్నవించుకుని సంపూర్ణ శరణాగతి చెందితే చాలండీ..సమస్త బాధలూ మాయమైపోతాయి..మా కుటుంబమే ఇందుకు ఉదాహరణ.." అన్నారు..ఈ మాటలు చెప్పేటప్పుడు ఆయన కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి..


"ప్రస్తుతం పిల్లలందరూ..చక్కగా సెటిల్ అయ్యారు..అంతా ఇక్కడ సమాధిలో కూర్చున్న ఈ స్వామి దయ!..మా ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి...ఆ స్వామివారి పూజతో పాటు..ఈ మొగిలిచెర్ల స్వామి ని కూడా మనస్ఫూర్తిగా నమ్మి బాగుపడ్డాము!" అంటూ శ్రీ స్వామివారి చిత్రపటానికి నమస్కరించుకున్నారు..


శ్రీ శ్రీనివాసరావు గారు, ఒంగోలు లోని, గద్దలగుంటపాలెం, రాజరాజేశ్వరీ గుడివద్ద, స్వంత ఇంట్లో ఉంటారు..


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699)

కామెంట్‌లు లేవు: