*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*437వ నామ మంత్రము* 6.10.2021
*ఓం కోమలాకారాయై నమః*
సుకుమారమైన అవయవముల కూర్పుగల జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కోమలాకారా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం కోమలాకారాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధన చేయుభక్తులను ఆ తల్లి వారిని స్ఫురద్రూపులుగను పలువురిలో ఆకర్షితులుగను, కీర్తిప్రతిష్టలతోబాటు, వస్తువాహన సమృద్ధితో జీవనము గడపునట్లు అనుగ్రహించును.
*కుశలా* యను నామ మంత్రంలో ఆ పరమేశ్వరి ఆరోగ్యవంతముగా ఉంటుందని చెప్పుటచే, ఈ నామ మంత్రము ప్రకారం అమ్మవారు కోమలమైన (మృదువైన) అవయవముల కూర్పుతో కామేశ్వరునికి అత్యంత ప్రియమైనదిగా విలసిల్లుచున్నది. *కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా* (లలితా సహస్ర నామావళి యందలి 39వ నామ మంత్రము) అని శ్రీమాత స్తుతింపబడినది. అనగా కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్య మృదుత్వాలతో కూడిన ఊరుద్వయం గలిగినది శ్రీమాత. అమ్మవారి జానువులు (మోకాటి చిప్పలు, జంఘలు (పిక్కలు) మొదలైన అవయవములు అత్యంత మృదువుగా ఉన్నవని కూడా ఆ తల్లి స్తుతింపబడినది. అమ్మవారి పాదములు పద్మములను సైతము తిరస్కరించే టంతటి మృదువుగా ఉన్నవని *పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా* యని లలితా సహస్ర నామావళి యందలి నలుబది ఐదవ (45వ) నామ మంత్రంలో ప్రస్తుతింపబడినది. అంతకోమలమైన అవయవ సంపదతో త్రిభువన సుందరియైన శ్రీమాత మహిషాసురాది రాక్షసులను సైతము సమ్మోహింపజేసినది. ఆ తల్లి రూపము సకలజన వశీకరణము. అందుకనే వాడవాడలా, కొండలలో, కోనలలో ఆ తల్లి నామస్తోత్రపఠనము మారు మ్రోగుచున్నది. అందానికి గాని, కోమలత్వమునకు గాని, చక్కని దంతపంక్తులకు గాని, మృదువైన చెక్కిళ్ళకు గాని, మీనద్వయమును బోలిన నయనములకు గాని, సుమసౌరభములను సైతము ధిక్కరించే శిరోజసౌరభమునకుగాని ఆ అమ్మకు ఆ అమ్మయే సాటి. అందుకేమాత్రము తీసిపోని కామేశ్వరునికి అర్ధాంగి (వామ భాగం తనదిగా చేసుకున్నది) అయినది.
*కోమలః సుకుమారః ఆకారో అవయవవిన్యాసో యస్యా* అని భాస్కరరాయలువారు తమ సౌభాగ్యభాస్కరంలో వ్యాఖ్యానించారు. మనం కూడా అ తల్లిని *ఓం కోమలాకారాయై నమః* అని యనుచూ నమస్కరించి ఆ తల్లి అనుగ్రహపాత్రులము అగుదాము. *ఓం శ్రీమాత్రే నమః*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి