ఒకనాటి పురుష ప్రయత్నంతో చేసిన కర్మఫలమే దైవంగా లభిస్తుంది. నేలలో వేసిన విత్తనం ఫలంగా రావడం దైవం. దైవం గురించి ప్రస్తుతం మనకు తెలియకపోవచ్చు. అందుకే వ్యక్తి పౌరుషానికే ప్రాధాన్యమివ్వాలి. దైవాన్ని నిందించడమో, దైవవశాత్తు ఏది జరిగితే అది జరుగుతుందని ఉపేక్షించడమో చేయకుండా- గొప్ప సిద్ధికి తగ్గ ప్రయత్నం మానవుడు చేయాలని వసిష్ఠ మహర్షి శ్రీరాముడికి బోధించాడు (యోగ వాసిష్ఠం ).
దైవం, పౌరుషం అనే రెండు అంశాలపై సనాతన ఆర్షగ్రంథాలు గొప్పగా చర్చించాయి. పౌరుషం అంటే మానవ ప్రయత్నం. 'దైవం' అంటే అనుభవించవలసిన కర్మఫలం.
ఒక వ్యక్తి గతంలో చేసిన కర్మల ఫలం అనుభవించవలసినదే అన్న వాక్యం 'సత్యమే కానీ నేటి ప్రయత్నంతో దాన్ని తొలగించుకోవడమో, సవరించుకోవడమో చేయవచ్చు అని కూడా ఋషి వాక్యం .
కర్మఫలం కాలానుగుణంగా వస్తుంది. బీజం కాలక్రమంలో భూజం (చెట్టు) అయినట్లే, కర్మ కాలప్రకారం ఫలంగా లభిస్తుంది. దైవం- కాలం అనే రెండు అంశాలు ఇక్కడ సమన్వయమవుతాయి. కర్మఫలాన్ని తగిన కాలంలో అందించే ఒకానొక స్వాభావిక శక్తినే 'ఈశ్వరుడు' అన్నారు. వారి వారి కర్మలననుసరించి 'జీవులను నడిపేవాడు ఈశ్వరుడు' అనే శాస్త్ర నిర్వచనాన్ని చాలా తేటగా రమణమహర్షి తెలియజేశారు.
ఈశ్వరుడు కర్మఫల ప్రదాత. ఆయనకు ఒకరిపై ప్రేమ, వేరొకరిపై ద్వేషం ఉండవు. కర్మానుగుణంగా ఫలాన్నిచ్చే ఈశ్వరశక్తిని దైవం అంటున్నాం. దీనినే 'కాలం' అనీ వ్యవహరిస్తుంది శాస్త్రం. కలనం' చేసేది కాలం. అంటే సమకూర్చేది' అని అర్థం. సంకలనం- అనేమాట అందరికీ తెలిసిందే కదా!
ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా జరగాలో నియమించేదే కలనం. ఈ నియమానికే 'నియతి' అని పేరు. గతిని నియమించి, నడిపించేది కాలమే కనుక దీనికి 'నియతి' అనే పేరుంది. పంచభూతాల స్వభావం, ప్రవర్తన, సూర్యచంద్రాది జ్యోతిర్గణాల ఉదయాస్తమయాలు ఏ విశ్వనియతిని అనుసరించి జరుగుతాయో ఆ 'నియతి'యే కాలం. కాలం నా స్వరూపం' అంటూ విశ్వరూపాన్ని చూపిన శ్రీకృష్ణ పరమాత్మ పలికాడు (భగవద్గీత-11వ అధ్యాయం). కాలాన్ని ఈశ్వరశక్తిగా గుర్తించినవాడు దాని విలువను, మహిమను గుర్తిస్తాడు. సత్ప్రయోజనాలను సాధించడానికి భగవంతుడు కాలరూపంగా లిఖించాడు అని గుర్తించిన సాధకుడు ప్రతిక్షణాన్ని సద్వినియోగపరచుకోవడం ద్వారా ఆ భగవంతుని ఆరాధిస్తున్నాడు. కాలంలోనే పని, ఫలం- రెండూ ఉన్నాయి. పనిపైనే మన శ్రద్ధ, ప్రయత్నం ఉంటే- కాలం సత్ఫలాలను ప్రసాదిస్తుంది. మన భావం, ప్రయత్నం ఎలా ఉంటే కాలం అలా అనుగ్రహిస్తుంది.
సకాలంలో చేసిన ప్రయత్నం సరైన సిద్దినిస్తుంది. కనుకనే, కాలం వ్యర్థం కానివ్వకుండా కృషి చేయాలని ధార్మిక గ్రంథాలు నిర్దేశిస్తున్నాయి. 'కాలజ్ఞుడు' అంటే ఏ కాలానికి ఎలా ప్రవర్తించాలో తెలిసి, కాలాన్ని సద్వినియోగం చేసుకొనేవాడు. అనుభవం, అవకాశం- రెండూ కాలప్రసాదాలే.
సంకల్పం-సాధన సత్' అనే లక్షణంతో ఉంటే అది వ్యక్తికి, సమూహానికి క్షేమకరం. ఏ ప్రయత్నంలో స్వప్రయోజనంతోపాటు సర్వప్రాణిహితం, ప్రకృతి క్షేమం ఉంటాయో అది సత్ ప్రయత్నం. అలాంటి సల్లక్షణం కలిగిన వ్యక్తికి కాలస్వరూపుడైన ఈశ్వరుడు అనుకూలిస్తాడు. గత కర్మల ఫలాలను అదృష్టంగా ఇచ్చే కాలం, భావి సత్-ప్రయత్నాలను సాఫల్యం చేయాలని ఆశించడమే శుభాకాంక్ష!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి