8, ఏప్రిల్ 2022, శుక్రవారం

సద్బ్రహ్మ ధర్మమే

 𝒫.𝒷.𝓂𝒶𝓉𝒶𝒿𝒾:

ఆకాశాది రూపాల్లో కనిపించే  సత్తా ,సద్బ్రహ్మ ధర్మమే.


ఉన్నది పరబ్రహ్మమే, మూడుకాలాల్లోను, సృష్టికిముందు, సృష్టి వచ్చాక, సృష్టి అనంతరం .


భ్రాంతికి పూర్వం _ఉన్నది పరబ్రహ్మమే.

 

భ్రాంతి కాలం _  పరబ్రహ్మ స్వరూపం అవగతం కాని కాలం. 

కాలమే భ్రాంతి.


భ్రాంతి విడచిన తరువాత మరల పరబ్రహ్మము తనకు తానుగా ఉంది.


పరబ్రహ్మము మూడొంతులు నిర్వికారంగా , నిర్గుణంగా ఉన్నది.


ఒకవంతు మాత్రమే మాయా శబలితమై ఉంది. 


(ఈశ్వరుడే గురురూపమై, పరబ్రహ్మ స్వరూపమై  నిర్గుణమైనప్పటికీ రక్షించే  బాధ్యత వలన సగుణరూపంలో వస్తున్నారు,  మనకు శాస్త్ర హృదయాన్ని అవగాహన చేయించి , లక్ష్యం చేర్చేటందుకై).

సదాసీదితి శబ్దార్థభేదే వైగుణ్యమాపతేత్ ౹


అభేదే పునరుక్తిస్స్యాన్మైవం లోకే తథేక్షణాత్  ౹౹ 36 ౹౹


36. సత్త ఉండెను అనే శబ్దముల అర్థము నందును విరోధమే.

విరోధము లేదు,రెండింటి అర్థమొకటే అనిన పునరుక్తి దోషము (అని ఆక్షేపించినచో సమాధానము)లోకవ్యవహారమిట్లే అగుటచే దోషము లేదు. 


వాఖ్య:-ఛాం ఉప3.19.9  :6.2.1 నందు “అసదేవేదమగ్ర ఆసీత్” అనే వాక్యమున విరోధము చెప్పబడినట్లే

 “సదేవసోమ్యేద మగ్ర అసీత్” అనినను విరోధమేయని ఆక్షేపము. ఉండినదే మరల ఉండెను అనుట విరుద్ధము.సత్,ఆసీత్ అనునవి రెండు సత్తలైనచో అద్వయసత్తయు సిద్ధమగుచున్నది.అర్థము ఒకటియే కదా అనిన ఒకదానిని రెండు పర్యాయములు చెప్పుట పునరుక్తి దోషము.ఇట్టి ఆక్షేపమునకు సమాధానముగ లోకమున ఇట్లే వ్యవహారము జరుగుటచే అందు దోషము లేదని చెప్పబడుచున్నది.


 ఈ అనంత చైతన్యము మాత్రమే నిత్యజాగరూకము,జ్ఞానవంతమునయిన  “సద్వస్తువు”.


బ్రహ్మము మాత్రమే సత్యమని తెలుసుకొన్న వ్యక్తి ముక్తుడగును.

మాయ నిజముగా లేదు.ఈ సత్యము నీవు తెలుసికొన్న క్షణమున అది అదృశ్యమగును.


ఈ అజ్ఞానము ఆత్మజ్ఞానము లేకుండా నశింపదు.

ఈ అజ్ఞానము యొక్క మూలము ఏదయినను అది కూడా నిశ్చితముగా ఆత్మలో ఉన్నది.


“నేను”— “బ్రహ్మము”అను భావము తొలగు నపుడే అతడు ముక్తుడగును.


అనంత చైతన్యమే ఒక చోట ఒక వస్తువుగాను,మరొక చోట మరొక వస్తువు గానూ కనిపించును.


తరంగ-జలముల మధ్య

అవయవ-దేహముల మధ్య

విభాగము లేనట్లే 

ఆ చైతన్యమునకు దాని శక్తికి మధ్య విభాగము లేదు.


అనంత చైతన్యమే ప్రపంచమునకు నామ,రూప రహితమగు ఆధారమని గ్రహించిన వారు సంసారమును జయింతురు.


కర్తవ్యం కురుతే వాక్యం బ్రూతే ధారస్య ధారణమ్  ౹౹

ఇత్యాది వాసనావిష్టం ప్రత్యాసీత్సదితీరణమ్  ౹౹ 37 ౹౹


కాలాభావే పురేత్యుక్తిః కాలవాసనయా యుతమ్   ౹

శిష్యం ప్రత్యేవ తేనాత్ర ద్వితీయం న హి శంక్యతే   ౹౹ 38 ౹౹


చోద్యం వా పరిహారో వా క్రియతాం ద్వైతభాషయా  ౹

అద్వైతభాషయా చోద్యం నాస్తి నాపి తదుత్తరమ్  ౹౹ 39 ౹౹


తదాస్తిమిత గంభీరం న తేజో న తమస్తమ్  ౹

అనాఖ్యమనభివ్యక్తం సత్కిఞ్చిదవశిష్యతే  ౹౹ 40 ౹౹


37. చేయవలసిన దానిని చేసెను,

    వాక్యమును వచించెను ,

    భారమును భరించెను  మొదలగు వాక్య ప్రయోగములన్నీ  పునరుక్తులు విరోధములే. ఇట్టి సంస్కారములు కలిగిన వారినుద్దేశించే “సత్ ఆసీత్”అని చెప్పుచున్నది.జనులకు ఈవాక్యములన్నీ అర్థవంతములే సాధువులే అగుచున్నవి.


38. అద్వితీయమగు బ్రహ్మము “పూర్వము”ఉండెను అనుట ఎట్లు? ఉండినగదా దానికి “పూర్వము” మరొకటి ఉండెనని చెప్పగలము?అను సంశయము వారింపబడుచున్నది.బ్రహ్మము కాలాతీతమైనను “పూర్వము” అని చెప్పుట కాలమను భావనను వదలని శిష్యుని గూర్చి మాత్రమే. కాలము లేదనిన నూతనులు దిగ్బ్రమ జెందుదురు.వారికి క్రముగ బోధ పరచుటకు బ్రహ్మము పూర్వము ఉండెను అని చెప్పబడినది.రెండవ దాని గూర్చిన ఉద్దేశము ఇందు లేదు.


39.ఆక్షేపముగాని పరిహరము గాని ద్వైతభాష యందే,వ్యవహారమున ద్వైతమును ఆరోపించుకొనియే జరుగును.అద్వైతభాష యందు పరమార్థమున ప్రశ్నయు లేదు ఉత్తరమసలే లేదు.

రెండవదే లేనపుడు ప్రశ్నలు ఉత్తరములు అసంభవముగదా.


40అప్పుడు,పరమార్థమున,

నిశ్చలము మనస్సు ఊహింపలేనిది కాంతి కానిది ఆచరింపనిది వ్యాప్తమైనది వివరింపనలవికానిది ఇంద్రియములు గ్రహింపజాలనిది శూన్యముకానిది ఇదిఫలానా అని చెప్పవీలు లేనిది ఉండును.అనగా దానిని ద్వైతనిషేధముచే మాత్రము సూచింపగలమని ఉద్దేశము.

(యోగవాశిష్ఠ ప్రారంభమున రామవశిష్ఠ సంవాదము ద్రష్టవ్యము.)


కంకణజ్ఞానము వలన సువర్ణము తన సువర్ణత్వమును అనుభవగోచరము గావించుకొను విధముగానే,విషయి(ద్రష్ట)విషయముగా,(దృశ్యముగా) అభివ్యక్తమగుచు తన ద్రష్టృత్వమును(ద్రష్టజ్ఞానమును)

అనుభవ గోచరముగావించు కొనును.


ఒకటి రెండవదాని ప్రతిబింబమే.నిజమయిన ద్వైతము(భేదము)లేదు.


ద్రష్ట దృశ్యమును జూచు నప్పుడు తనను జూడడు.

ద్రష్ట తనను దృశ్యముగా జూచును గనుక,తాను సత్యమైననూ, చూడడు,అయినను అతను అసత్యమయినట్లు అగుపించును.

అయినప్పటికి ఆత్మజ్ఞానముదయించి,విషయము అస్తిత్వరహితము కాగా,ద్రష్ట(విషయి)ఏకైక సత్యముగా అనుభవగోచరమగును.


విషయము వలన విషయి ఉండును.ఇక విషయము విషయి యొక్క ప్రతిబింబము మాత్రమే.

ఒక్కటి లేనిచో ద్వైతము ఉండజాలదు.మరియు ఒక్కటి మాత్రమే ఉన్నచో “ఏకత్వ” భావన యొక్క అక్కర  ఎక్కడ ఉండును.


ఆవిధముగా,సరి అయిన విచారణ,అవగాహనల వలన నిజమయిన జ్ఞానములభించి నప్పుడు మాటలతో వ్యక్తము చేయరానిది ఒక్కటే ఉండును.


దాని విషయమున అది ఒకటి అనిగానీ అనేకమనిగానీ,అది ద్రష్ట కాదనిగానీ, దృశ్యము కాదని గానీ,విషయి అనిగానీ,విషయమని గానీ,ఇదిఅనిగానీ చెప్పుట సాధ్యముగాదు.


ఏకత్వముగానీ నానాత్వముగానీ సత్యమని నిజముగా నిర్ణయింపజాలము.ఏల అనగా,ప్రతి వాదము తద్భిన్నమయిన వాదమునకవకాశమిచ్చును.

అయినను,తరంగము జలముకంటే వెరు కానట్లే,కంకణము బంగారము కంటే భిన్నము కానట్లే,ఒకటి “తదితరము”కంటే భిన్నము కాదు.


అదే విధముగా విభాగము ఏకత్వమునకు నిరాకరణము(విరుద్ధము)కాదు!

ఏకత్వమునకు,నానాత్వమునకు సంబంధించిన ఈఆలోచన అంతయు దుఃఖమును అతిక్రమించుటకు మాత్రమే.


దీని కంతటికి అతీతముగానున్నదే సత్యము,పరమాత్మ.

కాలమనేది సద్రూపబ్రహ్మము నందు లేకపోయినప్పటికీ ‘ పురా’ _ పూర్వకాలంలో అని చెప్పటం భూత వర్తమానాది కాలాల అభ్యాసరూపమైన వాసనలతో కూడియున్న శిష్యుని కోసం అని గ్రహించుదాం.


కాబట్టి కాలము ను, ద్వితీయ వస్తువుగా కల్పించుకోకూడదు.


“ సత్ ఆసీత్”_ సద్రూపమే ఉండెను.

 

అఙానం వలన భ్రమతో ఉన్నపుడు ద్వైతం ఉంది. 

అఙానం అనేకవిధాలుగా ఉంటుంది. 


ఙానం ఒక్కటిగా ఉంటుంది.

ఆ ఙాన నేత్రం తెరుచుకుని , ఉన్నదొ క్కటే అనే అనుభూతి చెందిన , అద్వైతం, ఏకం .


భావనలో ,ఆంతరికంగా ఏకత్వం( అద్వైతం) ఉండాలి.

వ్యవహారానికి అద్వైతం కాదు. 


ఆ అద్వైతంగా ఉన్న పరమార్ధ స్థితిలో నిశ్చలము,గంభీరము,తేజస్సు కంటె భిన్నమైన తత్త్వంఒక్కటే ఉంటుంది.


అది వ్యాపకమైనది.

ఇంద్రియాలకు విషయం కానట్టిది.

శూన్యం కంటే విలక్షణమైనది.

ఇది అని వ్యాఖ్యానింపశక్యము కానిది.


నేతి, నేతి యని సమస్త ద్వైత భావాలనూ నిషేధించగా, మిగిలి యుండే తత్త్వం ఒక్కటే ఉంది.

ఆ పరమార్ధ తత్త్వమే సద్రూపం.


అని విద్యారణ్యులు బోధించుచున్నారు.



 నను భూమ్యాదికం మా భూత్పరమాణ్వన్తనాశతః  ౹

కథం తే వియతోఽ సత్వం బుద్ధిమారోహతీతి చేత్  ౹౹ 41 ౹౹


అత్యంతం నిర్జగద్వ్యోమ యథా తే బుద్ధిమాశ్రితమ్ ౹

తథైవ సన్ని రాకాశం కుతో నాశ్రయతే మతిమ్  ౹౹ 42 ౹౹


41. ఆక్షేపము:- పరమాణువుల కలయికచే ఏర్పడిన భూమి జలము మొదలైనవి లేకపోవుగాక,నిత్యమగు ఆకాశము కూడా లేదనుట ఎట్లు ఊహింపగలము? (వైశేషికుల అభిప్రాయము.బ్రహ్మముతో పాటుగ ఆకాశముండిన అద్వయ వాదము భంగపడును)


42. సమాధానము:-జగమంతా నశించి ఆకాశము మాత్రముండునని నీవు ఊహింపగలిగినట్లే ఆకాశము కూడా నశింపగా సత్తా ఉండునని ఏల ఊహింపలేము?


వాఖ్య:- “శబ్దగుణక మాకాశం”అనీ

“అవకాశ దాతృత్వమ్ ఆకాశత్వమ్”అనీ ఆకాశమునకు నిర్వచనములు.శబ్దము కలుగుటకు ఆధారమైనది,ఇతర వస్తువులు ఉండుటకు అవకాశమును ఇచ్చునది ఆకాశము.అనగా ఇతర వస్తువులతో సంబంధపడునది ఆకాశము.ఇట్లుండ,వస్తువులన్నీ నశించి ఆకాశము మాత్రము ఉండుట ఊహింపగలిగినచో ఆ ఆకాశము కూడా నశించి సత్త మాత్రము శేషించుట ఏల ఊహింపలేము?అన్నింటిని నిషేధించుచూ వచ్చిన నిషేధింప సాధ్యము గానిది మిగులును.అదే   సత్త,బ్రహ్మము.


ఆత్మజ్ఞానము వలన బాహ్యమయిన జ్ఞేయ విషయము తనంత తాను తొలగగా చైతన్యము పరిపూర్ణముగా అభివ్యక్తమగును.

ఆచైతన్యమే స్వయముగా జడవిషయములందు జడస్వభావమును పొంది గాఢనిద్రాస్థితిని-అచేతనత్వమును లేక అజ్ఞానమును పొందును.


కావున చైతన్యమొక్కటే సర్వకాలములయందు ఉండును గనుక ఆకాశము ఉన్నదనియు, లేనిదనియు,ప్రపంచము ఉన్నదనియు, లేనిదనియు చెప్పవచ్చును.


అగ్నికి వేడి,శంఖమునకు తెలుపు,పర్వతమునకు గట్టితనము,జలమునకు ద్రవ్యత్వము,చెరకుకు తియ్యదనము,పాలకు వెన్న,మంచుకు తెల్లదనము,జ్యోతికి వెలుగు, తేనెకు మాధుర్యము, పుష్పమునకు సుగంధము ఎట్టిదో చైతన్యమునకు విశ్వము అట్టిది.


చైతన్యమున్నది గనుక ప్రపంచమున్నది.చైతన్యమునకు దేహము ప్రపంచము.

విభాగము లేదు,భేదము లేదు,

వ్యత్యాసము లేదు.


 సహజమయిన సత్తగల చైతన్యము సత్యము కావున ప్రపంచము సత్యము,

చైతన్యము లేకుండా ప్రపంచము వుండదు కనుక అసత్యము.


పర్వతములు,సముద్రము,భూమి,నదులుమొదలగునవి అవిగా వుండవు,కేవలము చైతన్యముగానే వుండును.కావున, చైతన్యములో భాగములుగానీ అవయవములుగానీ లేవు.


చైతన్యము యొక్క అస్తిత్వము లేదనరానిది.

అజ్ఞాని యొక్క అనుభవజ్ఞానముననుసరించి ప్రపంచ భావన పట్టు కొన్నది.


వాస్తవముగా ప్రపంచము,బ్రహ్మము,ఆత్మ ,

విశ్వచైతన్యము అను పదములలో భేదమే లేదు.



పరమాణు పర్యంతం సమస్త పదార్ధాలూ నాశనమయేవే. 

“ యదృశ్యం తన్నశ్యం” .నశించేవన్నీ అసత్తే.


పంచభూతాలైన భూమి, అగ్ని, జలం, వాయువు అనిత్యంగా ( అంతటా లేకపోవుట వలన) , అసత్ గా నిర్ణయించుచున్నాము.


 మరి నిత్యమూ ఉండే ఆకాశం ఎలా అసత్తు  అయింది ?  అంటున్నారు.


సృష్టి అయి ప్రపంచం గా కనపడే పదార్ధాలలో , ఆకాశం  మిగిలిన వాటితో   పోల్చిచూచిన నిత్యంగాఉన్నట్లుగా, అంతటాఉన్నట్లుగా, వ్యాపకం గా కనపడుతోంది.


ఆకాశం అంటే ఖాళీయే.

కానీ మనకు ఆ ఖాళీ నీలం రంగులో , అక్కడ ఒకటి ఉన్నట్లుగానే ,ఈ చర్మ చక్షువులకు కనపడుతోంది కదా! 


దృశ్యంగా కనపడేది, ఎప్పటికైనా నశిస్తుంది అని వేదాంతం చెబుతోంది.


మరి “సత్” అనేది చర్మ చక్షువులతో గోచరించనిది కదా! 


కాబట్టి ఆకాశము సద్వస్తువు కాదు,అంటున్నారు.


పరమాత్మకు దేహమే ప్రపంచం.

అదే పరమాత్మకు, స్థూల శరీరమైన విరాట్ స్వరూపం.

కామెంట్‌లు లేవు: