🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -26 & 27🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
కొన్ని రోజుల తరువాత నారాయణపురం నుండి ఒక సేవకుడు పద్మావతీ శ్రీనివాసుల వద్దకు వెళ్ళి ‘‘ఆర్యా! ప్రభువులైన మా ఆకాశరాజుగార్కి ఆకస్మాత్తుగా జబ్బుచేసినది. వారు ప్రమాద పరిస్థితిలో వున్నారు. మహారాజుగారు మీ యిద్దరినీ చూడాలని వుందనికలవరిస్తున్నారు’’ అన్నాడు.
పద్మావతీ, శ్రీనివాసులు చాలా అందోళన పడ్డారు. ఆగస్త్యమహామునిని వెంటబెట్టుకొని వారిరువురూ విచారముతో నారాయణపురానికి వెళ్ళారు.
నారాయణపురము పద్మావతి, శ్రీనివాసులు చేరేటప్పటికి ఆకాశరాజు స్పృహకోల్పోయి వున్నాడు. శ్రీనివాసుడు మామగారిని సంబోధించి మాట్లాడడంతో ఆకాశరాజు తేరుకొని కళ్ళువిప్పి చూసాడు. చూస్తే ఎదురుగా పద్మావతి , శ్రీనివాసులు కనిపించారు. అందోళన నిండిన ముఖముతో ధరణీదేవి కూడా కనిపించింది.
అంతమ ఘడియాలలో నున్నప్పటికీ ఆకాశరాజు లేని ఓపిక తెచ్చుకొన్నాడు. శ్రీనివాసునితో ఆకాశరాజు సర్వసృష్టినీ స్పష్టించిన స్పష్టికర్తనే స్పష్టించిన ఓ ఆదిపురుషా!జగన్నాథా! గోవిందా! నారాయణా! అంతిమ కాలములో నిన్ను నేను దర్శించడము జరిగినది.
ఇంతకన్న నాకు కావలసినది మరియొకటి యేముంటుంది? సర్వేశ్వరా నాకు కోరికలేమీ లేవు. ఒక్క విషయములో మాత్రమే నిన్ను ప్రార్థిస్తున్నాను.
నా కుమారుడైన వసుదాముడూ, నా సోదరుడైన తొండమానుడూ అభమూ, శుభమూ తెలియనివారు.
వారి విషయమై మాత్రమే నాకు బెంగ, నీవు వారిద్దరినీ జాగ్రత్తగా చూచుకొనుమని కోరుచున్నాను’’ అని పలికి కుమార్తె అయిన పద్మావతిని ‘‘అమ్మా! ఇలారా నా జన్మ తరించిపోయినది నీవంటి కుమార్తెను పొందగలిగినందులకు నేనే అనేక విధాలుగా గర్విస్తున్నాను. ఇంక మనకు ఋణము తీరిపోయిందమ్మా! సుఖముగా శాంతిగా వుండమ్మా అని అంటూ, ప్రాణాలు విడిచి కీర్తిశేషుడయ్యాడు.
పద్మావతీ, ధరణీదేవి ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఆకాశరాజునకు దహన సంస్కారము చేశారు. ధరణీదేవి స్వర్గానికి వెళుతూన్న భర్తను అనుసరించడానికి నిశ్చయించుకొని సహగమనము చేసినది. తరువాత పద్మావతీ శ్రీనివాసులు ఆగస్త్యనితో ఆయన ఆశ్రమయునకు వెళ్ళిపోయారు.
*తొండమానుని పూర్వజన్మ వృత్తాంతము:*
తొల్లి వైఖానసుడు అనే ఒక భక్తుడుండేవాడు. అతడు శ్రీకృష్ణభగవానుని స్వయముగా చూడాలనే కోరికతో వుండేవాడు.
నిద్రాహారములు లేక, అచంచలదీక్షతో కృష్ణభగవానుని గూర్చి ఎన్నోయేండ్లూ, పూండ్లూ తపస్సు చేశాడు. శ్రీమహావిష్ణువు ఆతనికి దర్శనభాగ్యము కలుగజేశాడు. ప్రత్యక్షమై భక్తశ్రేష్ఠా! నీకు వలయునదేమిటో కోరుకొను మిచ్చెదను’’ అన్నాడు.
కన్నులు తెరచి వైఖానసుడు శ్రీమన్నారాయణుని దివ్యదర్శనముచేసి స్వామి పాదములకు సాష్టాంగ దండప్రణామము లాచరించి ’’స్వామీ! కరుణాసాగరా! నాకు యితరమైన కోరికలేమీ కాని, శ్రీకృష్ణావతారము నేత్రానందముగా చూచి తరించాలని వున్నది’’ అనెను.
అందులకు శ్రీమహావిష్ణువు ‘‘నాయనా వైఖానసా నీవు యిప్పుడు శ్రీకృష్ణదర్శనము చేయాలని కోరుకుంటే వీలుపడదు. కాని, యిప్పుడు శేషాచలముపై కృష్ణుడే శ్రీనివాసరూపములో ఒక పుట్టలో నున్నాడు. నీవు అతనిని పూజించవలసినది’’ అన్నాడు.
తరువాత శ్రీమహావిష్ణువు అంతర్థానమయ్యాడు. వైఖానుసుడు అక్కడ నుండి శేషాచలానికి బయలుదేరాడు. మార్గములో అతనికి రంగదాసుడనే ఒక భక్తుడు కలసినాడు. వైఖానసుడు తాను శేషాచలము మీదనున్న శ్రీనివాసుని సేవించ వెడుతున్నాననీ చెప్పగా, రంగదాసు తానున్నూ శ్రీనివాసుని సేవించ వెడుతున్నానని చెప్పెను,
వారిరువురు కలసి శేషాచలాన్ని అధిరోహించారు. వైఖానుసుడు ఒక పుట్ట దగ్గరకు వెళ్ళి అందున్న భగవానునీ పూజించాలనుకొన్నాడు. పూవులు కావలసివచ్చాయి. అప్పుడు వైఖానసుడు రంగదాసునితో ‘‘శ్రీనివాసుని పూజించడానికి పూవులు కావాలి కదా! అందుచే నీవు ఒక పూలతోటను పెంచవలసినది’’ అని కోరాడు.
రంగదాసు అలాగేనని పూలతోటకు నీరు చాలా ముఖ్యము కనుక, నీటికై ఒక బావిని త్రవ్వించాడు. దాని పేరు పూలబావిగ అయింది, ఆ బావిలోని నీటితో మొక్కలను పెంచి, ఆ మొక్కలను పూలను ప్రతిపాదిమూ శ్రీనివాసుని పూజకొరకై వైఖానసునకు యిచ్చుచుండెను.
ఒకనాడు ఒకానొక గంధర్వరాజు స్వామి పుష్కరిణిలో జలక్రీడ లాడడానికై తనసతులతో సహితము వచ్చినాడు. అక్కడికి పూవలకొరకై వచ్చిన రంగదాసు ఆ జలక్రీడలను చూచి చిత్తచాంచల్యము పొందినవాడై స్వామి పూజా సమయము కూడా మరచిపోయాడు.
గంధర్వులు వెళ్ళిన తరువాత, రంగదాసు తన పని గ్రహించినవాడై పూవులు తీసుకొని వైఖాసమునివద్దకు వచ్చాడు.
వైఖానసముని ‘‘ఏమిటి యింత ఆలస్యమయిన’’దని గద్దించి అడిగాడు. ఉన్నదున్నట్లు చెప్పాడు రంగదాసు పూజకు తాను చేసిన ఆలస్యానికి బాధపడుతూ క్షమించమని వేడుతూ రంగదాసు శ్రీనివాసుని అనేక విధాల ప్రార్థించాడు. ప్రార్థించగా శ్రీనివాసుడు ప్రత్యక్షమయి ‘‘ఓయీ రంగదాసా! చేసిన దానికి విచారింపకుము. నీవు నాయొక్క మాయా మోహము వల్లనే గంధర్వుల జలక్రీడల్ని చూసి భ్రాంతిలో పడినావు. యీ శరీరము విడిచి నారాయణపురము రాజైన సుధర్ముడికి కుమారుడ నయ్యెదవు గాక తొండమానుడు అను నామధేయముతో రాజ్యసుఖములన్నీ అనుభవింతువు గాక’ అని చెప్పాడు.
ఆ రంగదాసే ఆకాశరాజునకు తమ్ముడైన తొండమానుడుగా పుట్టాడు.
నిత్య శుభ ప్రద గోవిందా, నిత్య కళ్యాణ గోవిందా, ఆనంద రూప గోవిందా, ఆద్యంత రహిత గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||26||
శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం..
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
ఆకాశరాజు మరణంతో తొండమానునకూ, వసుధాముడికీ రాజ్యము గూర్చి కలహము ఏర్పడింది. అన్న అయిన ఆకాశరాజు చనిపోయినాడు కనుక రాజ్యానికి పాలకుడుగా నేనే అవుతాననీ తొండమానుడూ, తండ్రి అయిన ఆకాశరాజు చనిపోయిన కారణముగా కుమారుడనైన నేనే రాజ్యపాలకుడవవలసి వున్న’’దనీ వసుధాముడూ వాదించుకోసాగారు. చివరకు యుద్ధానికి తయారయ్యారు.
ముందుగా వారిద్దరూ అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళి తమవైపు సహయము చేయవలసిదిగా శ్రీనివాసుని అభ్యర్ధించారు. ఆయనకు యిద్దరూ దగ్గర బంధువులే కదా! ఆలోచించాడు శ్రీనివాసుడు. తొండమానునకు తన శంఖ చక్రాలను సహాయముగా యిచ్చాడు. తాను మాత్రము బావమరిదియైున వసుధాముని వైపున సమరం చేయడానికి నిశ్చయించుకొన్నాడు. యుద్ధరంగము సిద్ధమయినది పోరు జోరుగా సాగింది. ఇరువైపుల సైన్యములోని వారూ చాలామంది మరణించినారు. కొన్ని వందలమంది క్షతగాత్రులయ్యారు. ఆ సమయములో తొండమానూడూ, శ్రీనివాసుడూ ఘోర యుద్ధముచేయసాగారు. తొండమానుడు ఒక తీవ్రబాణము శ్రీనివాసుని హృదయంపై వేసినాడు, దానితో శ్రీనివాసుడు మూర్చపోయినాడు. ఈ వార్త పద్మావతికి తెలిసి రోదిస్తూ యుద్ధ రంగానికి వచ్చి మూర్చలోనున్న తన భర్తకు ఉపచారాలు చేసినది. శ్రీనివాసుడు మూర్చ నుండి తేరుకొన్నాడు. అప్పుడు పద్మావతి ‘‘ప్రాణప్రియా! ఈ యుద్ధములో ఒకరు చేస్తే పినతండ్రి, మరొకరు చేస్తే తమ్ముడు. వారిలో ఎవరు ఓడిపోయినా నేను చూడలేను స్వామీ! దయచేసి మీ చాకచక్యమును ఉపయోగించి వారిద్దరకూ రాజీ చేయండి’’ అని వేడుకొన్నది.
అప్పుడు శ్రీనివాసుడు తొండమానునీ,వసుధామునీపిలిచి యుద్దము కన్నా రాజీ పడడమే ఉభయతారకముగా వుంటుందనీ బోధించాడు. వారిరువురకూ శ్రీనివాసునుడనిన చాలా గౌరవము కనుక ఒప్పుకున్నారు. శ్రీనివాసుడు రాజ్యాన్ని వారిద్దరకూ చెరిసగముగా చేసి పంచి యిచ్చాడు. వారు ఒప్పుకున్నారు. ఆడబిడ్డకు ఆధారముగా వారిరువురూ తమ రాజ్యములలో ముప్పయిరెండు గ్రామములు భరణముగా యిచ్చివేశారు. పిదప శ్రీనివాసుడు, పద్మావతి ఆగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళిపోయారు.
శ్రీనివాసుడు తొండమానునకూ, వసుధామునకూ రాజీ కుదిర్చిన వెనుక, వారు చక్కగా రాజ్యపాలనము చేసుకొనుచుండిరి. అక్కడ ఆగస్త్యమహాముని ఆశ్రమములో శ్రీనివాసుడూ, పద్మావతీ హాయిగా కాలక్షేపము చేయుచుండిరి.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
*ఓం నమో వెంకటేశాయ*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి