21, ఆగస్టు 2023, సోమవారం

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర 25*

 🌷 *శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర 25*🌷

                   🌷🌷🌷

*శ్రీనివాసునకూ, పెండ్లివారికి ఆకాశరాజు స్వాగతమిచ్చుట.* 


ఆకాశరాజు బంధువులతో సహితము... మంగళవాద్యాలతో సహితం శ్రీనివాసుడున్న విడిది గృహానికి వెడలినాడు.


అప్పుడు వశిష్ఠుడు ఆకాశరాజుతో "రాజా! ఇంక ముహూర్తము సమీపించనున్నది కదా, కనుక మున్ముందుగా మీరిప్పుడు, వరుని పూజచేయవలసి యున్నదనెను".  


అట్లే అని ఆకాశరాజు, ధరణీదేవి శ్రీనివాసునకు గంధము, తాంబూలము మొదలైనవి ఇచ్చి బట్టలూ, నగలూ ఇచ్చి పూలతో ప్రేమతో పూజ చేసారు.


పూజానంతరము శ్రీనివాసుని పట్టపుటేనుగుపై ఆసీనుని చేశారు. 


బ్రహ్మ, 

సరస్వతీ, 

ఈశ్వరుడు, 

పార్వతి, 

ఇంద్రుడు, 

శని


తక్కిన వారినీ, మునులను సర్వవిధ మంగళవాద్యాల మధ్య 

విడుదలు నుండి తోడుకొని వచ్చి, రాజమందిరములో ప్రవేశింపజేశారు.


రాజమందిర ద్వారము దగ్గర ముత్తైదువువులు, శ్రీనివాసునకు హారతి యిచ్చారు.

అనంతరం అలంకరించబడిన కళ్యాణమండపములోకి శ్రీనివాసుని రావించి, బంగారముతో చేయబడిన ఒక పీఠముపై కూర్చుండజేశారు. 


ఎప్పుడు ఏది చేయవలసి వున్నదో చెబుతున్నారు.  ఆయన చెప్పగా ఆకాశరాజు స్వామి పుష్కరిణీతీర్థము నుండి పవిత్రజలాన్ని తెప్పించాడు. 


భార్య ధరణీదేవి బంగారు కలశముతో ఆ జలమును పోస్తుండగా, ఆయన శ్రీనివాసుని పవిత్ర పాదకమలాలను కడిగినాడు.   కడిగి ఆ జల బిందువులను తన శిరస్సుపై జల్లుకొని ధరణీదేవి శిరముపైన జల్లినాడు. 


బృహస్పతి, వారిరువురునూ సమయోచిత శుభమంత్రాలు పఠిస్తుండగా, ఆకాశరాజు పద్మావతి యొక్క హస్తాన్ని పట్టుకొని, ధరణీదేవి స్వర్ణ పాత్రతో స్వచ్ఛ జలము పోస్తుండగా, శ్రీనివాసుని చేతిలో ధారవోసినాడు. 


వశిష్ఠుడు ఆ దంపతులకు కంకణాలు కట్టాడు.


ఏ శుభముహూర్తమునకు వివాహము జరగవలసి యున్నదో ఆ సముహూర్తము రానే వచ్చినది.


వాద్యాలు వాయించేవారు మరింతగా వాయించసాగారు.

ముత్తయిదువులు మంగళ సూత్రమును గట్టిగా అలంకరించారు. 


దేవతలు ఆనందముతో ఆ సమయములో పూలవర్షము కురిపించారు. 


తరువాత విలువయిన మంచి ముత్యాలతో తలంబ్రాలు పోసుకొన్నారు దంపతులు. 


ఈ విధముగా పద్మావతీ, శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవము జరిగినది.


ఆకాశరాజు యొక్క సంకల్పమునకు వున్న బలము కారణముగా కళ్యాణము సవ్యముగా జరిగిది. 


కళ్యాణ సందర్భములోనే ఆకాశరాజు అల్లుడైనటువంటి, శ్రీనివాసునకు కట్నాలు-కానుకలు బాగానే యిచ్చారు. 


వందబారువుల స్వర్ణకిరీటము, మణులు పొదగబడిన కంఠహారాలు,  ఒక కోటి బంగారు నిష్కములు, మకరకుండలాలు, మాణిక్యాల పతకాలు, సింహలాట సహితాలైన కంకణాలు, బంగారముతో చేయబడిన మొలత్రాడు, రవ్వల ఉంగరాలు, అపరంజి పాదుకలు, రత్నాలు తాపబడిన కంబళములు, భోజనావసరమునకు స్వర్ణపాత్రలు,   సహస్రగజాలు, దశ సహస్రగజాలు, దశ సహస్ర అశ్వాలు, దాసదాసీ జనాలు మున్నగు అనేక విధాలయిన ఆభరణాలు బహూకరించాడు. 


పద్మావతీదేవి వివాహానికై వచ్చినవారందరినీ, ఉచిత మర్యాదలచే గౌరవించడము జరిగినది.


లక్షలాది బ్రాహ్మణులకు సంతుష్టిగా సంభావనలిచ్చి, పంచభక్ష్య పరమాన్నములతో భోజనములు పెట్టి, వారిని ఆనందింపజేశారు. 


అయిదు రోజుల వివాహమున్నూ అతి వైభవముగా జరిగినది.


ధరణీదేవి ఆకాశరాజు, క్షీరధారవతో, పద్మావతిని శ్రీనివాసుని హస్తములో పెట్టి అప్పగిస్తూ, ఆకాశరాజు యీ విధముగా అన్నాడు.


"శ్రీనివాసానికి, నీవు సాక్షాత్తు భగవంతుడయిన, శ్రీమన్నారాయణుడవే,అని నేను బాగా అర్థము చేసుకొన్నాను. 


నీ పవిత్ర పాద కమలాలు జలముతో కడిగి పిల్లనివ్వడము వలన మా వంశానికి వంశమే తరించిందని నేను భావిస్తున్నాను. 


నీకు సర్వులూ బంధువులే.  పిల్లనిచ్చినవాడినగుటచే నీకు ఒక చిన్న మనవి చేసుకొనదలంచుకున్నాను. 


పద్మావతి అతి సుకుమారి.  జాగ్రత్తగా యేలుకొనుము.


ఈమెను పువ్వులలో పెట్టుకొని జాగ్రత్తగ చూచుకొనమని, తండ్రిగా కోరుచున్నాను " అనెను.  


ఆకాశరాజు కుమార్తెవైపు తిరిగి, అమ్మాయి, పద్మావతీ, చాలా అదృష్టవంతురాలవు.  సాక్షాత్తూ శ్రీమన్నారాయణమూర్తియే నీకు భర్తగా లభించినాడు. 

అతనిని నీవు బహుభక్తితో చూచుకొనుచుండుము. 

స్త్రీకి భర్తయే దైవము.  పతి సన్నిధానమే నీకు పెన్నిథి.   నీ మగని బాగా నీ బాగుగా భావించి నడచుకొనుము. 

పాలూ-నీరు మాదిరిగా ఆలూ-మగలు వుండాలి.  పుట్టింటికీ, అత్తవారింటికీ కీర్తి తీసుకురావలెను.

సీత, రుక్మిణి, అనసూయ, సుమతి వంటి వారిని ఆదర్శముగా తీసుకొనుము. 

కన్నవారమయిన మమ్ము ఎన్నటికీ మరువకుము." అని సూక్తులు చెప్పినాడు. 


పద్మావతి తనను అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వీడి, భర్తగారింటికి వెళ్ళేముందర మనస్సులో బాధపడినది. 


చిరాకు సారి, నగా నట్ర పెట్టి పద్మావతీదేవిని, అత్తవారింటికి వెడలుటకై ప్రయాణము చేశారు. 


అత్తయ్యకు, మామయ్యకు శెలవు చెప్పి, శ్రీనివాసుడు పద్మావతీ సమేతుడై, గరుడవాహనాన్ని అధిరోహించినవారై, పయనమయ్యారు. 


మార్గమధ్యములో అగస్త్యుని ఆశ్రమము తగిలినది.


అగస్త్యుడు శ్రీనివాసుని తోడుకొని, ఆశ్రమమునకు తీసుకొని...వెడలి ఉచిత రీతిని భక్తిశ్రద్ధలతో పూజించినాడు. 


అప్పుడు శ్రీనివాసుడు, దేవతలూ మొదలైన తనతో వచ్చినవారితో,  స్నేహితులారా! మీకొక విషయము చెప్పాలని అనుకొంటున్నాను. 


అదేమంటే, వివాహమయిన భార్యాభర్తలు, వివాహానంతరము ఆరు మాసాలవరకు, పర్వతాలు ఎక్కకూడదనే, ఒక ధర్మము వున్నది కదా!  అందువలన నేనున్న్నూ, పద్మావతియూ యీ అగస్త్యుని ఆశ్రమములో ఆరు నెలలపాటు వుంటాము.  తరువాత శేషాచలానికి చేరుకొంటాము." అన్నాడు. 


వారందరూ సరే అన్నారు. 


బ్రహ్మ,  ఈశ్వరుడు, అందరున్నూ శ్రీనివాసుని వద్ద శలవు గైకొని వారివారి నెలవులకు వెడలిపోయారు. 


పద్మావతీ-శ్రీనివాసులు హాయిగా అగస్త్యుని ఆశ్రమములో నివసించసాగారు. 


రత్న కిరీట గోవిందా

రామానుజనుత గోవింద

స్వయం ప్రకాశ గోవిందా

సర్వ కారణ గోవిందా 


గోవిందా హరి గోవిందా 

వేంకట రమణా గోవిందా 

గోవిందా హరి గోవిందా 

వేంకట రమణా గోవిందా!

🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: