16, ఆగస్టు 2023, బుధవారం

రామాయణమ్ 292/293/294

 రామాయణమ్ 292/293/294

...

అమ్మా ! దుఃఖమేల ,ఈ బాధ ఏల ఇప్పుడే ఈ శోకము నుండి విముక్తుడను చేసెదను ! నా వీపుపై కూర్చొనుము రాముని వద్దకు మరుక్షణమే నిన్ను చేర్చెదను. సముద్రమును చిటికెలో దాటివేస్తాను రాముని చెంత నిన్ను చేరుస్తాను . 

.

రావణసహితముగా లంకను పెళ్ళగించుకొని పోగల శక్తి నాకు స్వంతము. నా గమనవేగమును అందుకొన గల శక్తి ఏ దైత్యునకూ లేదు !

.

అని అతి చిన్న రూపముతో ఉన్న హనుమంతుడు పలుకగా ఆశ్చర్యముతో ఆయనను చూసి సంతోషించినదై సీతామాత ఈ విధముగా పలికెను.

.

ఓయి వానరుడా ! నీ రూపమేమి ? నీవేమి ? నీ వానరబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు.

 అంత దూరము నన్ను మోసుకొని పోగలవనియేనా? అని అన్న రామపత్నిని చూసి హనుమ స్వామి !

.

ఒక అవమానము ! 

ఒక కొత్త అవమానము నేడు జరిగినది !

.

సీతమ్మ తనను ఇంత తక్కువచేసి మాటలాడటము సహించలేకపోయాడు వాయునందనుడు.

.

వెంటనే తాను కూర్చొని ఉన్న కొమ్మమీదనుండి క్రిందకు దుమికి తన శరీరమును పెంచసాగెను.

.

అప్పటి వరకు ఆయనకు నీడ ఇచ్చిన ఆ మహా వృక్షము ఆయన పాదములమీద మొలచిన వెంట్రుకవలె మారిపోయింది!

.

అమ్మా ! పర్వతములు,దుర్గములు,వనములు,సకలదైత్యసైన్యములు,రావణుని ఆతని సింహాసనముతో సహా లంకమొత్తాన్ని మోసుకొని పోగలను .అవి అన్నియు నా అరచేతిలోనికి ఇమిడిపోగలవు !

.

సందేహము విడిచిపెట్టి నా వీపుమీద ఎక్కుతల్లీ ! ఈ క్షణమే నీకు రామసందర్శనభాగ్యము కలుగగలదు అని పలికిన మహాకాయుడైన హనుమంతునితో సీతమ్మ ఇలా అన్నది.

.

...

మహాభయంకరమైన అలలతో కూడి అతి విస్తారమైన సముద్రాన్ని దాటి రాగలిగిన వారు సామాన్యులా ? కాదు !!

.

నీ సామర్ధ్యము నేను ఎరుగుదు‌ను నీ గమన శక్తి నాకు తెలుసు.

.

కానీ ! 

.

మొదట ఇది రామకార్యము !

.

రామ కార్యము చెడిపోకుండా జరగవలెను .

.

వాయువేగమనోవేగాలతో నీవు వెడుతున్నప్పుడు ఆ వేగతీవ్రత తట్టుకోలేక

నేను కంగారు పడవచ్చును

కళ్ళుతిరిగి క్రింద పడిపోవచ్చును,అప్పుడు సముద్రజంతువులకు ఆహారమై పోయెదను.

.

ఇంకొక మాట ! నీవు నన్ను తీసుకువెళ్ళుట చూసి రాక్షసులూరకుందురా?

.

నన్ను కాపాడుకొనుచూ నీవు వారితోయుద్ధముచేయవలసి రావచ్చును .అది నీకు చాలా క్లిష్టముగా పరిగణించును.ఆ యుద్ధములో వారు నన్ను సంహరింపవచ్చును.లేదా తిరిగి బందీగా మరల పట్టుబడవచ్చును.

.

అదియును గాక !

.

నేను పరపురుషుని పొరపాటున కూడా స్పృశించను...

.

NB

.

"పరపురుషుని స్పృశించను" అని అమ్మ అన్న ఈ మాట మొన్నమొన్నటి వరకు అందరికీ ఆదర్శము .నేడేలనో దానిని ఎవరూ పాటించుటలేదు . పరపురుషుడి "పాణిగ్రహణము" అదే "SHAKE HAND " చాలా సాధారణమై పోయింది.....

.

వూటుకూరు జానకిరామారావు 

.

కామెంట్‌లు లేవు: