16, ఆగస్టు 2023, బుధవారం

జీమూత వాహనుడు ఎవరు? వారి చరిత్ర ఏమి?

 *నిత్యాన్వేషణ:*


జీమూత వాహనుడు ఎవరు? వారి చరిత్ర ఏమి?


హర్షవర్ధన రాజు రచించిన నాగానంద సంస్కృత నాటకం భారతీయ నాటక రంగం లో అగ్ర స్థానం కలిగింది. ప్రాచీన బౌద్ధ జాతక కధలనుండి గ్రహించబడింది. బోధిసత్వుడైన జీమూత వాహనుడు విద్యాధర యువ రాజు. విశ్వప్రేమ కలిగిన వాడు . మలయ పర్వత ప్రాంతమున వార్ధక్యములో విశ్రాంతి పొందుతున్న తన తల్లి తండ్రులను సేవించడానికి రాజ్యాన్ని వదలి పెడతాడు. అచ్చట సిద్ధాస్ దేశ రాకుమార్తెను మలయావతిని ప్రేమించి వివాహామాడుతాడు.

అచ్చట సర్పరాజు గరుడునితో ఒప్పందం ప్రకారం రోజు కొక నాగు ను బలికి సమర్పించుట విని తాను మరణించుటకు సిద్దమై నాగ జాతిని కాపాడే క్రమములో గరుత్మంతుడు తన తప్పు తెలుసుకుని తన క్రూరత్వం విడనాడతాడు. జగన్మాత గౌరి ప్రత్యక్షం అయి యువరాజుని తిరిగి బతికించడంతో నాటకం పూర్తివుతుంది.

శ్రీ హర్షుడు బౌద్ధము ఆచరించుటచే నాటకం లో బుద్ధుడను నాయకునిగా చేసి బౌద్ధ సూత్రాలననుసరించి రచించాడు.(మహాయాన బుద్ధిజం ). నాటకంలోని అంశాలు బౌద్ధ ఫిలాసఫీ కి చెందినవి. పూర్తి పాఠం Nagananda and its social background N.Aiyaswami sastry గారి వ్యాసాలలో సంపూర్ణముగా చదువ గలము

ఇక 12 CE కాలానికి చెందిన భారతీయ సంసృత పండితుడు -హిందూ మత గ్రంథ కర్త. ధర్మశాస్త్రాలు రచించిన బెంగాళీ త్రిమూర్తులలో మొదటివాడు. జీమూత వాహనుడు రచించిన వ్యవహార మాత్రికా , దయభాగ ప్రసిద్ధి గాంచినవి. హిందూ వారసత్వ చట్టంగా బెంగాల్ నందు బ్రిటీషువారు అనుసరించారు. అదే హిందూ వారసత్వ చట్టం 1956 గా స్వతంత్ర ఇండియా లో అమలు పరుచబడుతుంది.

ప్రశ్న అడిగినందుకు ధన్యవాదములు.


*మరొక కథనము*


పాము కోసం ఓ రాకుమారుడు తన జీవితాన్నే పణంగా పెట్టిన కథ!

పూర్వం జీమూతకేతువు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన కుమారుడే జీమూతవాహనుడు!

రాకుమారుడైన జీమూతవాహనుడు చిన్నప్పటి నుంచి రాజ్య ప్రజల పట్లే కాదు, అన్నిప్రాణుల పట్లా ప్రేమ, అభిమానం, దయ దాక్షిణ్య ము చూపించేవాడు. అహం అనేది కొసరు కూడా ఉండేది కాదు.

ఒకరోజు జీమూతుడు అడవిలో విహారం చేస్తుండగా ఒక తెల్లని గుట్ట కనిపించింది. అదేమిటా అని దగ్గరకు వెళ్లి చూసిన అతను, అవన్నీ ఎముకుల పోగులు అని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఇంతలో అతనికి ఎవరో ఏడుస్తున్న ఘోష వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని విన్న జీముతుడికి ముసలి పాము కనిపిస్తుంది. ‘అమ్మా! నువ్వెవరు?ఎముకుల ఏమిటి?’ అని అడుగుతాడు జీమూతుడు. ‘ఏం చెప్పమంటారు! ఆ విష్ణుమూర్తికి వాహనమైన గరుత్మంతుడు మా జాతిని అంతం చెయ్యటానికి కంకణం కట్టుకున్నాడు. రోజూ మా మీద పడి మమ్మల్ని చేల్చుతున్నాడు.ఆ బాధ తట్టుకోలేక మేము- ‘ఇలా రోజు నీకు ఆహారంగా మారతాము’ అని వేడుకున్నాము. రేపు నా కొడుకు వంతు. అందుకే ఈ వేదన!’ అని చెప్పుకొచ్చింది ఆ ముసలి పాము. ఆ మాటలు విన్న జీమూతవాహనుడి మనసు కరిగిపోయి. పైగా గరుత్మంతుని హింస ఇలా కొనసాగితే, ఈ ప్రపంచంలో పాము అన్న ప్రాణి ఏదీ మిగలదు. శంఖచూడునికి బదులుగా తను కనుక గరుత్మంతునికి ఆహారంగా మారితే, అతని ప్రాణాన్ని కాపడటమే కాదు… ఒక జాతి నాశనం కాకుండా రక్షించినట్లవుతుంది.’ ఇలా పరి విధాలుగా ఆలోచించిన జీమూతవాహనుడు, శంఖచూడునికి బదులుగా మర్నాడు తానే గరుత్మంతునికి ఆహారంగా మారేందుకు సిద్ధపడ్డాడు.

మర్నాడు గరుత్మంతుడు వచ్చి ఎవరో సరిగ్గా చూడకుండా. తాను, ఆ శరీరాన్ని పొడిచి పొడిచి చంపసాగాడు. ఇంతలో అక్కడి చేరుకున్నాడు మిత్రవసువు. ‘గరుత్మంతా! నీ ముందు ఎవరు ఉన్నారో కూడా చూసుకోకుండా ప్రవర్తిస్తున్నావా ?. ఒక అల్పమైన ప్రాణి కోసం తన జీవితాన్నే బలి ఇవ్వడానికి సిద్ధపడిన అతని త్యాగాన్ని గుర్తించు’ అని వేడుకున్నాడు. మిత్రవసువు మాటలకి చూసిన గరుత్మంతునికి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. కానీ జీమూతవాహనుడిలో ప్రాణం అప్పటికే కోల్పోతూ వస్తుంది.

చేసిన తప్పుకు తనను నిందించుకున్నాడు గరుత్మంతుడు. కానీ ఏం లాభం! జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్ని జీమూతవాహనుడి కుటుంబం భోరున విలపించసాగింది. వారి దుఃఖాన్ని చూసిన గరుత్మండికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే స్వర్గలోకానికి వెళ్లి అమృతభాండాన్ని తీసుకువచ్చాడు. దానితో జీమూతవాహనుడిలో కొడగట్టిన ప్రాణం తిరిగి మేల్కొంది. తన ప్రాణాలను తిరిగి దక్కించుకున్న జీమూతవాహనుడు సంతోషించలేదు సరికదా, సాటి జీవులు నిరంతరం గరుత్మంతునికి ఆహారంగా మారుతుంటే దాన్ని చూస్తూ గడిపే జీవితం ఎందుకు అని దుఃఖించాడు.

జీమూతవాహనుడి దుఃఖం గరుత్మంతునిలో సైతం పరివర్తన కలిగించింది. ఇకమీదట తాను పాముల జోలికి పోనని జీమూతునికి వాగ్దానం చేశాడు. అంతేకాదు తాను తెచ్చిన అమృతాన్ని ఆ ఎముకుల గుట్ట మీద పోసి తాను చంపిన పాములన్నింటినీ తిరిగి బతికించాడు. అలా ప్రాణం ఎవరిదైనా ఒకటే అని నిరూపించిన జీమూతవాహనుడు, తన దీక్షతో ఏకంగా ఒక జాతినే కాపాడినవాడయ్యాడు.

కామెంట్‌లు లేవు: