సూర్యాస్తమయ వర్ణన
ఇద్దరు మహాకవుల పద్యాలు!
ఉ: కాయజ విక్రియం బడయఁ గాని కులంబున సంభవించి , య
న్యాయము సేయునే యిటు? దురాత్ముఁడు వీఁడు త్రపాభిమానము
ల్మాయఁగదట్టి యంచు, నతిమాత్రము లజ్జితుఁడైన కైవడిన్ ,
తోయజ షండ బాంధవుఁడధో ముఖుఁడయ్యె , నభోంగణమ్మునన్;
శివరాత్రి మాహాత్మ్యము - ద్వి: ఆశ్వా; శ్రీనాధ మహాకవి !
చ: తరుణి ననన్య కాంత నతి దారుణ పుష్ప శిలీముఖ వ్యధా
భర వివశాంగి నంగభవు బారికి నగ్గము సేసి క్రూరుఁడై
యరిగె మహీసురాధఁడహంకృతి తోనని, రోష భీషణ
,
స్ఫురణ వహించెనో యన , నభోమణి దాల్చె కషాయ దీధితిన్;
మనుచరిత్రము- ద్వ: ఆ : అల్లసాని పెద్దన;
ఈయిరువురును ప్రసిధ్ధులే! ఒకరు పురాణఆంధ్రకరణ ప్రతిభాచాతురీ ధురీణుఁఢు.మరియొకరు ప్రబంధమార్గ నిర్ణేత!
పద్యరచనా విషమున నిరువురిది యొకేమార్గము. ఒకరిశైలి ప్రౌఢము.మరియొకరిది కొంత సరళము.
పైపద్యముల నొకింత పరిశీలింతము; ఈరెండు పద్యములు సుమారుగా నొకేరకమైన సందర్భము ననుసరించుట విశేషము!
మొదటిపద్యము శ్రీనాధుని శివరాత్రి మహాత్మ్యము లోనిది. సుకుమారుఁడను బ్రాహ్మణ యువకుడు తనను వలచిన చిన
దాని కనుమొరగి పారిపోవు సందర్భము.
భావము: మన్మధుని బారికి అవకాశంలేని పరమ పవిత్రమైన వేదవిప్రుల యింటఁ బుట్టి , తుంటరియై స్వాభిమానమును సిగ్గును వీడి ,
వీడు యింత నీచమైన కార్యమును చేయునా? (యువతులను మోసగించి పారిపోవుట) యని సిగ్గుతో మొగము వంచుకొను చుండెనా? యనునట్టు సూర్యుడు యెర్రని మోముతో నస్తమించు చుండెనని మొదటి పద్యముయొక్క భావము.
రెండవ పద్యం పెద్దనది. ప్రవరుడు వరూధిని వలపు దిరస్కరించి వెడలెను.నాడు ఆసరికి ప్రొద్దుగ్రుంకెను. ఆదృశ్యమును (సూర్యాస్తమయమును) పెద్దన రెండవ పద్యమున వర్ణించు చున్నాడు.
వయస్సులో ఉన్నపిల్ల. ఇంకా పెళ్ళికానిది. అందమైనదీ, అయిన యీవరూధినిని యీరీతిగా మన్మధ బాణములకు అప్పగించి యీబ్రాహ్మణాధము డహంకారముతో నిట్లేగునా? యని కోపముతో నెర్రవడిన యట్లు సూర్యుడు పడమర దిక్కున
కషాయ కాంతులు వ్యాపింప నస్తమించెను. అని పెద్దన భావము.
సూర్యాస్తమయ వర్ణనము యిరువురకు సమానమే! సుకుమారునియకృత్యములకు సిగ్గుపడి అక్కడ సూర్యుడస్తమింప
గా, ప్రవరునిపై కోపమున నిచట సూర్యుడు అస్తమించినాడు. పదములపోహళింపు,క్రియాప్రయోగము పద్యపుటెత్తుగడ ముగింపు
యిరువురూ సమమే!
ఈవిధముగా శ్రీనాధుని కవిత్వమును సర్వము ననుకరించి పెద్ద యైన పెద్దన గారు పూర్వకవి స్తుతిలో శ్రీనాధమహా
కవిని స్మరణ చేయక పోవుట విచిత్రము!
స్వస్తి!🙏🙏🙏🌷🌷💐💐💐💐💐💐💐💐💐💐🌷🌷🌷💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి